భారత ఆర్థిక వ్యవస్థ మందగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో జీడీపీ 6.2 శాతానికే పరిమితమయ్యింది. ఇది నాలుగేండ్ల కనిష్ట స్థాయి కావడం ఆందోళన కలిగించే అంశం. తయారీ, మైనింగ్ రంగాల్లో పేలవమైన పనితీరు కారణంగా వృద్ధి క్షీణించిందని కేంద్ర గణంకాల శాఖ (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం ఓ నివేదికలో వెల్లడించింది. 2023-24 ఇదే త్రైమాసికంలో 9.5 శాతం వృద్ధి నమోదయ్యింది. దీంతో పోల్చితే భారీగా తగ్గింది. గతేడాది జులై – సెప్టెంబర్ త్రైమాసికంలోని 5.6 శాతం వృద్ధితో పోల్చితే కొంత మెరుగుదల కనబడింది. 2024-25లో జీడీపీ 6.4 శాతం ఉండొచ్చన్న ఎన్‌ఎస్‌ఓ గణంకాలతో పోల్చినా పేలవ ప్రదర్శన నమోదయ్యింది. ఆర్బీఐ, ఆర్ధిక సర్వే వేరు వేరుగా వేసిన అంచనా 6.8 శాతం కంటే కూడా తక్కువే కావడం గమనార్హం.
గడిచిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రేటును 8.2 శాతం నుంచి 9.2 శాతానికి సవరించింది. 2022-23లో ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం, 2021-22లో 8.7 శాతం చొప్పున వృద్ధి చోటు చేసుకుంది. గడిచిన డిసెంబర్ త్రైమాసికంలో స్థిర ధరల వద్ద జీడీపీ రూ.47.17 లక్షల కోట్లుగా ఎన్‌ఎస్‌ఓ అంచనా వేసింది. ఆర్ధిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగం రాణించగా.. తయారీ రంగం వెలవెల పోయింది. 2024 డిసెంబర్ త్రైమాసికంలో తయారీ రంగం ఏకంగా 3.5 శాతానికి క్షీణించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో తయారీలో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. దీంతో పోల్చితే భారీ పతనాన్ని చవి చూసింది. క్రితం క్యూ3లో గనుల రంగం 2.8 శాతం పెరుగుదలతో పేలవ ప్రదర్శన కనబర్చింది.
ఇంతక్రితం ఏడాది ఈ రంగం 3.2 శాతం వృద్ధిని సాధించింది. వ్యవసాయ రంగం మెరుగైన ప్రగతిని కనబర్చింది. ఈ రంగం 5.6 శాతం వృద్ధిని సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ రంగం 1.5 శాతం మాత్రమే పెరిగింది. ఇదే సమయంలో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సర్వీసులు 10.1 శాతం వృద్ధిని కనబర్చగా.. గడిచిన క్యూ3లో 5.1 శాతానికి పరిమితమయ్యాయి. ఫైనాన్సియల్, రియల్ ఎస్టేట్, నైపుణ్య సేవలు 8.4 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గాయి. ప్రపంచంలోనే భారత్ అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతోందని మోడీ సర్కార్ ప్రచార ఆర్బాటాలకు భిన్నంగా వాస్తవ పరిస్థితులు చోటు చేసుకోవడం గమనార్హం. కనీసం 7 శాతం వృద్ధిని కూడా సాధించలేకపోవడంతో ఆర్ధిక వ్యవస్థ పనితీరు, ప్రగతిపై అనుమానాలు పెరుగుతున్నాయి. దేశ జనాభాకు సరిపడ ఉద్యోగాల సృష్టి జరగాలంటే కనీసం 9 శాతం వృద్ధి ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.