దేవరగట్టులో సాగిన సమరం.. 50మందికి గాయాలు

కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దసరా పండుగ పూట కర్రల సమరం పేరుతో మనుషుల తలలు పగలగొట్టుకుని కనిపిస్తూ ఉంటారు. పరిస్థితి చేయిదాటి కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సైతం ఉన్నాయి. దసరా పండుగ వేళ దేవరగట్టులో ఈ వేడుకలు ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నాయి. దేవునిపై భక్తితో తరతరాలుగా సాగుతున్న ఈ సంప్రదాయానికి అడ్డుకట్ట వెయ్యాలని ఈ ఏడాది కర్రల సమరం జరగకుండా చూడాలని విశ్వ ప్రయత్నాలు చేసినా.. చివరకు పోలీసులపై కర్రలే గెలిచాయి.

1500 మంది పోలీసులు, 30 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా కర్నూలు జిల్లా దేవరగట్టులో మాత్రం ప్రతి జరిగినట్లే ఈసారి కూడా బన్నీ ఉత్సవం జరిగింది. అర్థరాత్రి కర్రలతో కొట్టేసుకున్నారు. ఈ సమరంలో దాదాపు 50మందకి గాయాలయ్యాయి. నిజానికి ఈ సంవత్సరం కరోనా కారణంగా ప్రభుత్వం కర్రల సమరానికి అనుమతి ఇవ్వలేదు. ముందుగానే కర్నూలు పోలీసులు దేవరగట్టును మోహరించి అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 10 తర్వాత పోలీసులు కాస్త కంట్రోల్ వదిలేయగా.. తండోపతండాలుగా బన్నీ ఉత్సవానికి తరలివచ్చి అర్థరాత్రి పోలీసుల ఆంక్షల్ని పట్టించుకోకుండా ఆనవాయితీ ప్రకారం.. రక్తం చిందించి దేవునిపై విశ్వాసం, భక్తి, సంప్రదాయాలకే ప్రాధాన్యత ఇచ్చారు.

నెరినికి, సుళువాయి, విరుపాపురం, అరికేరి, ఎల్లార్తి గ్రామాల ప్రజలు కర్రలు, కాగడాలతో దేవరగట్టుకు చేరుకుని, మాలమల్లేశ్వరస్వామి విగ్రహాన్ని దక్కించుకోవడానికి కర్రలతో సమరానికి దిగారు. అయితే కర్రల సమరానికి అడ్డుకట్ట వెయ్యడానికి విశ్వ ప్రయత్నం చేసిన పోలీసులు.. ఉత్సవం జరగదు కదా అని ప్రతిసారిలా తాత్కాలిక ఆస్పత్రిని కూడా ఏర్పాటు చెయ్యలేదు. ఈ క్రమంలో గాయపడినవారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.

సోమవారం రాత్రి 10.30వరకు ఖాళీగా ఉన్న తేరు బజారు ప్రాంతం ఒక్కసారిగా జనంతో కిక్కిరిసిపోయింది. ఆలయంలో అర్చకులు స్వామి కల్యాణోత్సవం నిర్వహించగా అనంతరం ఉత్సవ విగ్రహాలను కొండపై నుంచి కిందికి తీసుకువచ్చి సింహాసన కట్ట వద్ద ఉంచారు. అక్కడి నుంచి భక్తులు విగ్రహాలకు కర్రలు అడ్డుగా ఉంచి రాక్షసపడ వద్దకు తీసుకువెళ్లారు. కర్రల సమరంలో 50 మంది గాయపడగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Share.