దొంగతనానికి పాల్పడే ఏ ఒక్కరు కూడా దొరక్కుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. తాము చేసేది ఏమాత్రం తప్పుకాదని భావిస్తూ మరీ చోరీలకు పాల్పడుతుంటారు. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ దొంగ మాత్రం.. తాను చోరీకి ఎందుకు పాల్పడాల్సి వస్తుందో చెప్పాడు. తాను చేసేది తప్పే అయినా తప్పుక చేస్తున్నానని.. అవసరం ఉన్నన్ని డబ్బులు మాత్రమే తీసుకున్నానని చెప్పాడు. ఆరు నెలల్లోనే తీసుకున్న డబ్బులును తిరిగి ఇచ్చేస్తానని.. ఒకవేళ వాటిని చెల్లించలేకపోతే పోలీసులకు తనను పట్టించవచ్చని కూడా వెల్లడించాడు. మరి ఈ దొంగ కథేంటి, ఎక్కడ దొంగతనానికి పాల్పడ్డాడు, ఎంత మొత్తంలో డబ్బులు కొట్టేశాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్య ప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాకు చెందిన జుజర్ అలీ బోహ్రా.. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జమీదార్ మొహల్లాలో ఓ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే శ్రీరామ నవమి పండుగ రోజు ఈ దుకాణంలో దొంగలు పడ్డారు. మొత్తంగా షాపులోంచి రూ.2.45 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. అయితే మరుసటి రోజు ఉదయమే దుకాణం తెరిచేందుకు వచ్చిన జజుర్ అలీ బోహ్రాకి.. తన దుకాణంలో దొంగలు పడినట్లు అర్థం అయింది. ముఖ్యంగా తాను దాచుకున్న డబ్బులోంచి రెండున్నర లక్షలు కనిపించకుండా పోవడంతో.. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న కొత్వాలి పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ అర్షద్ ఖాన్ మిగతా పోలీసులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు.
అక్కడే ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని వెతుకుతుండగా.. ఓ లేఖ దొరికింది. అయితే అందులో ఉన్న ముచ్చట చూసి పోలీసులంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా దాన్ని దొంగనే రాసి పెట్టి వెళ్లాడని యజమాని జుజర్ అలీ బోహ్రాకి చెప్పారు. అయితే అందులో ఏముందంటే… నేను ఈ ప్రాంతానికి పొరుగునే ఉంటానని దొంగ వివరించాడు. కొన్ని రోజుల నుంచి తనకు అప్పులు ఎక్కువయ్యాయని.. అప్పుల వాళ్లు రోజూ ఇంటికి వచ్చి వేధిస్తున్నారని తన బాధ చెప్పుకొచ్చాడు. తాను దొంగతనం చేయాలనుకోలేదని.. కానీ వేరే పరిస్థితి లేక ఇలా చేయాల్సి వస్తోందని చెప్పాడు.
మీ దగ్గర నుంచి అవసరం అయినంత డబ్బును మాత్రమే తీసుకున్నానని.. ఆరు నెలల్లోనే తిరిగి ఇచ్చేస్తానంటూ దొంగ లేఖలో వెల్లడించాడు. లేని పక్షంలో తనను పోలీసులకు పట్టించవచ్చని స్పష్టం చేశాడు. ఈ డబ్బు ఇప్పుడు నాకు చాలా అవసరం అని మరోసారి తెలిపాడు. అంతేకాకుండా శ్రీరామ నవమి రోజు దొంగతనానికి పాల్పడినందుకు క్షమాపణలు అంటూ లేఖను ముగించాడు. ఈ లేఖ గురించి యజమానికి జుజర్ అలీ బోహ్రాకి చెప్పగా.. తాను కూడా ఇది నిజమైన దొంగ రాసిందే అనిపిస్తోందని చెప్పాడు.
అందుకు కారణం తన బ్యాగులో మొత్తంగా రూ.2.84 లక్షలు పెట్టానని.. కానీ రూ.2.45 లక్షల మాత్రమే చోరీకి గురయ్యాయని వెల్లడించాడు. అయినప్పటికీ పోలీసులు దొంగ కోసం గాలిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుండగా.. అతడు మంచి దొంగలా ఉన్నాడంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వార్త చూస్తే మీకేం అనిపిస్తుందో కామెంట్ల రూపంలో వెల్లడించేయండి.