మేఘా ఇంజనీరింగ్ కంపెనీ గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం చాలా గొప్పగా చెప్పుకుంటారు. కొన్నివేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తూంటారు.కొన్ని వందల కోట్లు రాజకీయపార్టీలకు విరాళాలిస్తూంటారు. రాజకీయ నేతలకు లంచాలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వీరు కూడా మోసపోయారు. అదీ కూడా సైబర్ నేరగాళ్ల చేతుల్లో,
మేఘా కంపెనీ యూరప్ లోని ఓ కంపెనీతో లావాదేవీలు నిర్వహిస్తుంది..ఓ కంపెనీ చేసినసేవలకో.. పంపించిన సామాగ్రికో .. ఐదున్నర కోట్లు డబ్బులు చెల్లించారు. ఓ నెల తర్వాత మళ్లీ అదే కంపెనీ నుంచి డబ్బులేవి అనే మెసెజ్ వచ్చింది. అదేంటి ఇచ్చాం కదా అని ఆరా తీస్తే వారికి షాక్ తగిలినట్లయింది. వీరి ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరస్తులు.. ఆ కంపెనీ పేరుతో ఓ బినామీ బ్యాంక్ అకౌంట్ పంపి….దానికి బదిలీ చేయించున్నారు. క్రాస్ చెక్ చేసుకోవడంలో విఫలం అయిన కంపెనీ సిబ్బంది విషయం బయటపడే సరికి లబోదిబోమన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మనం ఏం చేస్తున్నాం.. వేటిపై ఇంట్రస్ట్ చూపిస్తున్నాం అనే దానిపై కూడా అంచనా వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వాటిని బట్టే అమాయికులను బుట్టలో వేసి నిండా ముంచేస్తున్నారు. ఒకటా రెండా ఎన్నెన్నో కేసులు. కోట్లలో నష్టపోతున్నారు జనం. కొత్త కొత్త విధానాల్లో అమాయిక జనాలను నిండా ముంచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. బయటపడే దాకా సైబర్ నేరం జరిగిందనే విషయం, తాము మోసపోతున్నాం అనేది కూడా జనం తెలుసుకోలేకపోతున్నారు.
తెలిసాక ఏమి చేయలేని పరిస్థితి. సాధారణ నేరాలకంటే.. సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడం ఆందోళన పెంచుతోంది. చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి బడా పారిశ్రామిక వేత్తలు, కంపెనీల దాకా సైబర్ నేరగాళ్లు ఎవరిని వదలడం లేదు. స్మార్ట్ ఫోన్లతోనే సింపుల్‌గా పనికానిచ్చేస్తూ.. ఏటా వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు.
దేశంలో సైబర్ క్రైమ్ పెద్ద సవాల్‌గా మారింది. బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఏ చిన్న అవకాశం ఉన్నా సరే దోపిడీకి పాల్పడుతున్నారు. చదువుకున్న వాళ్లు, చదువురాని వాళ్లు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు తెలుగు రాష్ట్రాల్లో చిక్కుకుంటున్నారు.
గతంలో ఈ తరహా మోసాలు ఎక్కువగా ఉండేవి. ఈ మధ్యకాలంలో వేరే రకంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కానీ పాత పద్దతిలోనే సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నట్లు ఈ కేసులో బయటపడింది. తాజాగా సైబర్ నేరగాళ్లు మేఘా కంపెనీని కూడా వదల్లేదు. నకిలీ మెయిల్‌తో 5 కోట్ల 47 లక్షలు కొట్టేశారు. దాందో మేఘా కంపెనీ ప్రతినిధులు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు. మేఘా కంపెనీకి అవసరమైన ఎక్విప్‌మెంట్ కోసం.. నెదర్లాండ్స్‌కి చెందిన కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చారు.
కంపెనీకి ఆన్‌లైన్ ద్వారా డబ్బుల చెల్లింపులు చేశారు. చెల్లింపుల తర్వాత ప్రతిసారి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేది. ఆ కంపెనీ లాగానే ఈ-మెయిల్ లో అక్షరం మార్చి మెయిల్ చేశారు కేటుగాళ్లు. అకౌంట్ పనిచేయడం లేదు మరో ఖాతాకు పంపించాలని మేఘా కంపెనీకి మెయిల్ చేశారు.అదే నిజమని నమ్మి రూ.5 కోట్ల 47 లక్షలు రెండు విడతలుగా చెల్లించారు. మళ్లీ ఆ కంపెనీ నుండి మెసేజ్ రావడంతో మోసపోయామని గ్రహించి మేఘా ఇంజనీరింగ్ మేనేజర్ శ్రీహర్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను అణ్వేషిస్తూ.. అమాయికుల నుంచి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. సైబర్ నేరాలపట్ల ప్రతిక్షణం అప్పమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.