భాగ్యనగరంలో ఎండా కాలంలో కురిసిన అకాల వర్షంతో మరోసారి ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఐటీ కారిడార్ మాదాపూర్, జూబ్లీ హిల్స్, బేగంపేట తో పాటు ఆమీర్ పేట, బల్కంపేట, చత్రినాక, చార్మినార్, నాంపల్లి, కంచన్ బాగ్, బహదూర్ పుర ప్రాంతాల్లో కురిసి వర్షాలకు నగరంలో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోవడంతో పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వర్షాల వల్ల ఆఫీసు నుంచి ఇంటికి బయలు దేరిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు చెరువులను తలపించాయి. పలు చోట్ల మ్యాన్ హోల్స్ పొంగిపొర్లాయి. ఇక జీహెచ్ఎంసీ, విద్యుత్, పోలీసు, డిజాస్టర్ మేనేజిమెంట్ సరైన సమయంలో స్పందించి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కొన్ని చోట్ల వర్షాలకు తోడు ఈదురు గాలులు తోడు కావడంతో పలు చోట్ల చెట్లకు నేలకొరిగాయి. ఉదయం నుంచి భానుడు భగ భగ మనిపించినా.. సాయంత్రం మాత్రం ఒక్కసారి వరుణుడు విజృంభించాడు.
అకాల వర్షానికి హైదరాబాద్.. అతలాకుతలమైంది. అల్లకల్లోలానికి గురైంది. ఏకబిగిన కుండపోతగా కురిసిన అతి భారీ వర్షం దెబ్బకు చివురుటాకులా వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు నివాసాల్లో వర్షపునీరు చేరింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం వల్ల జనం అంధకారంలో గడిపారు.
మహారాష్ట్ర నుండి మన్నార్ గల్ఫ్ వరకు మరాఠ్వాడ, కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి కిలో మీటర్ ఎత్తులో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ బెల్ట్‌లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. వర్ష తీవ్రత నేడు కూడా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
ద్రోఫీ ప్రభావంతో దాదాపు రెండు గంటలపాటు హైదరాబాద్‌లో భారీ వర్షం దంచికొట్టింది. ఈదురు గాలులు వీచాయి. వర్షం ధాటికి నగర రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వరద నీరు రోడ్లపై పోటెత్తింది. ప్రవాహాన్ని తలపించింది. ఫలితంగా పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వాహనదారులు గంటల కొద్దీ పడిగాపులు పడాల్సొచ్చింది.
టోలీచౌకి, షేక్‌పేట్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, నానల్ నగర్, లంగర్ హౌజ్, గోల్కొండ, పాతబస్తీ, మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, రాజ్‌భవన్ రోడ్, లక్డీకాపూల్, పంజాగుట్ట, సోమాజిగూడ, ప్రకాష్ నగర్, మెట్టుగూడ, ఉప్పల్, సికింద్రాబాద్, రాణిగంజ్, నాంపల్లి, కోటి, అబిడ్స్, మొజాంజాహీ మార్కెట్, అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి.
శుక్రవారం రాత్రి 10 గంటల సమయానికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో 60కి పైగా చెట్లు నేలకూలాయి. ఈ మేరకు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. విద్యుత్ సిబ్బంది, పోలీసులు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సహాయంతో హైడ్రా చెట్లను తొలగించే పనులను చేపట్టింది.
నల్లకుంట, సరూర్‌నగర్, విజయనగర్ కాలనీ, దారుస్సలాం, హైకోర్టు, బీఎన్ రెడ్డి నగర్, ఫలక్‌నుమా, సుల్తాన్ బజార్, కాచిగూడ, సింధి కాలనీ, మెథడిస్ట్ కాలనీ వంటి ప్రాంతాల్లో చెట్లు నేలకూలినట్లు హైడ్రా వెల్లడించింది. అబిడ్స్‌లో ఓ భారీ క్రేన్ సైతం విరిగి పడటం వర్షాలు, ఈదురు గాలులు తీవ్రతకు అద్దం పట్టింది.
మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిశాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
ఈదురు గాలుకు నగర వ్యాప్తంగా దాదాపు 60 చెట్లు నేలకొరిగాయి. బండ్లగుడ, కంచన్ బాగ్ ప్రాంతాల్లో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వర్షానికి ఈదురు గాలులు తోడు కావడంతో నగరంలో దాదాపు 200కి పైగా కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అటు హైదరాబాద్ పక్కనే ఉన్న సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాలో జోరు వానకు మామిడి పంటతో పాటు వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.