ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై నేడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కీలక సమీక్ష నిర్వహించనుంది..
పోలరవం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ పనుల్లో కీలకమైన సమాంతర డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం అంతర్జాతీయ నిపుణుల ప్యానెల ఇచ్చిన సూచనల మేరకు ప్లాస్టిక్ కాంక్రీట్ టీ -16 మిశ్రమాన్ని కాంట్రాక్టు సంస్థ బావర్ వాడుతోంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఈ ఏడాది ఆఖరుకు పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ నేపథ్యంలో పోలవరం ప్రధాన డ్యామ్ పనుల ప్రగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీ అధ్యక్షతన.. ఈ రోజు ఢిల్లీలో సమీక్ష సమావేశం జరగనుంది.. ఇక, ప్రాజెక్టు పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే.
2019-24 మధ్య పూర్తిగా రాష్ట్రానికే వదిలేసి దిద్దుకోలేని తప్పు చేశామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీ అన్నారు.
పోలవరం పనుల పురోగతిపైప్రతి నెలా సమీక్ష!
ఆ ఐదేళ్లలో బాధ్యతంతా రాష్ట్రానికి వదిలేశాం
పోలవరం ప్రాజెక్టు పనుల బాధ్యతను 2019-24 మధ్య పూర్తిగా రాష్ట్రానికే వదిలేసి దిద్దుకోలేని తప్పు చేశామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీ అన్నారు. ఇకపై అలాంటి తప్పు చేయబోమని, ఇకపై పనుల పురోగతిపై ప్రతి నెలా సమీక్షిస్తామని స్పష్టం చేశారు. గడచిన ఐదేళ్లలో ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని.. ఫలితంగా ప్రాజెక్టు పురోగతి ‘రివర్స్’ అయిందని చెప్పారు. సోమవారం ఢిల్లీలో ఆమె అధ్యక్షతన పోలవరంపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. కేంద్ర జలసంఘం చైర్మన్ కుశ్వీందర్ వోహ్రా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చైర్మన్ /సీఈవో అతుల్ జైన్, సెంట్రల్ సాయిల్-మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎ్‌సఎంఆర్‌ఎస్) ఉన్నతాధికారులు, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్‌సీ-ప్రభుత్వ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు వెలగపూడి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు. పోలవరం పనులు సాగుతున్న తీరుపై దేబర్షి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నిపుణులు సూచించిన విధంగానే టీ-16 కాంక్రీట్ మిశ్రమంతో డయాఫ్రం వాల్ పనులు సాగడంపైనా సంతోషం వ్యక్తం చేశారు. గ్యాప్-1, గ్యాప్-2 పనుల కార్యాచరణ, డిజైన్లపైనా నిర్ణయం తీసుకుంటామన్నారు. నెలవారీగా మెటీరియల్ ఎంత అవసరం.. ప్రాజెక్టు వద్ద ఎంత అందుబాటులో ఉందో జలశక్తి శాఖకు సమాచారం అందించాలని ఆదేశించారు. వాల్‌తో పాటు.. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మాణానికి మట్టి, రాళ్లు ఎంతమేర అందుబాటులో ఉన్నాయి.. ఇంకెంత అవసరమో కూడా తెలియజేయాలన్నారు. నెలవారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుని.. ప్రగతిపై నివేదికలు సమర్పిస్తూ ఉండాలని కోరారు.
వాల్ పనుల్లో నాణ్యత తగ్గేందుకు వీల్లేదని తేల్చిచెప్పారు. ప్రాజెక్టు క్షేత్రంలో ఏర్పాటు చేసిన లేబొరేటరీలో మెటీరియల్ నాణ్యతను పరీక్షించి రిపోర్టులు సమర్పించాలన్నారు. ప్రాజెక్టు పనుల వేగవంతానికి రెండో విడత అడ్వాన్సు సొమ్ము రూ.2,700 కోట్ల మంజూరుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని దేబర్షి చెప్పారు. గతంలో ఇచ్చిన నిధులను రాష్ట్ర ఖాతాలో జమచేసి ఖర్చుచేయడంపై కేంద్ర ఆర్థిక శాఖ లేవనెత్తిన అభ్యంతరాల సమస్య సమసిపోయిందని చెప్పారు. ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందిందన్నారు. కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో పోలవరం పనుల్లో నెలవారీ లక్ష్యం మేరకు వేగాన్ని పెంచాలని స్పష్టం చేశారు.