ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణపు పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా మే 2న ఈ పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణంలో భాగంగా రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ(Minister P Narayana)తోపాటు ఉన్నతాధికారుల బృందం గుజరాత్ లో పర్యటిస్తోంది. ఆదివారం ఆ రాష్ట్రంలోని ఏక్తా నగర్ లో సర్దార్ వల్లభాయి పటేల్ భారీ విగ్రహాన్ని మంత్రులు, ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆ క్రమంలో పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికతతోపాటు మెటీరియల్… ఇతర అంశాలను నిర్మాణ సంస్థ ప్రతినిధులు, గుజరాత్ ఉన్నతాధికారులు… మంత్రి నారాయణ బృందానికి సోదాహరణగా వివరించారు.
అనంతరం అహ్మదాబాద్ శివారులో ఇంటర్నేషనల్ ఎకనామిక్ సిటీగా 860 ఎకరాల్లోసెజ్‌లు, కంపెనీలతో నిర్మించిన గిఫ్ట్ సిటీని ఈ బృందం సందర్శించింది. అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం పటేల్ విగ్రహ నిర్మాణాన్ని మంత్రి నారాయణ,సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఏడీసీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్థసారథి భాస్కర్‌తోపాటు గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు తదితర బృందం అధ్యయనం చేసింది.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. దీనితో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన పనుల్లో వేగం పెరిగింది. అయితే అమరావతి పునర్ నిర్మాణ పనులకు మే 2వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతోన్నాయి. అందులోభాగంగా భవన నిర్మాణాలతోపాటు భారీ భవంతులు, విగ్రహాల ఏర్పాటు చేయనున్నారు. అలాగే నిర్మాణ పనులు ఏ విధంగా చేపట్టాలి. ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై మంత్రి నారాయణ బృందం గుజరాత్‌లో పర్యటిస్తోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆది, సోమవారాల్లో ఈ బృందం గుజరాత్‌లో పర్యటించనుంది.