కాంగ్రెస్​ సీనియర్​ నేత అహ్మద్​ పటేల్​ కన్నుమూత

37
Ahmed Patel dies

కాంగ్రెస్​ సీనియర్​ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్​ పటేల్​ (71) కన్నుమూశారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడి… హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో అహ్మద్​ పటేల్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు ఫైజల్​ ట్విటర్​ ద్వారా వెల్లడించారు. కరోనా బారిన పడి.. పలు అవయవాలు దెబ్బతినడంతో అహ్మద్ పటేల్ కన్నుమూశారని పేర్కొన్నారు.

అహ్మద్​ పటేల్ ​ తాను కరోనా బారిన పడినట్లు అక్టోబర్​ 1న ట్విటర్​ ద్వారా తెలిపారు. అనంతరం నవంబర్​ 15న ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో అహ్మద్​ పటేల్ తుదిశ్వాస విడిచారు.

గుజరాత్ కు చెందిన 71 ఏళ్ల అహ్మద్ పటేల్‌.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగానే కాకుండా, సోనియాగాంధీకి వ్యక్తిగత సలహాదారుగా, అత్యంత నమ్మకస్థుడైన నేతగా మెలిగారు. కరోనాతో ఆస్పత్రికి పరిమితమైపోవడంతో ఇటీవలి గుజరాత్ ఉప ఎన్నికలు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాల్లో ఆయన భాగం పంచుకోలేకపోయారు.

అహ్మద్ పటేల్ పూర్తి పేరు అహ్మద్భాయ్ మొహమ్మద్భాయ్ పటేల్. పటేల్…గుజరాత్ నుంచి 8 సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. లోక్ సభకి మూడుసార్లు(1977-1989), రాజ్యసభలో ఐదుసార్లు (1993 నుండి) ప్రాతినిధ్యం వహించారు. 9 ఆగస్టు 2017 న అహ్మద్ పటేల్ ఐదవసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 21 ఆగస్టు 2018 న కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కోశాధికారిగా నియమితులయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here