వైసీపీకి ఒకప్పుడు కంచుకోటగా నిలిచిన కాకినాడ రూరల్‌లో జనసేన ఓ ఊహించని షాక్ ఇచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో క్రమంగా బలోపేతమవుతున్న జనసేన… స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక కీలక విజయాన్ని అందుకుంది. కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) పదవిని జనసేన ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాకినాడ రూరల్ మండలంలో వైసీపీ 15 ఎంపీటీసీ సీట్లలో 8 గెలిచింది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… వైసీపీకి చెందిన ఏడుగురు ఎంపీటీసీలు ఒక్కొక్కరుగా జనసేన బాట పట్టారు. ఈ వేళ వైసీపీ ఇంకా ఎనిమిది మందితో బలం కలిగి ఉన్నప్పటికీ… ఎంపీపీ ఎన్నికకు దూరంగా ఉండటం విశేషంగా మారింది.
గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికలో జనసేన వ్యూహాత్మకంగా ముందంజ వేసింది. పార్టీకి అనుకూలంగా ఉన్న ఎంపీటీసీలతో ముందుగానే సమన్వయం చేసుకుని, టీడీపీ మద్దతు కూడా సంపాదించింది. దీంతో పోటీ లేకుండానే జనసేన అభ్యర్థి అనంత లక్ష్మీ ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైసీపీ ఎంపీటీసీలు ఎందుకు ఎన్నికకు హాజరుకాలేదన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం సస్పెన్స్ గా మారింది.
ఈ విజయంతో మాజీ మంత్రి కన్నబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలు గట్టి దెబ్బతిన్నట్లే అంటున్నారు విశ్లేషకులు. వీరికి తిరుగులేని ఆధిపత్యం ఉన్నదన్న నమ్మకాన్ని జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఛాలెంజ్ చేసినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇది కేవలం ఒక ఎంపీపీ పదవి మాత్రమే కాకుండా… వైసీపీ నేతలకు ఇచ్చిన ఒక రాజకీయ సందేశంగా పరిగణిస్తున్నారు. ఇక ఇదే టెంపో కొనసాగితే రూరల్ కాకినాడలో జనసేన పట్టు మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.