గతంలో అమాయక ఆడోళ్లను మాటలతో మాయ చేసే మగాళ్లు బోలెడంత మంది ఉండేవారు. మారిన కాలంలో.. ఈ తరహా మోసాలు మాకూ పెద్ద విషయమేమీ కాదన్నట్లుగా మగాళ్లకు ధీటుగా కొందరు మహిళలు చేస్తున్నారు. ఈ మోసాల తీవ్రతకు మగాళ్లు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్న ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పేది ఆ తరహా మోసమే. మాయ మాటలు చెప్పి రెండో పెళ్లి చేసుకోవటమే కాదు.. భర్త నుంచి కోట్లాది రూపాయిలు కొట్టేసి.. ఉల్టా తనను వేధింపులకు గురి చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్న కిలేడీ దెబ్బకు సదరు రెండో భర్త హడలిపోతున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన వైనం ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అసలేం జరిగిందంటే.. టోలిచౌకికి చెందిన 38 ఏళ్ల వ్యాపారవేత్త (సయ్యద్ హుస్సేన్)కు 31 ఏళ్ల జమీలా రవికుమార్ అనే మహిళతో 2021 నవంబరులో పరిచయమైంది. తాను గచ్చిబౌలిలోని నానక్ రాం గూడలోని హైహోం విహంగలో ఉంటున్నట్లుగా చెప్పింది. తనకు విదేశాల్లో వ్యాపారాలు ఉన్నట్లుగా చెప్పి.. తన తల్లి ఫిలింనగర్ లో ఉంటుందని చెబుతూ ఆమెను పరిచయం చేసింది. వారిద్దరు తమకు వ్యాపారాలు ఉన్నాయని.. తన బాయ్ ఫ్రెండ్ రేధా ముస్సా ఇస్మాయిల్ అహ్మద్ తో విభేదాలు వచ్చినట్లుగా పేర్కొన్నారు.
కొన్ని రోజుల తర్వాత సయ్యద్ హుస్సేన్ తో వ్యాపారం చేయాలనుకుంటున్నట్లుగా చెప్పి తనకు సినీ ప్రముఖులు.. సెలబ్రిటీలతో పరిచయాలు ఉన్నట్లుగా పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. అతను నో చెప్పాడు. అయితే.. తప్పుడు ధ్రువపత్రాల్ని క్రియేట్ చేసి అతన్ని వివాహమాడింది. కొద్దికాలం తర్వాత తల్లీకూతుళ్లు సయ్యద్ ను ఇబ్బంది పెట్టటం మొదలుపెట్టారు. అతని వ్యాపార వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంతో పాటు దాదాపు రూ.కోటి వరకు ఖర్చు చేశారు.
అతని ఐఫోన్ నుంచి తెలీకుండా రూ.80 లక్షల మొత్తాన్ని తమ ఖాతాలోకి జమ చేసుకున్నారు. దీంతో వీరి మీద అనుమానం వచ్చిన హుస్సేన్ వీరి గురించి ఆరా తీశాడు. జమీలాకు ఇమ్రాన్ అనే వ్యక్తితో పెళ్లైందని.. వారికి పిల్లలు ఉన్నట్లుగా గుర్తించాడు. ఇదిలా ఉండగా వివిధ సందర్భాల్లో రూ.4 కోట్ల వరకు ఖర్చు చేసింది. వీటిని భరించలేని సయ్యద్ ఆమెను నిలదీయగా.. తాము ఉంటున్న ఇంటికి హుస్సేన్ ను రానివ్వకుండా అడ్డుకుంది. దీంతో తనకు న్యాయం చేయాలని బాధితుడు తొలుత ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించాడు. అక్కడ ఎలాంటి ఫలితం లేకపోవటంతో ఉన్నతాధికారులకు ఫిర్రయాదు చేశాడు. అయినా తన కంప్లైంట్ ముందుకు వెళ్లకపోవటంతో చివరకు కోర్టును ఆశ్రయించాడు. తన దగ్గర కొట్టేసిన నగదుతో వారు విదేశాలకు వెళ్లిపోయే వీలుందని.. వారి పాస్ పోర్టులు.. వీసాలు నిలిపివేసి.. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో తల్లీకూతుళ్ల మీద కేసు నమోదైంది. ఈ మొత్తం వ్యవహారంలో మోసం చేశారని చెబుతున్న తల్లీకూతుళ్ల వెర్షన్ బయటకు రావాల్సి ఉంది. పోలీసుల విచారణలో అన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.