తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో బైపీసీ చదవొచ్చు..లేదంటే ఎంపీసీ చదవొచ్చు. అదే మ్యాథ్స్, బయాలజీ కలిపి చదవాలనుకుంటే ఆ గ్రూపు ఎక్కువగా కాలేజీల్లో ఉండేది కాదు. ఇపుడు, ఈ రెండు సబ్జెక్టులు కలిపి చదువుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులోకి వచ్చింది.అదే ఎంబైపీసీ (మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమెస్ట్రీ).ఇంటర్ తర్వాత తమకు నచ్చిన స్ట్రీమ్ వైపే విద్యార్థులు వెళ్లేందుకు ఈ గ్రూపుతో అవకాశం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.అయితే, సరైన విధివిధానాలు జారీ చేయకుండా అమల్లోకి తీసుకురావడం సరికాదని కొందరు లెక్చరర్లు సూచిస్తున్నారు.పదో తరగతి పూర్తయ్యాక ఇంటర్మీడియట్ వైపు ఎక్కువ మంది విద్యార్థులు వెళుతుంటారు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ వంటి కోర్సులు ఇప్పటివరకు అందుబాటులో ఉన్నాయి.సైన్స్, మెడిసిన్‌పై ఆసక్తి ఉన్నవాళ్లు బైపీసీ వంటి గ్రూపులు ఎంచుకుంటారు. గణితం, ఇంజనీరింగ్ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంపీసీ వంటి గ్రూపు ఎంచుకుంటారు. కానీ, సైన్స్‌తో పాటు మ్యాథ్స్‌పై ఆసక్తి ఉన్నవారికి ఇంటర్ గ్రూపు ఎంచుకోవడంలో కొంచెం సందిగ్ధత ఉండేది. ఎందుకంటే ఎంబైపీసీ గ్రూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడం.ఇక, తెలంగాణ విషయానికొస్తే హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు కాలేజీల్లోనే ఈ గ్రూపు అందుబాటులో ఉంది. కానీ, తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇప్పటివరకు ఈ ఆప్షన్ లేదు.
అయితే, ఈ విద్యా సంవత్సరం(2025-26) నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఎంబైపీసీ గ్రూపు ఆప్షన్ తీసుకువచ్చింది ప్రభుత్వం. ఇది ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు వర్తింపజేస్తున్నట్లుగా ప్రకటించింది.ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభించినట్లుగా ఇంటర్ బోర్డు అధికారులు చెప్పారు. విద్యార్థులకు కెరీర్ అవకాశాలు మరింత మెరుగుపరిచేందుకే ఎంబైపీసీ గ్రూపు ఆప్షన్ తీసుకువచ్చినట్లుగా ఏపీ ఇంటర్ బోర్డు సెక్రటరీ కృతికా శుక్లా తెలిపారు.”ఇంటర్ పూర్తయ్యాక విద్యార్థులు ఎటువైపు వెళ్లాలనే విషయంపై మరింత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునే వీలుంటుంది. ఎంబైపీసీ తీసుకుంటే జేఈఈ లేదా నీట్, లేదా రెండూ రాయవచ్చు. ఇంటర్ పూర్తయ్యాక మరింతగా అర్థం చేసుకుని విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా కెరీర్ మలచుకోవచ్చు” అని అన్నారమె.కానీ, ప్రభుత్వం తీసుకువచ్చిన ఎంబైపీసీ గ్రూపు అమలు తీరులో గందరగోళం ఉందని, ఆ సమస్యను పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బీజే గాంధీ అన్నారు.”ఎన్ని కాలేజీల్లో గ్రూపు అమలు చేస్తారనేది స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వ కాలేజీలకు గ్రామీణ ప్రాంత విద్యార్థులు వస్తుంటారు. వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, గ్రూపు విషయంలో ప్రచారం కల్పించడం, చదివితే కలిగే ప్రయోజనాలు చెప్పడం విస్తృతంగా చేయాలి. అదిప్పుడు జరగడం లేదు” ఎంబైపీసీ కాంబినేషన్ ఇప్పటికే సీబీఎస్ఈ అమలు చేస్తోంది. కేంద్రీయ విద్యాలయ, జవహర్ నవోదయ విద్యాలయాల్లో కొన్నిచోట్ల ఈ గ్రూపు అందుబాటులో ఉంది.ఎంబైపీసీ చదివితే కెరీర్ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతోంది ఏపీ ప్రభుత్వం.
ప్రస్తుతం ఎంపీసీ చదివితే.. ఇంటర్ తర్వాత దానికి తగ్గట్టుగా ఇంజినీరింగ్ వంటి కెరీర్ అవకాశాలే ఎంచుకునే వీలుంది. బైపీసీ చదివితే.. వైద్యం, ఫార్మసీ వంటి రంగాలవైపు వెళ్లవచ్చు.ఎంబైపీసీ చదివితే.. విద్యార్థులు గణితం, జీవశాస్త్రం రెండింటిలోనూ పట్టు పెంచుకుంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు అధికారులు.”బయాలజీతో పాటు మ్యాథ్స్ చదివిన వారికి ఇపుడు బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ వంటి రంగాల ఉద్యోగాల్లో ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోంది. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కోర్సును డిజైన్ చేశారు.ఇప్పటివరకు ఇంటర్ కాలేజీల్లో వృక్షశాస్త్రం(బోటనీ), జంతుశాస్త్రం(జువాలజీ) వంటి సబ్జెక్టులు వేర్వేరుగా ఉండేవి. ఇప్పుడు ఆ రెండు సబ్జెక్టులను కలిపి జీవశాస్త్రం (బయాలజీ)గా తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం.వృక్ష, జంతుశాస్త్రాలను కలిపినప్పటికీ, బోధనాపరంగా లెక్చరర్లు తమకు కేటాయించిన పాఠ్యాంశాలకు తగ్గట్టుగా బోధిస్తారని కృతికా శుక్లా వివరించారు. అన్ని కాలేజీల్లో ఈ గ్రూపు అందుబాటులో ఉంటుందని, విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి ఎంచుకోవచ్చని సూచించారు.సిలబస్‌లో మార్పులు తీసుకువస్తూ ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.2023లో వచ్చిన నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్‌కు తగ్గట్టుగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్‌లో మార్పులు చేస్తోంది. ఈ మేరకు 2026-27 సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం సిలబస్‌లోనూ మార్పులు చేయనున్నారు.అలాగే ఇప్పటివరకున్న మ్యాథ్స్ -ఎ, బి సబ్జెక్టులకు ఒకే సబ్జెక్టుగా మార్చారు.ఎంపీసీ, బైపీసీ వేర్వేరుగా చదివితే, ఇంగ్లిష్‌తోపాటు సెకండ్ లాంగ్వేజీ కింద తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్, తమిళం, కన్నడ, ఒడియా, పర్షియన్, ఫ్రెంచ్ ఆప్షన్లు ఉన్నాయి.
”ఎంబైపీసీ తీసుకుంటే ఇంగ్లిష్ ఒక్కటే చదివితే సరిపోతుంది. సెకండ్ లాంగ్వేజీ ఆప్షన్ తీసుకోనక్కర్లేదు” అని వివరించారు కృతికా శుక్లా.అంతేకాదు, మార్కుల విధానంలోనూ మార్పులు చేసి మొత్తం వెయిటేజీ 1,000 (రెండేళ్లకు) మార్కులు వచ్చేలా చేసింది ఇంటర్ బోర్డు.ప్రశ్నపత్రాల విధానంలోనూ మార్పులు తీసుకువచ్చినట్లుగా చెప్పారు. ఇప్పటివరకు మ్యాథ్స్ ఏ, బీ పేపర్లకు 75 మార్కుల చొప్పున 150 మార్కులు ఉండగా.. ఇపుడు ఈ రెండు పేపర్లు కలిపి 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.అలాగే, జీవశాస్త్రం ప్రశ్నపత్రం 85 మార్కులకు ఉంటుంది. ఇందులో వృక్షశాస్త్రానికి 43 మార్కులు, జంతుశాస్త్రానికి 42 మార్కులుంటాయి.ఇప్పటివరకు భౌతిక, రసాయన శాస్త్ర పేపర్లకు 60 మార్కుల చొప్పున ఉండేవి. ఇక మీదట రెండు 85 మార్కుల చొప్పున పేపర్లు ఉంటాయి. జీవశాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్ర సబ్జెక్టులకు 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్‌కు కేటాయించారు.మొత్తంగా ఎంబైపీసీలో గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సబ్జెక్టులు ఒక్కోటి 100 మార్కుల చొప్పున ఉండనున్నాయి. వీటితో పాటు ఇంగ్లిష్ (100 మార్కులకు) లాంగ్వేజీగా ఉంటుంది.