గతంలో ఎప్పుడు చూడని విపత్కర పరిస్థితులను వైసీపీ చూస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది. 151 స్థానాల్లో ఘన విజయం సాధించిన ఆ పార్టీ , 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు పరిమితం అయింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ కూటమి ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుంది.అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది.11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించ లేకపోయింది. నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది.
ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలయ్యాయి. వైసీపీ ఘోర ఓటమితో ఆ క్యాడర్ డీలా పడిపోయింది. మరోవైపు పార్టీకి కీలక నేతలంతా కూడా రాజీనామా చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన నేతలంతా కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు.పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి సైతం ఇటీవలే పార్టీతో పాటు, తన రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
పార్టీ నుంచి వెళ్లే వారు తప్పిస్తే..పార్టీలోకి వచ్చే నేతలెవ్వరూ కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల ముందు పార్టీని వీడిన నేత , తిరిగి వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ నేత మరెవరో కాదు.. సీనియర్ నేత కాపు రామచంద్రారెడ్డి. గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన వైసీపీని వీడి బీజేపీలో చేరారు. రాయలసీమలోని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా కాపు రామచంద్రారెడ్డి విజయం సాధించారు.2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయనకు , తిరిగి టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారు.
దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసి చేశారు.కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్ధితి ఏమాత్రం మెరుగు పడకపోవడం, అదే సమయంలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదరడంతో ఆయన బీజేపీలోకి ఫిరాయించారు.గత ఎన్నికల్లో ఏపీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న మెట్టు గోవింద రెడ్డి వైసీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి కాల్వ శ్రీనివాసులు ఇక్కడ నుంచి విజయం సాధించారు.ఓడిపోయిన తర్వాత మెట్టు గోవింద రెడ్డి పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా లేరు.
బెంగళూరులో ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పెద్దగా పాల్గొనడం లేదు.దీంతో పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది.ఇదే సమయంలో కాపు రామచంద్రారెడ్డి సైతం తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.బీజేపీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో తిరిగి ఆయన తన సొంత గూటికి చేరుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది.జగన్‌తో తనకున్న సాన్నిహిత్యం కారణంగా ఆయన తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నట్టు సమాచారం అదుతోంది.అన్ని అనుకున్నట్టు జరిగితే జగన్ జిల్లాల పర్యటన సమయంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అనంతపురం జిల్లాలోని రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009, 2012, 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడు సార్లు రాయదుర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌గా పనిచేశారు.
ప్రస్తుతం వైసీపీ తన అనుకూల రాజకీయ పరిస్థితులను మెరుగుపర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. పార్టీకి మద్దతుగా నాయకత్వం వహించే నేతల అవసరం తలెత్తుతోంది. కాపు రామచంద్రారెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. అందుకే, తిరిగి తన సొంత గూటికి చేరేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. జగన్ జిల్లాల పర్యటన సమయంలో, ఈ నేత వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.