న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో నిన్న రాత్రి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది చనిపోయారు. మృతుల్లో పది మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుంభమేళాకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో ప్రయాణికులు శనివారం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అయితే ప్రయాగ్ రాజ్ వెళ్తే రెండు రైళ్లు ఆలస్యం కావడంతో ఫ్లాట్ పామ్ నంబర్ 13, 14 దగ్గర ప్రయాణికులు కిక్కిరిసిపోయారు.
ఇదే టైంలో ఓ రైలు రావడంతో ఆ ట్రైన్ ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు గాయపడగా, మరికొందరు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం హుటాహుటినా స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. పరీశీలించిన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్ వైద్యులు అప్పటికే 15 మంది చనిపోయినట్లు ధ్రువికరించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
ఫ్లాట్ ఫామ్‌పై భారీ సంఖ్యలో ప్రయాణికులు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో క్లియర్‌గా కనిపించాయి. సీట్లు దొరకవనే కంగారులో ట్రైన్ లోకి ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడటంతో ఈ దుర్ఘటన చేసుకుందని అధికారులు తెలిపారు. ఎక్స్ లేటర్లపై రద్దీ కూడా ఒక కారణంగా తెలుస్తోంది. ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్14వ నంబర్ ప్లాట్ ఫామ్‌కి వచ్చేసరికి అక్కడ చాలా మంది ప్రయాణికులు ఉన్నారు.
స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ ప్రయాగ్ రాజ్ మీదుగా వెళ్తాయి. ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లు రావడం లేటు అయ్యింది. ఈ ఎక్స్ ప్రెస్ రైళ్ల ప్రయాణికులు కూడా 13, 13, 14 నంబర్ ప్లాట్ ఫామ్స్ పై ఉన్నారని పోలీస్ అధికారి తెలిపారు. అయితే రెండు రైళ్లు రద్దయినట్లు ప్రకటించడం కూడా ప్రమాదానికి కారణమైందని తెలుస్తోంది. తోపులాటలో ఊపిరాడక పలువురు ప్రయాణికులకు తీవ్ర అస్వస్థత గురైయ్యారు. ఘటనపై అత్యన్నతస్థాయి విచారణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి అందరికీ అన్ని విధాలా సాయం అందించాలని ఆదేశించారు. ఇటు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. ఇటు ఎల్జీ వీకే సక్సేనా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
తొక్కిసలాట ఘటనపై ఢిల్లీ మాజీ సీఎం అతిశీ రియాక్ట్ అయ్యారు. కేంద్ర, యూపీ ప్రభుత్వాలు ప్రజల భద్రతను పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు. మహా కుంభమేళాకు భక్తులు వెళ్తున్న టైంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. ప్రభుత్వాలు ప్రజల భద్రతపై ఆందోళన చెందడం లేదన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో ఎటువంటి ఏర్పాట్లు లేవు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం సైతం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని చెప్పారు. ప్రజలకు వీలైనంత త్వరగా సహాయం అందించాలని ఎక్స్ లో పోస్ట్ చేశారు.