హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీలో నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి విదేశీయులను మోసం చేస్తున్న ముఠాను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన మనస్విని సహా 66 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసు అధికారులు గురువారం వెల్లడించారు.
హైదరాబాద్ హైటెక్ సిటీలో ‘ఎక్సిటో సొల్యూషన్స్’ పేరిట మనస్విని కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కైవాన్ పటేల్, ప్రతీక్, రాహుల్ తో కలిసి ఆ కాల్ సెంటర్ నిర్వహిస్తోంది. నాగాలాండ్‌కు చెందిన వ్యక్తులను టెలీకాలర్లుగా నియమించుకున్నారు. అమెరికన్లే ప్రధాన లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.
హ్యాక్ అయిన బ్యాంక్ ఖాతాలను సరిచేస్తామంటూ నిందితులు మోసాలు చేస్తున్నారు. బ్యాంక్ ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు సేకరించి నిందితులు నగదు కాజేస్తున్నారని అధికారులు చెప్పారు. ముందుగా సోషల్ మీడియా ఖాతాల ద్వారా విదేశీయుల సమాచారాన్ని సేకరిస్తుంది ఈ ముఠా. ఆ తర్వాత మీ బ్యాంక్ ఖాతాలు హ్యాక్ అయ్యాయని తప్పుడు సమాచారంతో కూడిన మెయిల్స్ పంపిస్తారు. వాటిని సరిచేసేందుకు తమను సంప్రదించాలంటూ నకిలీ కస్టమర్ కేర్ సపోర్ట్ నెంబర్లను ఇస్తారు.
అలాంటి మెయిల్స్‌కు స్పందించి తమను సంప్రదించే అమెరికా పౌరుల నుంచి తమకు అవసరమైన సమాచారాన్ని తీసుకుంటారు. వ్యక్తిగత సమాచారంతోపాటు క్రెడిట్, డెబిట్ కార్డుల నెంబర్లు, వాటి సీవీవీలు, ఓటీపీలు వంటి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత వారి బ్యాంక్ ఖాతాల్లోని నగదును కాజేస్తారు. ఈ ముఠా రూ. కోట్లలోనే మోసాలకు పాల్పడి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
నిందితుల నుంచి 63 ల్యాప్‌టాప్‌లు, 52 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు కార్యకలాపాలు సాగించిన కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లను విశ్లేషిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.