నార్త్ మాసిడోనియాలోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య 51 నుంచి 59కి పెరిగింది.ఈ అగ్నిప్రమాదంలో 59 మంది మరణించగా, 155 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.కోకని పట్టణంలోని పల్స్ క్లబ్‌లో తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. దేశ రాజధాని స్కాప్యాకు తూర్పున 100 కి.మీ దూరంలో ఈ కోకని పట్టణం ఉంటుంది.సోషల్ మీడియా ఫుటేజీలో, భవనం మంటల్లో తగలబడుతున్నట్లుగా కనిపిస్తోంది.
క్లబ్‌లో డీఎన్‌కే బ్యాండ్ సంగీత కార్యక్రమం కోసం 1500 మంది హాజరైనట్లుగా చెబుతున్నారు. ఉత్తర మాసిడోనియాలో హిప్-హాప్ ద్వయం డీఎన్‌కే బ్యాండ్ చాలా ఫేమస్.ప్రాథమిక నివేదికల ప్రకారం, బాణసంచా పేల్చే పరికరాల్లో నిప్పురవ్వలు ఎగసిపడి మంటలు చెలరేగడం మొదలైనట్లు తెలిసిందని హోం మంత్రి పాన్స్ టోస్కోవ్‌స్కీ చెప్పారు.
”ఈ నిప్పురవ్వలు, మండే స్వభావమున్న మెటీరియల్‌తో తయారుచేసిన సీలింగ్‌కు అంటుకున్నాయి. తర్వాత క్లబ్ అంతటా మంటలు వ్యాపించాయి. ఈ కేసు విషయంలో కొంతమందిని అరెస్ట్ చేశాం” అని కోకని పోలీస్ స్టేషన్ ముందు విలేఖరులకు ఆయన తెలిపారు.వేదిక మీద మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శన ఇస్తుండగా రెండుచోట్ల నిప్పురవ్వలు ఎగసిపడి సీలింగ్‌కు మంట అంటుకున్నట్లు, తర్వాత వేగంగా మంటలు విస్తరించినట్లుగా ఫుటేజీలో కనిపిస్తుంది.
ఈ ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీ, ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు.పర్యవసానాలను ఎదుర్కోవడానికి చేయాల్సిందంతా చేస్తామని, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషాదానికి కారణాలను కనుక్కుంటున్నామని అన్నారు.
”ఇది దేశానికి చాలా కష్టమైన, విషాదకరమైన రోజు. చాలా యువప్రాణాలను కోల్పోయాం” అని ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు.కోకని ఆసుపత్రిలో తొలుత ఒళ్లంతా తీవ్రంగా కాలిపోయిన 90 మందిని చేర్చారు. గాయాల పాలైన మరికొంతమందిని చికిత్స కోసం స్కాప్యాలోని ఆసుపత్రులకు తరలించారు