జల్‌పల్లిలోని సినీ నటుడు మోహన్ బాబు (Actor Mohan Babu) ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ మంచు మనోజ్ (Manchu Manoj) నిరసనకు దిగారు. మోహన్ బాబు ఇంటి గేటు వద్ద కూర్చుని మనోజ్ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి జెల్‌పల్లి వద్ద ఉన్న మంచు టౌన్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. మంచు టౌన్ వద్దకు ఎవరిని అనుమతించనడం లేదు. మంచు టౌన్ కు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వందమంది పోలీసులతో పహాడీ షరీఫ్ పోలీసులు బందో బందబస్తు ఏర్పాటు చేశారు.
తన నివాసంలో చోరీ జరిగిందంటూ పహాడీ షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తన అన్న మంచు విష్ణు తన ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేసి కార్లను దొంగలించారంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం కార్లను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇదే నేపథ్యంలో ఈరోజు (బుధవారం) మంచు మనోజ్ జల్‌పల్లిలోని నివాసానికి వెళ్లడానికి యత్నించాడు. అయితే గేటు ఓపెన్ చేయకపోవడంతో ఇంటి ముందే కూర్చుని మంచు మనోజ్ నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఇంటి వద్ద గొడవలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు వంద మంది పోలీసులతో జల్‌పల్లి నివాసం వద్ద భద్రత కొనసాగిస్తున్నారు. జల్‌పల్లి నివాసం వద్దకు ఎవరినీ కూడా అనుమతించని పరిస్థితి.
అంతకు ముందు గత ఏడాది కూడా మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య వివాదం నడిచింది. మంచు మనోజ్‌ను జల్‌పల్లిలోని ఇంటి నుంచి బయటకు పంపేయడంతో హైడ్రామా కొనసాగింది. అన్నదమ్ములు ఇద్దరు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు కూడా. అంతేకాకుండా జల్‌పల్లి వద్ద దృశ్యాలను కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ రెడ్డి రెచ్చిపోయి దాడి చేశారు. ఈ ఘటనలో ఓ జర్నలిస్టు గాయపడిన విషయం తెలిసిందే. ఆ తరువాత మోహన్ బాబు హైబీపీతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. అయితే జర్నలిస్టులపై దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మోహన్ బాబు క్షమాపణ చెప్పాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో దిగివచ్చిన మోహన్ బాబు గాయపడిన జర్నలిస్టును ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించారు.
అలాగే ఆస్తి పంపకాలకు సంబంధించి మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు కూడా. జల్‌పల్లి వద్ద గొడవ అనంతరం మోహన్ బాబు తిరుపతిలో ఉండగా.. జల్‌పల్లిలో మంచు మనోజ్, భార్య మౌనిక, కూతురితో కలిసి నివాసముంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ సిటీజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్న రంగారెడ్డి కలెక్టర్.. జల్‌పల్లిలో ఉంటున్న మనోజ్‌కు నోటీసులు ఇచ్చారు. ఇలా మంచు ఫ్యామిలీ రోజుకో ట్విస్టులతో నిత్యం వార్తల్లో నిలిచింది. అయితే కొంతకాలంగా మంచు ఫ్యామిలీ నుంచి ఎలాంటి న్యూస్‌లు బయటకు రాలేదు. ఇప్పుడు తాజాగా తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ మంచు మనోజ్ జల్‌పల్లి ఇంటి వద్ద ఆందోళనకు దిగడం హాట్‌టాపిక్‌గా మారింది. ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.