జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో అత్యంత ఘోరమైన అధ్యాయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేటితో అంటే ఏప్రిల్ 13తో జలియన్‌వాలా బాగ్ ఘటనకు 105 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ(PM Narendra Modi), కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ తదితరులు జలియన్ వాలా బాగ్ అమరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ… జలియన్‌వాలా బాగ్ ఘటనలో వీరుల త్యాగం మనలో దేశభక్తిని పెంపొందిస్తుందని ట్వీట్ చేసారు.
ప్రతి ఏటా ఏప్రిల్ 13న ‘జలియన్‌వాలా బాగ్ దివస్’ జరుపుకుంటారు. 1919లో జరిగిన ఈ ఘటన బ్రిటిష్ వలస పాలనలో భారతీయుల విషయంలో జరిగిన అత్యంత క్రూరమైన దాడులలో ఒకటిగా చరిత్రలో నిలిచింది. నాడు పంజాబ్‌లోని అమృత్‌సర్ లోని జలియన్‌వాలా బాగ్ గార్డెన్ లో బ్రిటిష్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాల మేరకు నిరాయుధ ప్రదర్శనకారులపై సైనికులు తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో వెయ్యిమందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ హత్యాకాండ తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసా ఉద్యమం బలపడింది. జలియన్ వాలా బాగ్ ఘటన బ్రిటిష్ వలస పాలకుల క్రూరత్వాన్ని తెలియజేస్తుంది.