తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, మోదీని వ్యక్తిగతంగా తప్పుబట్టలేదని, ఆయన పుట్టుకతో బీసీ కాదని మాత్రమే అన్నానని స్పష్టం చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు వక్రీకరించారని ఆరోపించారు.
ప్రధానమంత్రికి నిజమైన బీసీ సంక్షేమ చిత్తశుద్ధి ఉంటే, జనగణనలో కుల గణన చేపట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఈ ప్రక్రియను సమగ్రంగా పూర్తి చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ గణన ఆధారంగా ప్రభుత్వ విధానాలు రూపొందించి, బీసీలకు మరింత న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
తెలంగాణలో చేపట్టిన కుల గణన దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని రేవంత్ అభిప్రాయపడ్డారు. ప్రజా సంక్షేమానికి ఇది అవసరమని, రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. మరోవైపు, రాహుల్‌తో భేటీలో మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేశారు.
బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించిన రేవంత్, కేంద్రం బీసీ సంక్షేమానికి చిత్తశుద్ధితో వ్యవహరిస్తే కుల గణనపై స్పష్టత ఇవ్వాలని సవాల్ విసిరారు. బీజేపీ నేతల ఆరోపణలు అసత్యమని, నిజమైన బీసీల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మరోసారి స్పష్టం చేశారు.
కులగణన నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో ఈ కులగణన ప్రారంభం కానుంది. ఈ సర్వే కోసం సుమారు 48 వేల మంది ప్రభుత్వ సిబ్బంది పనిచేయబోతున్నారు. వారిలో 40 వేల మంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రాథమిక పాఠశాలలను ఒంటిపూట నడపనున్నారు. మధ్యాహ్నం తరువాత సర్వే చేస్తారు.
‘తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే’ పేరుతో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఒక్కొక ఎన్యూమరేటర్ 150 ఇళ్ల వరకూ సర్వే చేస్తారు. 50కి పైగా ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటారు. కుటుంబ సభ్యుల సంఖ్య, చదువు, ఆదాయం, బ్యాంకు ఖాతాలు, పెళ్లి సమయంలో వయసు, పిల్లల వయసు, ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం, భూమి, కుల వృత్తి, ఇంటి మీద అప్పు, కులాంతర వివాహాలు వంటి వివరాలన్నీ ప్రభుత్వం సేకరిస్తుంది.
ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జిల్లా స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం సర్వేకు సహకరించాలని టీపీసీసీ ఆదేశాలు కూడా జారీ చేసింది.
బీసీ కుల గణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపే సమీక్షల్లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటున్నారు. తెలంగాణ బీసీ కమిషన్ ఈ బాధ్యతను చూసుకుంటోంది.
కుల గణనపై రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో విద్యావంతులతో చర్చలు జరపబోతున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయిలో సర్వేకి సన్నాహక సమావేశాలు పెట్టుకుంది. బూత్ లెవెల్ నుంచి దీనిపై పనిచేయాలని ఆదేశాలున్నాయి. ఈ కుల గణనకు సంబంధించి గాంధీ భవన్‌లో సన్నాహక సమావేశం కూడా జరిగింది.
ఇది ఒక బృహత్తర కార్యక్రమం. ఇప్పటి వరకూ జనాభాలో 52 శాతం బీసీలు అని చెబుతున్నాం. దాన్ని రుజువు చేసే అవకాశం ఈ సర్వే ద్వారా దక్కింది. ఒకవేళ సర్వేలో తప్పు లెక్కలు వస్తే ఆ బాధ్యత ప్రజలది, కుల సంఘాలదే. కాబట్టి అంతా సరైన సమాచారం చెప్పాలి. ఒకవేళ కులం తప్పు చెబితే, క్రిమినల్ చర్యలుంటాయి. ఇప్పుడు తప్పితే మళ్లీ అలాంటి గణన జరుగుతుందో లేదో తెలియదు. దీని ద్వారా అన్ని కులాల లెక్కలు, వారి ఆర్థిక స్థితిగతులు తేలుతాయి. ఎన్యూమరేటర్లు తప్పు చేయకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు’’ అని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు.
మరోవైపు ఈ కులగణన ప్రభావం, తీవ్రతను తెలిపే ఆసక్తికర చర్య తీసుకుంది రేవంత్ ప్రభుత్వం. కుల గణన విషయంలో హైకోర్టు ఆదేశాలు కూడా అమలు చేస్తోంది.
స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ నిర్ధరించే కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిపై బీసీ సంఘం నాయకుడు ఆర్.కృష్ణయ్య సహా అనేక బీసీ సంఘాల నాయకులు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ఎంతో ఘనంగా ప్రచారం చేసుకుంటోంది.
‘‘కులగణన నిలబడాలంటే ఈ డెడికేటెడ్ కమిషన్ వేయక తప్పదు. ఆలస్యంగా యూటర్న్ తీసుకున్నా, ఇది మంచి నిర్ణయం.’’ అంటూ బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు.
అయితే, తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇదంతా ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న హడావుడి అని విమర్శిస్తున్నారు.
ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ ‘‘కేసీఆర్ పాలనలో సమగ్ర సర్వే పేరుతో ఒక సర్వే చేయించారు. ఆ రిపోర్ట్ ఏమయింది ? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రిపోర్టును బయటపెట్టవచ్చు కదా. ఒక రిపోర్టు ఉండగా మళ్లీ బీసీ గణన ఎందుకు? కులాలు మారతాయా? ఇదంతా టైమ్ పాస్ వ్యవహారం’’ అని విమర్శించారు.
రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావాలంటే ఏ కులం వారు ఎందరు ఉన్నారన్న లెక్క తేలాలి.
దేశంలో కులాల లెక్కలు ఏ రాష్ట్రంలోనూ సమగ్రంగా లేవు. కేవలం ఎస్సీ, ఎస్టీల లెక్కలు మాత్రమే జనాభా లెక్కలతో కలిపి లెక్కిస్తారు. ఇతర కులాల లెక్కలు ఉండవు. దీంతో స్థానిక సంస్థలైన పంచాయితీలు, మునిసిపల్ ఎన్నికల్లో బీసీలకు ఎన్ని స్థానాలు రిజర్వ్ చేయాలన్నది పెద్ద సమస్యగా మారుతోంది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చింది.
2023 తెలంగాణ ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో కామారెడ్డిలో సభ పెట్టిన కాంగ్రెస్ పార్టీ, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది.
అంతకుముందు అంటే 2018 ఎన్నికల్లో కూడా బీసీ కులగణన చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. దీంతో ఈ కులగణన చేపట్టాలని పార్టీ పట్టుదలతో ఉంది. సరిగ్గా అదే సమయంలో కుల గణనపై హైకోర్టులో కొన్ని పాత కేసుల మీద తీర్పు వచ్చింది.
‘‘మూడు నెలల్లోపు ఓబీసీల జనాభా లెక్కించాలి’’ అని తెలంగాణ హైకోర్టు ఈ సెప్టెంబరులో ఆదేశాలు ఇచ్చింది.
అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కులగణన చేపట్టాలన్న సంకల్పంతో ఉంది. దీంతో ఈ ప్రక్రియ వెంటవెంటనే ప్రారంభం అయింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కులగణనను ఒక ఎజెండాగా పెట్టుకుంది.
కులగణనతో ప్రభుత్వ పథకాలు, రిజర్వేషన్ల శాతాల్లాంటి అనేక అంశాలు మారిపోతాయని ఆ పార్టీ వాదిస్తోంది. బీజేపీ ఇందుకు ఎక్కువగా ఆసక్తి కనబరచడం లేదు. దీంతో కులగణన చేపట్టాలంటూ ప్రతి వేదిక మీదా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ కులగణన గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు.
ఇపుడు కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణనను జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలని రాహుల్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. రాహుల్ ఇక్కడికి వచ్చి కుల గణన గురించి మాట్లాడటం వల్ల జాతీయ స్థాయిలో తమ వాదన వినబడుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
తెలంగాణలో కుల గణన ప్రారంభానికి ముందు రోజు రాహుల్ హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశారు.
‘‘ఏ నిష్పత్తిలో జనాభా ఉంటే ఆ నిష్పత్తి ప్రకారం సంపద పంపిణీ జరగాలి. దేశంలో కుల గణన జరగాలి. మేధావులు, విద్యార్థి నాయకులు, కుల సంఘాల నాయకులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సీఎం, నేను భావించాం. ఈ నెల 5న సాయంత్రం నాలుగు గంటలకు బోయిన్ పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో పీసీసీ ఆధ్వర్యంలో కుల గణన మీద జరిగే సలహాల సేకరణలో రాహుల్ గాంధీ, ఖర్గేలు పాల్గొంటారు. కుల సర్వే పై సూచనలు, సలహాలు స్వీకరిస్తాం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కుటుంబ సర్వేలో భాగం కావాలి. అభివృద్ధి, సంక్షేమం పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుంది’’ అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్లలో కుల గణన జరగడం ఇది రెండో సారి. మొదటిసారి 2014లో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే పేరుతో కులాల లెక్కలు, వారి ఆర్థిక స్థితిగతులు లెక్కించారు.
అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంగానీ, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంగానీ ఆ లెక్కలను నేటికీ బయట పెట్టలేదు. తాజాగా రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సర్వే ప్రారంభించింది.