టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి తక్కువ పనితీరు చూపుతున్న ఉద్యోగులకు గట్టిగా హెచ్చరిక వచ్చేసింది. తమ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు కేవలం ఐదు రోజులు గడువు ఇస్తూ, కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ అమీ కోల్మన్ ఏప్రిల్ 22న మేనేజర్లకు ఈ-మెయిల్ పంపారు. దీంతో సంస్థలోని ఉద్యోగులలో టెన్షన్ మొదలైంది.‘గ్లోబల్ వాలంటరీ సెపరేషన్ అగ్రిమెంట్ (GVSA)’ పేరుతో మైక్రోసాఫ్ట్ రెండు ఆప్షన్లు తీసుకొచ్చింది. ఒకటి కఠినమైన లక్ష్యాలతో కూడిన ‘పనితీరు మెరుగుదల ప్రణాళిక (PIP)’. రెండోది 16 వారాల వేతనంతో కూడిన స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీ. అయితే ఏది ఎంచుకున్నా, నిర్ణయం తీసుకోవడానికి ఐదు రోజులు మాత్రమే గడువు.
ఈ ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకుంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. ప్యాకేజీ తీసుకునే వారు మైక్రోసాఫ్ట్‌కి తిరిగి రాబోయే రెండు సంవత్సరాలపాటు దరఖాస్తు చేసుకోలేరు. ఇక, PIP ఎంచుకున్న ఉద్యోగులకు ప్యాకేజీ వర్తించదు. అంతేగాకుండా, ఈ రెండు కేటగిరీల్లో ఉన్నవారు అంతర్గత బదిలీలకు కూడా అనర్హులు.ఈ విధానం ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఐదు రోజుల్లో భవిష్యత్తు నిర్ణయించుకోవడం, మైక్రోసాఫ్ట్‌లో తిరిగి అవకాశం లేకపోవడం వంటి అంశాలు ఆందోళనకు దారితీస్తున్నాయి. దీనివల్ల తక్కువ పనితీరు చూపిన వారిని సులభంగా తక్షణమే వదిలించుకోవడమే అసలు ఉద్దేశమని విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా, మైక్రోసాఫ్ట్ మాత్రం ఈ విధానాన్ని పనితీరు మెరుగుదల కోసం తీసుకొచ్చిన మార్గంగా ప్రాజెక్ట్ చేస్తోంది.
ఈ క్రమంలో మైక్రో సాఫ్ట్ కంపెనీ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌ను బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ సమీక్షించింది. మైక్రోసాఫ్ట్ 22,000 మంది గేమింగ్ వర్కర్లలో 8 శాతం మంది తొలగించనున్నట్లు ఈమెయిల్‌లో మైక్రోసాఫ్ట్ గేమింగ్ చీఫ్ ఫిల్ స్పెన్సర్ పేర్కొన్నారు..కంపెనీ యాక్టివిజన్ బ్లిజార్డ్ కొనుగోలును ఖరారు చేసిన మూడు నెలల్లోనే ఉద్యోగుల తొలగింపులు చేపట్టడం గమనార్హం. భవిష్యత్తుకు అనుగుణంగా తమ వనరులను రీసెట్ చేయడానికే తొలగింపులు చేపడుతున్నట్లు యాక్టివిజన్ పబ్లిషింగ్ చీఫ్ రాబ్ కోస్టిచ్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో పేర్కొన్నట్లు తెలుస్తుంది.. ఇక ముందు కూడా కొందరిని తొలగించనుందని సమాచారం..