పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని వేర్పాటువాద ఉగ్రవాదులు మంగళవారం దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ రైలును హైజాక్ చేశారు. పాక్ నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుంచి నుంచి ఖైబర్ పంఖ్తుఖ్వాలోని పెషావర్‌కు వెళ్తున్న రైలుపై కాల్పులు జరిపి.. రైలును ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో పాటు పలువురు భద్రతా సంస్థలకు చెందిన వారిని బంధీలుగా తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇందులో పాకిస్తాన్ సైనికులు, పోలీసులు, యాంటీ-టెర్రరిజం, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌కి చెందిన సిబ్బంది ఉన్నారు. ఆరుగురు సైనిక సిబ్బందిని హతమార్చినట్లు తెలుస్తున్నది.
వీరంతా సెలవులపై పంజాబ్‌కు ప్రయాణిస్తున్న సమయంలో వారిని బంధీలుగా చేసుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ ఘటన నేపథ్యంలో బలూచిస్తాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. పాకిస్తాన్ మీడియా ప్రకారం.. కొంత మంది సాయుధ వ్యక్తులు క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను పెహ్రో కున్రి -గడ్లార్ మధ్య సొరంగం సమీపంలో నిలిపివేశారు. తొమ్మిది కోచ్‌ల రైలులో 400 మంది ప్రయాణికులు ఉన్నారు. రైలు హైజాక్ గురించి సమాచారం అందుకున్న తర్వాత బలూచిస్తాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. సీబీ ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితి విధించినట్లు బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ తెలిపారు.
అంబులెన్స్‌లు, భద్రతా దళాలు సంఘటనా స్థలానికి బయలుదేరాయి. రైల్వేలు కూడా సహాయక చర్యలను ప్రారంభించాయని షాహిద్ రిండ్ పేర్కొన్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం కోసం డిమాండ్ చేస్తున్నది. పాకిస్తాన్‌తో పాటు చైనాపై దాడులకు పాల్పడనున్నట్లు ప్రకటించింది. ఇందు కోసం బలూచ్ నేషనల్ ఆర్మీ అనే ఏకీకృత సంస్థను ప్రకటించిన కొద్దిరోజులకే.. రైలు హైజాక్ ఘటన చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా తిరుగుబాటుతో బలూచిస్తాన్‌లో ఉగ్రవాద దాడులు జరిగాయి. మార్చి 5న ఖుజ్దార్ జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుడులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
అయితే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను తామే హైజాక్ చేసినట్టుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఉగ్రవాద సంస్థ మంగళవారం ప్రకటించుకుంది. రైలును తాము నియంత్రించామని… ఆరుగురు సైనిక సిబ్బంది మరణించారని, 100 మందికి పైగా జనాలను బందీలుగా తీసుకున్నామని బీఎల్‌ఏ ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
తమ యోధులు బోలాన్‌లోని ధదర్‌లోని మష్కాఫ్‌లో ఖచ్చితంగా ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్ నిర్వహించారని బీఎల్‌ఏ తెలిపింది. ‘‘మా స్వాతంత్య్ర యోధులు రైల్వే ట్రాక్‌ను పేల్చివేశారు,. దీంతో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపవలసి వచ్చింది. యోధులు త్వరగా రైలును నియంత్రించారు. ప్రయాణికులందరినీ బందీలుగా పట్టుకున్నారు’’ అని బీఎల్ఏ పేర్కొంది. ఈ ఆపరేషన్‌ను బీఎల్ఏ మజీద్ బ్రిగేడ్, ఎస్‌టీవోస్, ఫతే స్క్వాడ్ నిర్వహిస్తున్నాయని బీఎల్ఏ ప్రతినిధి తెలిపారు.
జాఫర్ ఎక్స్‌ప్రెస్ పాకిస్తాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రభుత్వం నుంచి ఏదైనా సైనిక చర్యకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీఎల్ఏ హెచ్చరించింది. వందలాది మంది బందీలను ఉరితీస్తామని… ఈ రక్తపాతానికి ఆక్రమిత దళాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది.
జాఫర్ ఎక్స్‌ప్రెస్ తొమ్మిది బోగీలలో 400 మందికి పైగా ప్రయాణికులతో పాకిస్తాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు వెళుతుండగా కాల్పులు జరిగినట్లు పాక్ రైల్వే అధికారులు వార్తా సంస్థ రాయిటర్స్‌కు తెలిపారు.