Madhya Pradesh: మోహన్ యాదవ్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్(Madhya Pradesh) సర్కారు మతపరమైన నగరాల్లో మద్య పాన నిషేదం దిశగా చారిత్రాత్మక అడుగు వేసింది. రాష్ట్రంలోని ప్రముఖ మతమరమైన 19 పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు అంటే ఏప్రిల్ 1, 2025 నుంచి మద్యం దుకాణాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అహల్యాబాయి నగరంగా పేరొందిన మహేశ్వర్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మద్యం దుకాణాలను మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దీనితో ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్రంలోని ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, మండలేశ్వర్, ఓర్చా, మైహార్, చిత్రకూట్, దతియా, పన్నా, మాండ్లా, ముల్తాయ్, మందసౌర్, సల్కన్‌పూర్ పంచాయితీ, అమర్‌కంటక్ పట్టణం, బర్మాన్‌కలన్, బర్మన్‌ఖుర్డ్, లింగ తదితర ప్రాంతాల్లోని అన్ని మద్యం దుకాణాలను, బార్‌లు మూసివేయనున్నారు.
మధ్యప్రదేశ్ లోని 19 పట్టణ, గ్రామీణ ప్రాంతాలను పవిత్రమైనవిగా ప్రకటించిన ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మద్యపాన నిషేధం విధించింది. ఈ జాబితాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్, ఆరు మున్సిపల్ కౌన్సిల్‌లు, ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మద్యపాన వ్యసన నిర్మూలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసిందని ముఖ్యమంత్రి డాక్టర్ యాదవ్ పేర్కొన్నారు. సీఎం సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ తమ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలోని మతపరమైన ప్రదేశాలలో నెలకొన్న అసమానతలపై చర్చించామన్నారు. ఉజ్జయినిలో ఆలయానికి ఒక కిలోమీటరు పరిధిలో మాత్రమే మద్యాన్ని నిషేధించామన్నారు. రాష్ట్రమంతటా మద్యాన్ని నిషేధించాలని అనుకోవడం లేదన్నారు. మతపరమైన నగరాల్లో మాత్రమే మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయించామని తెలిపారు.