ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. సింగపూర్‌లోని రివర్ వ్యాలీ రోడ్ లో ఉన్న టమాటో కుకింగ్ స్కూల్ లో ఈ ప్రమాదం జరిగింది. పొగ వలన ఊపిరాడకపోవడంతో ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం మార్క్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన కాళ్ళు, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాద సమాచారం అందిన వెంటనే పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవితో కలిసి సింగపూర్ వెళ్లారు. అయితే, పవన్ ముందుగా తన ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలు ముగించుకొని రాత్రి సింగపూర్ బయల్దేరారు. పవన్‌కల్యాణ్ కుమారుడి యోగక్షేమాలగురించి తెలుగురాష్ట్రాల నేతలతో పాటు ప్రధాని కూడా ఆరాతీశారు. పవన్‌కల్యాణ్‌కి ఫోన్‌చేసి మాట్లాడారు మోదీ. అంతేకాదు సింగపూర్‌లో ఉన్న ఇండియన్ హై కమిషనర్‌ను అలర్ట్ చేశారు ప్రధాని. అవసరమైన సహకారం అందించాలని విదేశాంగ శాఖను పురమాయించారు. మార్క్‌శంకర్ త్వరగా కోలుకోవాలని జనసేనశ్రేణులు కొన్నిచోట్ల ఆలయాల్లో పూజలు చేశారు. అంతేకాదు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, వైసీపీ అధినేత జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు.. అనేక మంది రాజకీయ నాయకులు, సినీ రంగ ప్రముఖులు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ పవన్ కల్యాణ్ ఓ నోట్ విడుదల చేశారు. అందరి ఆశీస్సులతో మార్క్ శంకర్ కోలుకుంటున్నారని చెప్పారు. ఇక కాళ్లూ చేతులకు గాయాలైన మార్క్‌శంకర్ కోలుకునేందుకు కొన్నిరోజులు పట్టొచ్చంటున్నారు.
సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకారం, ఈ ఘటనలో మొత్తం 19 మంది గాయపడ్డారు, అందులో 15 మంది చిన్నారులు. 80 మందిని సురక్షితంగా తరలించారు. తెలుగురాష్ట్రాల నాయకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షలు తెలియజేశారు.