వృద్ధురాలైన తల్లిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో బంధించి … కుటుంబమంతా కుంభమేళా(Kumba Mela)కు వెళ్లడంతో ఆ తల్లి ఆకలితో అలమటించిన విషాద ఘటన జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో జరిగింది. రామ్‌గఢ్‌లోని సుభాష్‌నగర్ కాలనీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) క్వార్టర్స్‌లో సీసీఎల్ ఉద్యోగి అయిన అఖిలేశ్‌కుమార్ నివాసముంటున్నాడు.
మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్ (Prayag Raj) వెళ్లాలని భావించి … భార్యాపిల్లలు, అత్తమామలతో కలిసి యుపికి వెళ్లాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న 65 ఏళ్ల తన తల్లి సంజూదేవిపై ఏమాత్రం కనికరం లేకుండా ఇంట్లోనే ఉంచి తాళం వేశాడు. సోమవారం నుంచి ఇంట్లో బందీగా ఉన్న ఆ వృద్ధురాలు అప్పటి నుంచి కేవలం అటుకులు తింటోంది.
ఈ క్రమంలో ఆకలిని తట్టుకోలేక విలపిస్తుండడంతో పొరుగింటివారు గమనించి బుధవారం వృద్ధురాలి కుమార్తె చాందినీదేవికి సమాచారం అందించారు. చాందినీదేవి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఇంటి తాళాలను పగలగొట్టి వృద్ధురాలిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు. చాందినీదేవి మాట్లాడుతూ … ”పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి మా అమ్మను బయటకు తీసుకొచ్చారు. వెంటనే పొరుగింటివారు ఆహారం పెట్టారు. ఔషధాలను కూడా ఇచ్చి సీసీఎల్ ఆసుపత్రిలో చేర్పించాం” అని తెలిపారు.
తన సోదరుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించిందని చెప్పారు. అయితే అఖిలేశ్ కుమార్ మాట్లాడుతూ … తన తల్లి అనారోగ్యంతో ఉందని, ఆమెకు ఆహారానికి సంబంధించి అన్నిరకాల ఏర్పాట్లు చేసిన తర్వాతే తాము ప్రయాగ్‌రాజ్ కు వెళ్లామని చెప్పాడు. ఘటనపై పోలీసులు (Police)దర్యాప్తు చేపట్టారు.