*హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు.*
*ఒకొక్కరికి 20వేలు జరిమానా*
**హత్య చేసేటపుడు ముద్దాయిలే వీడియో తీసి వైరల్ చేశారు*
*ఆ వీడియోనే ముద్దాయిల పాలిట శాపంగా మారింది*
*ప్రధాన సాక్షులు రాజీ అయినప్పటికీ, అధికారుల మరియు వీడియో సాక్ష్యాల ఆధారంగా నేరం ఋజువు*
*ముద్దాయిలందరూ 25 సంవత్సరాల లోపు యువకులు*
**సంచలన తీర్పు వెలువరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి G. శ్రీనివాస్*
*ప్రాసిక్యూషన్ తరపున బలమైన వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాచమల్లు హరినాథ్ రెడ్డి*
నార్పలకు చెందిన మట్టి పవన్ కుమార్ హత్య కేసులో , ఐదుగురికి జీవిత కాలపు కఠిన కారాగార శిక్ష విధిస్తూ అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి G. శ్రీనివాస్ సోమవారం సంచలన తీర్పు చెప్పారు.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే, నార్పలకు చెందిన హతుడు మట్టి పవన్ కుమార్, మెదటి ముద్దాయి డిపో షాజిద్ మంచి స్నేహితులు. వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి కొట్లాడుకుంటూ, తరచూ మట్టి పవన్ కుమార్ ఈ డిపో షాజిద్ ను, నాల్గవ ముద్దాయి తలారి సుధాకర్ ను చంపుతానని బెదిరించేవాడు. వారి మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరడంతో మట్టి పవన్ కుమార్ తన తల్లిదండ్రులతోపాటు సంసారాన్ని నార్పల నుండి అనంతపురం కు మార్చారు. 12-04-2022 తేదీ మట్టి పవన్ కుమార్ అతని తండ్రి మట్టి శ్రీనివాసులు రేషన్ బియ్యం తెచ్చుకోవడం కోసం నార్పలకు వెళ్లారు. మధ్యాహ్నం తండ్రికి చెప్పకుండా మట్టి పవన్ కుమార్ నార్పల తహసీల్దార్ ఆఫీస్ వద్దకు పోయాడు, అక్కడ డిపో షాజిద్ తారస పడడంతో ఇద్దరూ ఘర్షణ పడ్డారు, ఆ క్రమంలో మట్టి పవన్ కుమార్ డిపో షాజిద్ పై కత్తితో దాడి చేయగా, అతని చేతికి గాయాలయ్యాయి. ఆ తర్వాత అదే రోజు రాత్రి డిపో షాజిద్ తన అనుచరులైన చింతాకు రమేష్, చిక్కేపల్లి నాగేంద్ర, తలారి సుధాకర్, మరియు తలారి అరుణ్ లను వెంట పెట్టుకొని మట్టి పవన్ కుమార్ కోసం వెతుకుతూ వుండగా, రాత్రి సుమారు 10-30 గంటల సమయంలో నార్పల గ్రామంలోని వడ్డే తిమ్మన్న తోట వద్ద మట్టి పవన్ కుమార్ వున్నాడన్న సమాచారం తెలుసుకొని పై వారందరూ స్టీల్ రాడ్, రెండు కట్టెలు తీసుకొని అక్కడికి పోయి, డిపో షాజిద్ *” ఏమిరా నీవు మధ్యాహ్నం నాతో గొడవపడి నన్నే కొట్టడానికి వస్తావా నిన్ను చంపితే నీకు దిక్కెవరు”* అంటూ డిపో షాజిద్, తలారి సుధాకర్, తలారి అరుణ్ తమ వెంట తెచ్చుకొన్న స్టీల్ రాడ్, కట్టెలతో అతి దారుణంగా కొడుతూ, కొట్టేటప్పుడు తలారి సుధాకర్, చిక్కేపల్లి నాగేంద్రను వీడియో తీయమని ఆదేశిస్తూ, ఈ వీడియో చూచి అందరూ మనమంటే భయపడాలి అని చెప్పగా నాగేంద్ర తన సెల్ నుండి మట్టి పవన్ కుమార్ ను చంపేటపుడు వీడియో తీసి, దానిని తలారి సుధాకర్ సెల్ కు ఫార్వర్డ్ చేశాడు. అందులో *” సుధాకర్ అంటే ఒక బ్రాండ్”* అంటూ రాడ్ తో ఇష్టానుసారంగా కొట్టే దృశ్యాలు వున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. పోలీసులు నాగేంద్ర మరియు తలారి సుధాకర్ సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపి, అందుకు సంబంధించిన బలమైన డిజిటల్ సాక్ష్యాలను కోర్టు ముందు ప్రవేశపెట్టడం వలన, ప్రత్యక్ష సాక్షులు సాక్ష్యం చెప్పక పోయినప్పటికీ, సెల్ ఫోన్ లో నిక్షిప్తమైన సాక్ష్యంతో పాటు అధికారులు చెప్పిన సాక్ష్యం ఆధారంగా నేరం ఋజువు కావడంతో ముద్దాయిలు *డిపో షాజిద్, చింతాకు రమేష్, చిక్కేపల్లి నాగేంద్ర, తలారి సుధాకర్, తలారి అరుణ్* లకు జీవిత కాలపు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి G. శ్రీనివాస్ తీర్పు
వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరపున రాచమల్లు హరినాథ్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు.
ఈ కేసులోని ముద్దాయిలు అందరూ 25 సంవత్సరాల లోపు యువకులు, ఒక్కరు మినహా అందరూ అవివాహితులు.
ఈ కేసులో అప్పటి నార్పల ఎస్సై U. వెంకట ప్రసాద్, సెక్షన్ 302 r/w. సెక్షన్ 34 IPC క్రింద FIR No. 57/2022 గా నమోదు చేయగా, అప్పటి ఇటుకలపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్లు S. విజయ భాస్కర్ గౌడ్, S.అస్రార్ బాషా, సమగ్ర దర్యాప్తు జరిపి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షులను తీసుకు రావడంలో ASI మల్లి రెడ్డి, కానిస్టేబుళ్ళు రామమోహన్,
షానవాజ్ తదితరులు బాగా సహకరించారు. వీరందరిని అనంతపురం జిల్లా ఎస్పీ P. జగదీష్ అభినందించారు.