న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి(ఫిబ్రవరి 15) జరిగిన తొక్కిసలాట ఘటనలో 18 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు.
మరణించిన 18మంది పేర్లను అధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది.
జనం భారీగా ఉండడమే తొక్కిసలాటకు ప్రాథమిక కారణమని అధికారులు చెబుతున్నారు. తొక్కిసలాటకు గల అన్ని కారణాలపై దర్యాప్తు చేపడతామని తెలిపారు.
ప్రత్యక్ష సాక్షులు కొందరు చెప్పినదాని ప్రకారం ప్లాట్‌ఫామ్‌కు వెళ్లే ఫుట్ బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగింది.
పట్నా వెళ్తున్న మగధ్ ఎక్స్‌ప్రెస్ 14వ నంబరు ప్లాట్‌ఫామ్‌పై ఉంది. జమ్ము వెళ్తున్న ఉత్తర్ సంక్రాంతి ఎక్స్‌ప్రెస్ 15వ నంబరు ప్లాట్‌ఫామ్‌పై ఉంది.
ఈ సమయంలో కొంతమంది ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుంచి ప్లాట్‌ఫామ్ నంబర్ 14,15 వైపు వెళ్లే మెట్లపై జారిపడ్డారు. దీంతో వారి వెనక ఉన్నవారూ కిందపడ్డారు. తొక్కిసలాట జరిగింది” అని ఉత్తర రైల్వే ప్రతినిధి హిమాన్షు ఉపాధ్యాయ్ చెప్పారు.
ఉన్నతస్థాయి కమిటీ తొక్కిసలాటపై దర్యాప్తు జరుపుతోందని ఆయన తెలిపారు.
”దర్యాప్తు తర్వాతే తొక్కిసలాటకు కారణమేంటో తెలుస్తుంది. జనం భారీగా వస్తారని మేం అంచనా వేశాం. అయితే రెండు రైళ్లు ఆలస్యంగా నడవడంతో అనుకున్న కంటే ఎక్కువ మంది అక్కడకు చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. తొక్కిసలాటకు కారణాలపై రైల్వే శాఖ దర్యాప్తు చేస్తోంది” అని రైల్వే డీసీపీ కేపీఎస్ మల్హోత్రా చెప్పారు.
”రాత్రి తొమ్మిది గంటల సమయంలో రద్దీ బాగా పెరిగిపోయింది. రైలు కోసం ఎదురుచూస్తూ ఒక చోట ఎక్కువమంది ఉన్నప్పుడు ఏదన్నా తప్పుడు సమాచారం వ్యాపిస్తే అది తొక్కిసలాటకు దారితీస్తుంది. ఎక్కువమంది రావడం, రెండు రైళ్లు ఆలస్యం కావడంతో పది నిమిషాల్లో ఇలా జరిగింది. అసలు కారణం దర్యాప్తులో తెలుస్తుంది” అని ఆయనన్నారు.
ప్లాట్‌ఫామ్ నంబరు 3 నుంచి ప్లాట్‌ఫామ్ నంబరు 13కు రమ్మని ప్రయాణికులకు చెప్పడం తొక్కిసలాటకు దారితీసిందా అన్న ప్రశ్నకు డీసీపీ మల్హోత్రా సమాధానమిస్తూ అలాంటిదేమీ జరగలేదన్నారు. రైల్వేశాఖ ప్రత్యేక రైలు నడుపుతోంది. ఆ ప్రకటన చేశారు. రైలు ప్లాట్‌ఫామ్ మార్చినట్టు నాకు సమాచారం లేదు” అని ఆయనన్నారు.
సాయంత్రం 6 గంటల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు రావడం మొదలయింది. వారిని ఆపేందుకు ఏ ప్రయత్నం చేయలేదెందుకు అన్న ప్రశ్నకు బదులిచ్చిన ఆయన… ఆ సమయంలో అంతమంది లేరని చెప్పారు. ”6 గంటల సమయం నుంచి లక్షల సంఖ్యలో జనం లేరు. దాదాపు తొమ్మిది గంటల సమయంలో ట్రైన్‌లు వచ్చేటప్పుడు రద్దీ పెరిగింది. 6 గంటలప్పుడు పరిస్థితి నియంత్రణలో ఉంది” అని ఆయన తెలిపారు.
”ప్లాట్‌పామ్ నంబరు 14పై తొక్కిసలాట జరిగిందని పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి మాకు సమాచారం వచ్చింది” అని ఎన్డీఆర్ఎఫ్ కమాండంట్ దౌలత్ రామ్ చౌధరి చెప్పారు.
వీఐపీల కోసం మేం ఇక్కడకు వచ్చాం. మా పని పూర్తయ్యాక నేను వెనక్కి వెళ్లబోయా. కానీ వెళ్లలేకపోయా” అని తొక్కిసలాట జరిగిన సమయంలో న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌లోనే ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి అజిత్ చెప్పారు.
”ఇలాంటిది జరుగుతుందేమోనని సాయంత్రం సమయంలో నేను ఊహించాను. నేను లోక్ కళ్యాణ్ మార్గ్ నుంచి న్యూదిల్లీ వచ్చాను. న్యూదిల్లీ మెట్రో స్టేషన్ నుంచి బయటకు రావడానికి నాకు గంట సమయం పట్టింది. మామూలుగా రెండు నిమిషాల్లో బయటకు రావొచ్చు.
నా పని అయిన తర్వాత వెనక్కి వెళ్లడానికి నాకు రూట్ కనిపించలేదు. అప్పుడు నా అంతట నేను ప్రకటన చేశాను. ‘మూడు-నాలుగు రోజులు ఆగాలని భారత ఆర్మీ, అధికారయంత్రాంగం చెబుతోంది’ అని తెలియజేశా. ఒక రైలులో ఐదు నుంచి 10 వేలమంది ప్రయాణించలేరని నేను జనానికి చెప్పా. కానీ ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. ఇది తొక్కిసలాటకు దారితీసింది” అని అజిత్ చెప్పారు.
12వ నంబరు ప్లాట్‌ఫామ్‌కు రావాల్సిన రైలు 16వ నంబరు ప్లాట్‌ఫామ్‌కు వస్తోందన్న ప్రకటన వినగానే ప్రజలు అటువాళ్లిటు, ఇటువాళ్లటు వెళ్లడం మొదలుపెట్టారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. బ్రిడ్జి మీద ప్రజలు గాయపడ్డారు. కొందరని ఆస్పత్రికి తీసుకెళ్లారు. జనసమూహాన్ని నియంత్రించేవాళ్లెవరూ లేరక్కడ. గంట తర్వాత అధికారులు అక్కడికి చేరుకున్నారు” అని ప్రత్యక్ష సాక్షి హీరాలాల్ మహతో న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి చెప్పారు.
”14,15 ప్లాట్‌ఫామ్‌లపై రైళ్లు చూసి 13వ నంబరు ప్లాట్‌ఫామ్‌పైన ఉన్నవాళ్లు ఇటువైపు వచ్చారు. జనసమూహం ఎక్కువగా ఉండడంతో వారినెవరూ ఆపలేకపోయారు. ప్లాట్‌ఫామ్ మార్చలేదు” అని ప్రత్యక్షసాక్షి రవి తెలిపారు.