భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి ఊహించని విధంగా అతి పెద్ద చిక్కే వచ్చిపడింది. ముంబయిలోని అత్యంత విశాలవంతమైన రూ.15వేల కోట్ల విలువైన ‘ఆంటిలియా’ భవంతిని ఇప్పుడు ఖాళీ చేస్తారా? అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
అంబానీ కలల సౌధం
ముకేశ్ అంబానీకి ముంబయిలో 27 అంతస్తుల అత్యంత విలాసవంతమైన భవనం ఉంది. దీనిని ‘ఆంటిలియా’ అంటారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భవంతుల్లో ఇది ఒకటి. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ సుమారుగా రూ.15,000 కోట్లు ఉంటుందని ఓ అంచనా. దీనిని చికాగోకు చెందిన పెర్కిన్స్ అండ్ విల్ సంస్థ రూపొందించింది. 2006-2010 మధ్యలో దీని నిర్మాణం పూర్తయ్యింది. ఈ ఆకాశ హర్మ్యంలో అంబానీలు పూజ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది. అలాగే జిమ్, స్పా, హోమ్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్ సహా వైద్య సౌకర్యాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దీనిలోనే ముకేశ్, నీతా అంబానీ కుటుంబం మొత్తం ఉంటోంది.
భారత పార్లమెంట్ ఇటీవలే వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ఇది ఇప్పుడు అది చట్టంగా మారింది. ఆంటిలియా భవనం ఉన్న ప్రదేశం ఒకప్పుడు వక్ఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండేదని ఏఐఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. దీనిపై ఏడాది కాలంగా ఓవైసీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ భూమిని 1986లో కరీం భాయ్ ఇబ్రహీం అనే వ్యక్తి వక్ఫ్ బోర్డ్‌కు విరాళంగా ఇచ్చారని పేర్కొన్నారు. కరీం భాయ్ దానిని కేవలం మతపరమైన విద్య కోసం, అనాథాశ్రమ నిర్మాణం కోసం మాత్రమే ఉపయోగించాలని కోరారని అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సమర్పించిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్) ప్రకారం, వక్ఫ్ బోర్డ్ పరిధిలో ఉన్న భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం గానీ, లేదా ఉపయోగం కోసం ఇవ్వకూడదని ఉన్నట్లు ప్రముఖ ప్రముఖ మీడియా సంస్థ దైనిక్ భాస్కర్ రాసుకొచ్చింది. ఏటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా ఆ స్థలాన్ని 2002లో ముకేశ్ అంబానీకి రూ.21.5 కోట్లకు విక్రయించారని ఒవైసీ ఆరోపించారు. ఓవైసీ కామెంట్స్‌తో అంబానీ ఇల్లు విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి ఈ భూమికి చట్టపరమైన సమస్యలు ఆంటిలియా నిర్మాణం చేపట్టకు ముందు నుంచే ఉన్నాయి. 2006-2010 మధ్య ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన ఈ ప్రైవేట్ నివాసాన్ని అంబానీ నిర్మించారు. ఈ క్రమంలో ఈ స్థల వివాదం సుప్రీంకోర్ట్‌కు కూడా వెళ్లింది. చాలా సంవత్సరాలుగా ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఇండియాలో వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన భూ వివాదాలు కొత్తేమీ కాదు. 1950లో వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో కేవలం 52,000 ఎకరాల భూమి మాత్రమే ఉండేది. 2025 నాటికి వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఉన్న భూమి 9.4 లక్షల ఎకరాలకు పెరిగాయి.