మియన్మార్‌లో సంభవించిన భూకంపంలో కనీసం 694 మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు, ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.థాయ్‌లాండ్‌లోనూ మరణాలు సంభవించాయి.స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్న సమయంలో భూ ప్రకంపనలు ప్రారంభమయ్యాయని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
భారీ భూకంపం తరువాత కూడా రిక్టర్ స్కేలుపై 4.5 నుంచి 6.5 తీవ్రతతో మధ్య పలు చిన్న ప్రకంపనలూ (ఆఫ్టర్ షాక్స్) సంభవించాయి.ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీసే ప్రయత్నాలు సాగుతున్నాయి.అంతర్యుద్ధం ఫలితంగా మానవతా సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వానికి ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.భూకంపంతో మియన్మార్‌లో మార్కెట్లు, గుడులు, బ్రిడ్జ్‌లు ధ్వంసమయ్యాయి.
గతంలో బర్మా అని పిలిచే ఈ దేశంలో 2021లో జరిగిన తిరుగుబాటు కారణంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలక పార్టీని గద్దె దింపి, సైనిక జుంటా పాలన సాగుతోంది.నైపీడాలో దెబ్బతిన్న ప్రభుత్వ సిబ్బంది క్వార్టర్లలో రక్షణ బృందాల గాలింపు జరుపుతున్న దృశ్యమిది.మియన్మార్ సైనిక పాలనలో సమాచారం బయటకు రావడం చాలా అరుదు, కానీ మాండలేలోని ఒక రెస్క్యూ వర్కర్ బీబీసీ బర్మాతో మాట్లాడుతూ అపార నష్టంతోపాటు వందల మరణాలు సంభవించాయన్నారు.మియన్మార్‌లో కూడా గణనీయమైన నష్టం జరిగిందని రెడ్‌క్రాస్ కూడా ధ్రువీకరించింది. ఆరు ప్రాంతాలలో మియన్మార్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అంతర్జాతీయ సాయం కోరింది.
భూకంప కేంద్రానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కుప్పకూలిన ఎత్తైన భవనాల కింద నిర్మాణ కార్మికులు చిక్కుకుపోయారు. రక్షణ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఎత్తైన భవనం కూలిపోయిన చోట 409మంది పనిచేస్తున్నారని థాయ్‌లాండ్ ప్రజారోగ్య మంత్రి సాంస్క్ తెపుస్తిన్ తెలిపారు.థాయ్‌లాండ్ భూకంపాల హాట్‌స్పాట్ కాదు. బ్యాంకాక్‌లోని ఎత్తైన భవనాలు భూకంప తీవ్రతను తట్టుకునే సాంకేతికతతో నిర్మించినవి కావు. అయితే ఎక్కువగా నిర్మాణంలోని భవనాలలోనే తీవ్రనష్టం వాటిల్లింది.
భూకంప ప్రభావిత ప్రాంతాలలో అత్యవసర దళాలతో సమన్వయం చేసుకుంటున్నామని థాయ్ ప్రభుత్వం తెలిపింది.థాయ్ రాజధాని నడిబొడ్డున హోటళ్లు, కంపెనీలు, ఆసుపత్రులను వదిలి ప్రజలు భయం, గందరగోళంతో వీధుల్లోకి వచ్చేశారు.సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను సిద్ధం చేశామని, సహాయక పరికరాలు, యంత్రాలను సిద్ధం చేయాలని విపత్తు కేంద్రాలను ఆదేశించినట్లు థాయ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.