నటీనటులు: తమన్నా భాటియా-వశిష్ఠ-హెబ్బా పటేల్-మురళీ శర్మ-శ్రీకాంత్ అయ్యంగార్- శరత్ లోహితశ్వ తదితరులు సంగీతం: అజనీష్ లోక్ నాథ్ ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్ నిర్మాత: డి.మధు దర్శకత్వం: అశోక్ తేజ కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వ పర్యవేక్షణ: సంపత్ నంది కరోనా కాలంలో ఓటీటీలో రిలీజైన సినిమా.. ఓదెల రైల్వే స్టేషన్. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తీసి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసింది సంపత్ నంది అండ్ టీం. అశోక్ తేజ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి స్క్రిప్టు అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశాడు సంపత్. తమన్నా-వశిష్ఠ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: ఓదెల అనే ఊర్లో పెళ్లికూతుళ్లను అనుభవించి ప్రాణాలు తీయడం అలవాటుగా మార్చుకున్న తిరుపతి (వశిష్ఠ)ను అతడి భార్య అయిన రాధ (హెబ్బా పటేల్) చంపేస్తుంది. తిరుపతి చేసిన ఘోరాలన్నీ తెలుసుకున్న ఊరి జనాలు.. అతడి పాడె మోయడానికి కూడా ముందుకు రారు. అంతేకాక మరణానంతరం అతడి ఆత్మకు శాంతి చేకూరకుండా సమాధి శిక్ష విధిస్తారు. దీంతో ఆత్మగా మారిన తిరుపతి ఓదెల మీద పగబడతాడు. ఈ క్రమంలోనే కొత్తగా పెళ్లయిన రెండు జంటల ప్రాణాలు తీస్తాడు తిరుపతి. ఈ ఘటనలతో ఊరిలో కల్లోలం మొదలవుతుంది. ఈ ఘోరాలను ఎలా ఆపాలో తెలియక అల్లాడిపోతున్న సమయంలో చిన్న వయసులోనే ఆ ఊరి నుంచి వెళ్లిపోయి నాగ సాధువుగా మారిన భైరవి (తమన్నా) గురించి తెలుస్తుంది. ఊరి వాళ్ల కష్టాలను తెలుసుకుని ఓదెలకు వచ్చిన భైరవికి ఎదురైన అనుభవాలేంటి? ఆమె తిరుపతి ఆత్మను ఆపగలిగిందా? ఓదెలకు ప్రశాంతత చేకూరిందా? ఈ ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ: విలన్ ప్రేతాత్మగా మారి.. తన ఆత్మకు శాంతి లేకుండా చేసిన ఊరి మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. అందులో భాగంగా ముందుగా ఒక శోభనం గదిలోకి అడుగు పెడతాడు. పెళ్లికూతురు జుట్టు పట్టుకుని లాగితే చర్మం మొత్తం ఊడి వచ్చి తలంతా రక్తసిక్తమవుతుంది. విలన్ నెక్ట్స్ టార్గెట్.. మళ్లీ శోభనం జంటే. ఈసారి సెటప్ మొక్కజొన్న తోటలో. అక్కడ పెళ్లికూతురి నోట్లోకి మొక్కజొన్న కండెను కొట్టి చంపుతాడు. నోట్లో మొక్కజొన్న కండెతో కాలిన శవాన్ని ఒకటికి నాలుగుసార్లు చూపించి మరీ సన్నివేశాన్ని ముగిస్తారు. ఇంకో సీన్లో ఓ చిన్న పాప.. కత్తి తీసుకుని కథానాయిక తల నరికి చేత్తో పట్టుకుని తీసుకెళ్తుంది. ఇక పతాక సన్నివేశాల్లో తమన్నాను విలన్ హింసించే సన్నివేశాన్నయితే మాటల్లో వర్ణించడం కష్టం. విలన్ పాత్ర మీద ప్రేక్షకుల్లో కసి పెంచడానికి ఇలాంటి సీన్లు పెట్టి ఉండొచ్చేమో కానీ.. లేడీ క్యారెక్టర్ల మీద ఇంత తీవ్ర స్థాయి హింసను చూసి తట్టుకోవడం మాత్రం అందరి వల్లా కాదు. ప్రస్తుత ‘పాన్ ఇండియా’ ట్రెండుకు తగ్గట్లు ఓవైపు దేవుడు.. దైవదూత పాత్రలను.. దేవుడి తత్వాన్ని గొప్పగా చూపించడానికి చేసిన ప్రయత్నిస్తూ.. ఇంకోవైపు ఇలాంటి ఇబ్బందికర సన్నివేశాలు పెట్టడంలో ఆంతర్యమేంటో అర్థం కాదు. రెంటికీ పొంతన కుదరక ‘ఓదెల-2’ మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. దైవ భక్తి వెర్సస్ దుష్ట శక్తి.. ఇది సక్సెస్ ఫుల్ సినిమా ఫార్ములాల్లో ఒకటి. తెలుగు సినిమా ఆరంభం నుంచి ఈ నేపథ్యంలో వందల సినిమాలు వచ్చి ఉంటాయి. ఈ మధ్య పాన్ ఇండియా స్థాయిలోనూ ఈ తరహా చిత్రాల ఊపు పెరిగిన నేపథ్యంలో సంపత్ నంది అండ్ టీం కూడా అదే బాట పట్టింది. ఐతే ‘ఓదెల-2’ను చూస్తుంటే.. కథ పరంగా చాలా సినిమాలను అనుకరిస్తున్నట్లు కనిపిస్తుందే తప్ప.. ఏదీ ఆర్గానిగ్గా.. కొత్తగా కనిపించదు. ‘అరుంధతి’కి దీనికి సంబంధం లేదని మేకర్స్ చెప్పుకున్నారు కానీ.. ముఖ్య పాత్రలన్నింటిలో ఆ సినిమాతో పోలికలు కనిపిస్తాయి. వశిష్ఠ చేసిన తిరుపతి పాత్ర పశుపతి పాత్రకు రెప్లికాలా కనిపిస్తే.. తమన్నా క్యారెక్టర్ కొంతమేర అరుంధతిని గుర్తుకు తెస్తుంది. మురళీ శర్మ చేసిన పీరు సాయిబు క్యారెక్టర్.. డిట్టో షాయాజీ షిండే పాత్రలా అనిపిస్తుంది. ఇక ప్రేతాత్మగా మారిన విలన్ ఊరి మీద పగబట్టి ఒక్కొక్కరిని చంపుకుంటూ పోవడం.. ఎన్ని సినిమాల్లో చూశామో లెక్క లేదు. చిన్న సినిమా అయినా విజువల్స్ లో.. గ్రాఫిక్స్ లో భారీతనం చూపించడానికి ప్రయత్నించారు కానీ.. కొన్ని చోట్ల అవి శ్రుతి మించి.. కృత్రిమంగా తయారై ఈ కథలో సింక్ కాలేదనిపిస్తుంది.
‘ఓదెల-2’లో కొన్ని ఆకర్షణలు.. ఆసక్తికర సన్నివేశాలు లేకపోలేదు. విలన్ పాత్రను బాగా డిజైన్ చేశారు. ఆరంభ సన్నివేశాలను బాగా తీర్చిదిద్దారు. చనిపోయిన విలన్ ఆత్మకు శాంతి చేకూరకుండా శిక్ష వేయడం.. అతను ఊరి మీద పగబట్టడం.. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు క్యూరియస్ గా అనిపిస్తాయి. ఆరంభంలో కథకు బలమైన పునాది పడేలా చేస్తాయి ఈ సన్నివేశాలు. విలన్ ప్రేతాత్మగా మారి ఊరి మీద పగ తీర్చుకోవడం మొదలు పెట్టే వరకు అంతా బాగానే అనిపిస్తుంది. కానీ తర్వాత మాత్రం సన్నివేశాలు రిపీటెడ్ గా అనిపిస్తాయి. కొత్తదనం ఏమీ లేకుండా.. మరీ పచ్చిగా.. తీవ్ర హింసాత్మకంగా సాగే సన్నివేశాలతో విరామ సమయానికి ‘ఓదెల-2’ మిక్స్డ్ ఫీలింగే ఇస్తుంది. తమన్నా పాత్ర పాత్ర ప్రవేశంతో మళ్లీ కథనం కొంత ఊపందుకున్నట్లు కనిపించినా.. తర్వాత మళ్లీ మామూలే. నాగసాధువు అయిన హీరోయిన్.. ప్రేతాత్మ అయిన విలన్ ఒకరికొకరు సవాళ్లు విసురుకున్న సన్నివేశంలో సంభాషణలు మరీ సుదీర్ఘంగా.. పేలవంగా సాగి ఆసక్తిని చంపేస్తాయి. హీరోయిన్-విలన్ మధ్య రసవత్తర పోరును ఆశిస్తే.. ఇలా నేనది చేస్తా.. నేనిది చేస్తా అంటూ నాన్ స్టాప్ డైలాగులు చెబుతూ సవాళ్లు విసురుకోవడం ఏంటో అర్థం కాదు. ఐతే చివరి 20 నిమిషాల్లో మాత్రం ‘ఓదెల-2’ తిరిగి ట్రాక్ ఎక్కింది. శివుడితో ముడిపడ్డ పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలం కూడా బాగానే పని చేసింది. ట్రెండుకు తగ్గ ‘డివైన్’ క్లైమాక్స్ తో ‘ఓదెల-2’ మార్కులు కొట్టేస్తుంది. కొన్ని ఎపిసోడ్ల వరకు హై ఇచ్చినా.. ఓవరాల్ గా ‘ఓదెల-2’ ఓ మోస్తరుగా అనిపిస్తుందంతే. నటీనటులు: ‘ఓదెల-2’లో బెస్ట్ పెర్ఫార్మన్ నిస్సందేహంగా.. విలన్ పాత్ర చేసిన వశిష్ఠనే. ఊరి జనాలను వణికించే పాత్రలో ప్రేక్షకులకు భయం గొలిపేలా నటించడంలో అతను విజయవంతం అయ్యాడు. తనకు వాయిస్ పెద్ద అసెట్. దాంతోనే చాలా వరకు భయపెట్టాడు. తన అవతారం.. నటన కూడా ప్లస్ అయ్యాయి. నాగసాధువు పాత్రలో తమన్నా బాగానే చేసింది. పాత్రకు తగ్గట్లు తన లుక్ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో బ్లాంక్ ఫేస్ పెట్టడం ఇబ్బందికరంగా అనిపించినా.. కొన్ని సీన్లలో తమన్నా తన ప్రతిభను చాటుకుంది. హెబ్బా పటేల్ గురించి చెప్పడానికేమీ లేదు. కీలకమైన సన్నివేశాల్లో తన నటన తేలిపోయింది. డబ్బింగ్ ఆర్టిస్టుతో చెప్పించిన డైలాగులు వింటుంటే ఏడుస్తున్నట్లు అనిపిస్తే.. ఆమె హావభావాలు నవ్వుతున్నట్లు ఉండడం చిత్రం. మురళీ శర్మ పాత్ర అనుకున్న స్థాయిలో లేదు. ఆయన నటన కూడా మొక్కుబడిగా సాగింది. శ్రీకాంత్ అయ్యంగార్ తక్కువ సన్నివేశాల్లోనే తన ప్రత్యేకతను చాటాడు. మిగతా నటీనటులంతా మామూలే.
సాంకేతిక వర్గం: టెక్నికల్ గా ‘ఓదెల-2’ ఓకే అనిపిస్తుంది. అజనీష్ లోక్ నాథ్ పాటలన్నీ స్పీడ్ బ్రేకర్లే కానీ.. నేపథ్య సంగీతం మాత్రం సినిమాలో ఇంటెన్సిటీని పెంచడంలో ముఖ్య పాత్ర పోషించింది. విలన్ సంబంధిత సన్నివేశాల్లో ఆర్ఆర్ మోత మోగిపోయింది. ‘మంగళవారం’ సినిమాను గుర్తుకు చేసేలా సాగిందీ అజనీష్ లోక్ నాథ్ స్కోర్. సౌందర్ రాజన్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ లో మంచి క్వాలిటీ చూపించాడు. ఈ సినిమా స్థాయికి విజువల్ ఎఫెక్ట్స్ లోనూ బాగానే భారీతనం చూపించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాకు స్క్రిప్టు రాయడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసిన సంపత్ నంది కొన్ని చోట్ల తన మార్కు చూపించాడు. విలన్ పాత్రను తీర్చిదిద్దడంలో తన నైపుణ్యం కనిపిస్తుంది. కథ పరంగా మరీ కొత్తదనేమేమీ లేదు. కానీ సన్నివేశాలను ప్రెజెంట్ చేసే విషయంలో కొంచెం నియంత్రణ పాటించాల్సింది. అశ్లీలత.. హింస తగ్గించాల్సింది. అశోక్ తేజ డైరెక్షన్ జస్ట్ ఓకే అనిపిస్తుంది.
రేటింగ్ – 2.5/5