ఏపీ టీడీపీలో కొత్త కమిటీల ఎంపికపై పార్టీలో అసంతృప్తి

ఏపీ టీడీపీలో కొత్త కమిటీల ఎంపికపై పార్టీలో అసంతృప్తికి కారణమైందంటున్నారు. పలువురు నేతలు బహిరంగంగా తమ ఆవేదన వ్యక్తం చేయకపోయినా… అనుచర వర్గం ముందు తమలోని బాధను వెళ్లగక్కుతున్నారట. ప్రస్తుతం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎవరెవరు పోరాడుతున్నారనే అంశాలను బేరీజు వేసుకొని అధినేత చంద్రబాబు ఈ కమిటీలను ఏర్పాటు చేశారట. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత అనేక మంది నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, చంద్రబాబుకు దగ్గరగా ఉన్న అనేకమంది ఓటమి తర్వాత అడ్రస్ లేకుండా పోయారు.

అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి పదవులు:
గత 16 నెలల నుంచి పార్టీలో ఎవరు క్రియాశీలకంగా ఉన్నారు? అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పోరాడుతున్నారనే సమాచారం ఆధారంగా చంద్రబాబు కమిటీల నియామకాలను ప్రారంభించారని అంటున్నారు. కొంతమందిపై కేసులు మోపినా అచ్చెన్నాయుడు వంటి నేతలు వెనక్కి తగ్గలేదని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న లాంటి నేతలు దాడులు జరిగినా వెరవలేదని గుర్తు చేస్తున్నారు. తాను కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా పార్టీ పదవుల ఎంపికలో సమతూకం పాటించాల్సి ఉందని చంద్రబాబు అంటున్నారు.

ఆలపాటి, ఉమ, నానిలకు దక్కని పదవులు:
పార్టీ ఓటమి పాలైనా క్రియాశీలకంగా ఉన్న గుంటూరు జిల్లాకు చెందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్, కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి నేతలకు కూడా పదవులు ఇవ్వలేకపోయారు. పార్టీలో క్రియాశీలకంగా ఉన్న మరికొందరికి పదవులు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. రాష్ట్రంలో ముగ్గురు లోక్‌సభ సభ్యుల్లో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌లకు పార్టీ పదవులు దక్కాయి. విజయవాడ ఎంపీ కేశినేని నానికి ఎలాంటి పదవీ ఇవ్వలేదు. నాని మాత్రం దీనిపై ఎక్కడా అసహనం వ్యక్తం చేయలేదు.

ఆవేదనలో అనురాధ, ఆగ్రహంలో నన్నపనేని:
పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఆమెకు వ్యతిరేకంగా వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చివరకు ఆమె కుటుంబ వ్యాపారంపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. అయితే తనకు పదవి దక్కలేదనే ఆవేదనలో ఆమె ఉన్నారట. రాష్ట్ర కమిటీలో ఆమెకు స్థానం దక్కే అవకాశముందంటున్నారు. మరోవైపు మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి కూడా తన సీనియారిటీకి తగిన గౌరవం దక్కలేదని గుర్రుగా ఉన్నారట. వీరిలో ఎక్కువమందికి రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ముఖ్యమైన నాయకులకు పదవి ఎందుకివ్వ లేకపోయారు:
కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యులు, పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులు, జిల్లా సమన్వయకర్తలు, పార్లమెంటరీ నియోజకవర్గాల మహిళా అధ్యక్షులు నియామకంతో ఎక్కడైనా అసంతృప్తులు ఉంటే.. అర్హులైన వారిని పార్లమెంట్ కమిటీలు, రాష్ట్ర కమిటీల్లో సర్దుబాటు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యమైన నాయకులతో చంద్రబాబే నేరుగా మాట్లాడి పదవి ఎందుకు ఇవ్వలేకపోయామో చెబుతున్నారని టాక్‌. అలకబూనిన నాయకులకు మున్ముందు పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని సర్ది చెబుతున్నారని అంటున్నారు.

అందరికీ న్యాయం చేశానంటున్న చంద్రబాబు:
పార్టీలో పదవుల పందేరం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తప్పించి మిగిలిన అన్ని కమిటీలను నియమించారు అధినేత చంద్రబాబు. పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో, తెలంగాణ కమిటీలను ఖరారు చేశారు. పార్టీ కేంద్ర కమిటీలో ఎవరూ ఊహించని కొత్త కొత్త పేర్లు దర్శనమిచ్చాయి. అడిగిన వారికి అడిగినట్లు లేదనకుండా అందరికీ చంద్రబాబు న్యాయం చేశారని అంటున్నారు. అయినా కొందరు పేర్లు మిస్సవ్వడంతో అలక వహిస్తున్నారని చెబుతున్నారు.

జూనియర్స్‌ కి పెద్ద పెద్ద పదవులిచ్చారనే విమర్శలు:
మరోపక్క, త్వరలోనే పార్టీ రాష్ట్ర కమిటీ ప్రకటన కూడా రాబోతుంది. ఈ కమిటీలో మరికొంత మందికి పదవులు దక్కనున్నాయి. రాజకీయ పార్టీలో అధికార పార్టీ అయితే నామినేటెడ్ పోస్టులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రతిపక్షం అయితే పార్టీ పదవులే మహాభాగ్యం. అందువల్లే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ పదవుల పందేరంలో జూనియర్స్‌ని పెద్ద పెద్ద పదవులలో కూర్చోబెట్టారనే విమర్శలు సైతం వస్తున్నాయి.

ఒకరిద్దరు నేతలు మినహాయించి పూర్తిగా దుకాణం సర్దేసిన రాయలసీమ నేతలు:
అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది సీనియర్‌ నేతలు పార్టీని గాలికొదిలేశారు. నియోజకవర్గాలకు దూరంగా హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కాలక్షేపం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అవినీతిపై పోరాటాలు చేయాలని అధిష్టానం పిలుపునిచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. కేసులకు భయపడి కొందరు, వ్యక్తిగత సమస్యలతో ఇంకొందరు ఇంట్లో నుంచి బయటికి రావటం లేదు. ఒకరిద్దరు నేతలు మినహాయించి రాయలసీమ నేతలు పూర్తిగా దుకాణం సర్దేశారని చెబుతున్నారు. మరికొంత కాలం వేచి చూద్దామనే ధోరణిలో ఇంకొందరున్నారు.

పొలిట్‌బ్యూరో సభ్యుల సంఖ్యను చంద్రబాబు రెట్టింపు చేయటం వెనుక కారణమిదే:
గుంటూరు జిల్లాకు చెందిన ఎక్కువమంది నేతలు హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. ఇలా అయితే పార్టీ కేడర్ తమ దారి తాము చూసుకుంటుందని భావించిన చంద్రబాబు పార్టీ నాయకుల మొత్తాన్ని యాక్టివ్ చేయడానికే ఈ పదవుల పందేరాన్ని చేపట్టారని టాక్‌. దీనిలో భాగమే పొలిట్‌బ్యూరో సభ్యుల సంఖ్యను రెట్టింపు చేశారట. అయితే ఈ పదవుల నియామకం పట్ల కొందరు సీనియర్లలో అసంతృప్తి కూడా ఉంది. ఎవరిని పడితే వారిని పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవడం సరికాదని, దీనివల్ల పార్టీ పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని సీనియర్లు అంటున్నారు.

ఇప్పటికైనా పని చేస్తారా?
పార్టీలో ఉన్న ప్రతి సీనియర్‌కీ ఏదో ఒక పదవి వచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే పార్లమెంటు అధ్యక్షులను నియమించిన తర్వాత కొంతవరకూ ఫలితాలు వస్తున్నాయని పార్టీ భావిస్తోంది. పార్టీ యువనేత నారా లోకేశ్‌ ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ కేడర్ లో జోష్ నింపుతున్నారు. అధినేత చంద్రబాబు సైతం వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా నాయకులతో మాట్లాడుతున్నారు. మరి ఈ కొత్త పదవులతో అయినా నాయకులంతా తమ అధినేత ఆశించిన స్థాయిలో పని చేస్తారో లేదో చూడాలని కార్యకర్తలు అంటున్నారు.

Share.