AP: పిఠాపురం కేరాఫ్ వర్మ అని చెప్పాలి. ఈయన అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి భారీ మెజారిటీతో గెలిచిన నాయకుడు. అక్కడ ఈయన సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోయినప్పటికీ ప్రజల మనసును గెలిచిన నాయకుడు. తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ పార్టీకి పిఠాపురంలో పూర్వ వైభవం తీసుకువచ్చారు.
ఈ విధంగా పిఠాపురంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వర్మకు ఈసారి కచ్చితంగా టికెట్ వస్తుందని ఈయన ఎమ్మెల్యే అవుతారని అక్కడ వారందరూ భావించారు కానీ చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ పేరును ప్రకటించడంతో పూర్తి స్థాయిలో పిఠాపురంలో వ్యతిరేకత ఏర్పడింది. కానీ చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తనకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పడంతోనే వర్మ వెనక్కు తగ్గడమే కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపుకు కూడా దోహదం చేశారు.
ఇలా పవన్ కోసం ఎంతో కృషి చేసిన వర్మను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా దూరం పెట్టింది. దీంతో ఈయన పార్టీ మారతారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా ముద్రగడ్డ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ… వర్మ వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలతో వర్మ టచ్ లో ఉన్నారని అందుకే ఆయనకు పదవులు ఏవీ దక్కడంలేదని కూడా అన్నారు. వర్మ చేస్తున్న చర్యలు అన్నీ వైసీపీకే ఎంతో ఉపయోగపడుతున్నాయని కూడా ఆమె అన్నారు. పైగా వర్మ ఏమి మాట్లాడినా వైసీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుందని వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ తిరుగులేని నాయకుడని ఆమె అన్నారు. జనసేన అడ్డా పిఠాపురం అన్నది ఆమె మరో మారు అలా చెప్పారన్న మాట. అయితే ఆమె వర్మ మీద విమర్శలు చేయడమే కాకుండా ఆయనను వైసీపీ నేతలకు టచ్ లో ఉన్నారని క్రాంతి చెప్పడంతో ఈ వ్యాఖ్యలు కాస్త పెద్ద ఎత్తున చర్చలకు కారణమయ్యాయి. ఈయన పార్టీ మారాల్సి వస్తే టికెట్ ఇవ్వనప్పుడే పార్టీ మారేవారు కదా అంటూ మరికొందరు ఈమె వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.