దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో నోట్లకట్టలు బయటపడినట్టు వచ్చిన ఆరోపణలపై దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ నివేదికను సుప్రీంకోర్టు శనివారం రాత్రి(మార్చి 22) తన వెబ్‌సైట్‌లో ఉంచింది.జస్టిస్ యశ్వంత్ వర్మపై దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ ఇచ్చిన నివేదికను, తనపై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ యశ్వంత్ వర్మ సమాధానాలను సుప్రీంకోర్టు వెల్లడించింది.దిల్లీ పోలీసులు అందించిన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా ఈ నివేదికలో ఉన్నాయి. ఫోటోలు, వీడియోల్లో కాలిపోయిన నోట్లు కనిపిస్తున్నాయి. అయితే, నివేదికలోని కొన్ని భాగాలు కనిపించకుండా నలుపు రంగులో ఉంచారు.దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ న్యూదిల్లీలోని అధికారిక నివాసంలో భారీ మొత్తంలో నగదు దొరికినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆయన నివాసంలోని స్టోర్ రూమ్‌లో మార్చి 14న భారీ మంటలు చెలరేగాయి. అప్పుడు ఆయన ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు గుర్తించినట్టు ఆరోపణలొచ్చాయి.
ఈ కేసులో ప్రాథమిక విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయను ఆదేశించారు.ఈ విషయంలో ‘లోతైన దర్యాప్తు’ అవసరమని జస్టిస్ డీకే ఉపాధ్యాయ భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు తెలిపారు.ఆరోపణలపై జస్టిస్ యశ్వంత్ వర్మ వాదనను కూడా సుప్రీంకోర్టు బయటపెట్టింది. తాను లేదా తన కుటుంబ సభ్యులు స్టోర్ రూమ్‌లో ఎప్పుడూ నగదు ఉంచలేదని, తనపై కుట్ర జరుగుతోందని జస్టిస్ యశ్వంత్ వర్మ ఆరోపించారు.మార్చి 15న దిల్లీ పోలీసు కమిషనర్ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదం గురించి తనకు ఫోన్ ద్వారా తెలియజేశారని దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ తన నివేదికలో పేర్కొన్నారు. అయితే కమిషనర్ దిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఏం చెప్పారన్నది వెల్లడించలేదు.ఈ ఘటన గురించి మార్చి 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు జస్టిస్ డీకే ఉపాధ్యాయ తెలియజేశారు.
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో ఉన్న సెక్యూరిటీ గార్డు చెప్పిన దాని ప్రకారం, మార్చి 15 ఉదయం స్టోర్ రూమ్ నుంచి కొన్ని కాలిపోయిన వస్తువులను తొలగించారని జస్టిస్ డీకే ఉపాధ్యాయ తెలిపారు.ఆ తర్వాత జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిని పరిశీలించడానికి జస్టిస్ డీకే ఉపాధ్యాయ తన కార్యదర్శిని పంపారు.స్టోర్ రూమ్‌లో నాలుగైదు బస్తాల సగం కాలిపోయిన నగదు దొరికిందని పోలీసు కమిషనర్ పంపిన కొన్ని నివేదికలను జస్టిస్ డీకే ఉపాధ్యాయ తన రిపోర్టులో చేర్చారు.
ఇంట్లో నివసించే వ్యక్తులు, పనిచేసేవారు, తోటమాలి మాత్రమే స్టోర్ రూమ్‌ను సందర్శించేవారని తన దర్యాప్తులో తేలిందని, కాబట్టి ఈ విషయంలో మరింత దర్యాప్తు అవసరమని జస్టిస్ డీకే ఉపాధ్యాయ తన రిపోర్టులో తెలిపారు.
కొన్ని ఫోటోలు, వీడియోను కూడా పోలీసు కమిషనర్ జస్టిస్ డీకే ఉపాధ్యాయకు పంపారు. ఒక గదిలో కాలిపోతున్న నోట్లు ఈ ఫోటోలు, వీడియోలో కనిపిస్తున్నాయి.ఈ ఫోటోలు, వీడియోను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు కూడా తాను పంపానని, జస్టిస్ యశ్వంత్ వర్మకు కూడా ఇవి చూపించానని జస్టిస్ డీకే ఉపాధ్యాయ చెప్పారు.జస్టిస్ యశ్వంత్ వర్మను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ మూడు ప్రశ్నలు అడిగారు. ‘స్టోర్ రూమ్‌లోకి డబ్బు ఎలా వచ్చింది, ఆ డబ్బు ఎక్కడిది? మార్చి 15 ఉదయం ఈ డబ్బును ఎలా తొలగించారు?’ అని వారు ప్రశ్నించారు.అగ్నిప్రమాదం జరిగినప్పుడు తాను మధ్యప్రదేశ్‌లో ఉన్నానని, మార్చి 15న సాయంత్రం తాను దిల్లీకి తిరిగి వచ్చానని జస్టిస్ యశ్వంత్ వర్మ చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో తన కుమార్తె, సిబ్బంది ఇంట్లోనే ఉన్నారని, కానీ మంటలను ఆర్పిన తర్వాత స్టోర్ రూమ్‌లో నగదును వారు చూడలేదని ఆయన తెలిపారు. దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనకు వీడియో చూపించినప్పుడు కాలిపోయిన నగదు గురించి తనకు మొదటగా తెలిసిందని ఆయనన్నారు.తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ ఇప్పటివరకు ఆ స్టోర్ రూమ్‌లో ఎలాంటి నగదును ఉంచలేదని, ఆ నగదు తమది కాదని ఆయన అన్నారు.”ఎవరైనా లోపలికి ప్రవేశించగలిగేలా తెరిచి ఉన్న గదిలో నగదు ఉంచుతారని చెప్పడం పూర్తిగా నమ్మశక్యం కాదు” అని ఆయన తన సమాధానంలో రాశారు. తాను బ్యాంకు నుంచి మాత్రమే నగదు తీసుకుంటానని, అన్ని లావాదేవీలపత్రాలు తన వద్ద ఉన్నాయని ఆయన అన్నారు.తాను నివసించే చోటు నుంచి, స్టోర్ రూమ్ పూర్తిగా వేరుగా ఉంటుందని, తన ఇంటికి, స్టోర్ రూమ్‌కు మధ్య ఒక గోడ కూడా ఉందని యశ్వంత్ వర్మ తెలిపారు.
ఆరోపణలు వచ్చిన నగదును తనకు చూపించలేదని, అప్పగించలేదని ఆయన చెప్పారు. తన సిబ్బందిని కూడా ప్రశ్నించానని, స్టోర్ రూమ్ నుంచి ఎలాంటి నగదు తీయలేదని వారు కూడా చెప్పినట్టు యశ్వంత్ వర్మ వివరించారు.ఈ కేసు మొత్తం తనపై కుట్ర అని ఆయన ఆరోపించారు. “దశాబ్దకాలానికి పైగా హైకోర్టు జడ్జిగా నేను తెచ్చుకున్న పేరును, గౌరవాన్ని ఈ మొత్తం సంఘటన దెబ్బతీసింది” అని ఆయనన్నారు.ఇప్పటి వరకు తనపై ఎలాంటి ఆరోపణలు రాలేదని, కావాలంటే తన పదవీకాలాన్ని జస్టిస్ డీకే ఉపాధ్యాయ దర్యాప్తు చేసుకోవచ్చని కూడా జస్టిస్ యశ్వంత్ వర్మ అన్నారు.ఇప్పుడు ఈ వ్యవహారంపై దర్యాప్తును భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఏర్పాటు చేసిన కమిటీకి అప్పగించారు. దీనితో పాటు, జస్టిస్ యశ్వంత్ వర్మ గత 6 నెలల కాల్ రికార్డులను కూడా సమర్పించాలని పోలీసులను కోరారు. జస్టిస్ యశ్వంత్ వర్మ తన ఫోన్ నుంచి ఎలాంటి డేటాను తొలగించకుండా కూడా నిషేధం విధించారు.
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీఎస్ సంధవాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ ఉన్నారు.’ఇన్-హౌస్’ కమిటీ ప్రక్రియను 1999లో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసింది. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై వచ్చిన ఫిర్యాదును ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ దర్యాప్తు చేస్తుంది.దర్యాప్తు తర్వాత కమిటీ న్యాయమూర్తిని నిర్దోషిగా నిర్ధారించవచ్చు లేదా న్యాయమూర్తిని రాజీనామా చేయమని కోరవచ్చు. న్యాయమూర్తి రాజీనామా చేయడానికి నిరాకరిస్తే, ఆయనను తొలగించమని కమిటీ ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి తెలియజేయవచ్చు.న్యాయమూర్తిపై చర్య తీసుకోవాలని సీబీఐని భారత ప్రధాన న్యాయమూర్తి ఆదేశించిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి.జస్టిస్ యశ్వంత్ వర్మకు ప్రస్తుతానికి ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలను అప్పగించకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు.