మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం పై వైద్యులు కీలక సూచన చేసారు. కొంత కాలంగా గుండె సంబంధిత సమస్యతో నాని బాధ పడుతున్నారు. గత వారం ఛాతీలో నొప్పితో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో నాని చికిత్స తీసుకున్నారు. గుండె సంబంధిత పరీక్షలు చేయగా.. మూడు కవాటాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించారు. తొలుత స్టంట్స్ వేయాలని భావించినా.. మూడు వాల్వ్స్ లో బ్లాకులు ఉండటంతో సర్జరీ అవసరమని నిర్దారించారు. ఇద ేసమయంలో మూత్ర పిండాల సమస్య తీవ్రత పెరిగింది. దీంతో, ఇప్పుడు కొడాలి నానిని ప్రత్యేక ఫ్లైట్ లో ముంబాయికి తరలిస్తున్నారు.
మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యల తో బాధ పడుతున్నారు. 2024 ఎన్నికల్లో పార్టీతో పాటుగా నాని సైతం గుడివాడ నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయారు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లో తరచూ చెకప్ చేయించుకొని చికిత్స తీసుకుంటున్నారు. గత వారం ఛాతీలో నొప్పి రావటంతో ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో చేసిన పరీక్షల్లో గుండెలోని మూడు కవాటాల్లో బ్లాకులు ఉన్నట్లు గుర్తించారు. వీటి కోసం బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్దారించారు. మాజీ సీఎం జగన్ వైద్యులతో మాట్లాడిన సమయంలో వెంటనే సర్జరీ చేయించాలని సూచించారు.
తొలుత హైదరాబాద్ లోనే ఈ సర్జరీ చేయించాలని కొడాలి నాని కుటుంబ సభ్యులు భావించారు. అయితే, వైద్యులతో జగన్ మాట్లాడిన తరువాత ముంబాయిలోని ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ లో సర్జరీ చేయించాలని నిర్ణయించారు. గతంలో మాజీ మంత్రి విశ్వరూప్ కు సైతం ఇదే తరహా సమస్య రాగా.. ముంబాయిలోనే సర్జరీ చేయించుకొని కోలుకున్న విషయం ప్రస్తావనకు వచ్చింది. దీంతో, ఇప్పుడు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ముంబాయికి కుటుంబ సభ్యులు తరలించారు. ఇప్పటికే నాని కుటుంబ సభ్యులు వైద్య పరీక్షల రిపోర్ట్స్ తో ముంబాయిలోని వైద్యులతో సంప్రదింపులు చేసారు. గుండె తో పాటుగా మూత్ర పిండాల సమస్యల తీవ్రత పెరగటంతో వైద్యుల సూచన మేరకు ఈ రోజు అక్కడ ఆస్పత్రిలో చేర్చాలని నిర్ణయించారు. బుధవారం నానికి సర్జరీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నానిని తరలిస్తున్న బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో గుండె సంబంధిత సమస్యల పరిష్కారానికి పేరుంది. అక్కడ ఆయనకు గుండె సర్జరీ నిపుణులు డాక్టర్ పాండా బైపాస్ సర్జరీ చేయనున్నారు. గతంలో డాక్టర్ పాండా దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ , లాలూ ప్రసాద్ యాదవ్, కొనకళ్ల నారాయణ , రఘురామకృష్ణంరాజు లకు ఆయనే బైపాస్ సర్జరీ చేశారు. కాగా, కొడాలి నాని ఆరోగ్యం పై మాజీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సర్జరీ తరువాత రెండు నెలలు కొడాలి నాని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీంతో, కొడాలి నాని ఆరోగ్యం పై ఆందోళన వద్దని పార్టీ శ్రేణులు.. అభిమానులకు కుటుంబ సభ్యులు సూచిస్తున్నారు.