ఒంటిమిట్టను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు
శ్రీసీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం దంపతులు – భక్తులకోసం భారీ ఏర్పాట్లు
కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సతీమణితో కలిసి పాల్గొని స్వామివార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఒంటిమిట్టను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. భక్తులు రెండు మూడు రోజులు ఉండేలా అవసరమైన సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు.
ఈ కళ్యాణోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఆలయ ప్రాంగణానికి సమీపంలో 23 భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయగా, భద్రత కోసం 3వేల మంది పోలీసులను మోహరించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు కూడా ఏర్పాటు చేయడం ద్వారా భద్రతను కట్టుదిట్టంగా నిర్వహించారు.సీతారాముల కళ్యాణాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు. “ఈ భక్త జనాన్ని చూస్తుంటే దేవుళ్లు స్వయంగా కళ్యాణం చేసుకుంటున్నారన్న భావన కలుగుతుంది,” అంటూ సీఎం చంద్రబాబు అన్నారు.
ఇదే సందర్భంగా ఆయన రామరాజ్యంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ – “రామరాజ్యంలో పేదరికం ఉండకూడదు. రాముడి పాలనకు ఆదర్శంగా ఉండేలా మన పరిపాలన సాగాలి. మానవ సేవే మాధవ సేవ. భగవంతుడికి సేవ చేయాలంటే, పేదలను పైకి తీసుకురావాలి” అని అన్నారు.అంతేకాదు, ఒంటిమిట్ట చెరువు ఆధునీకరణ పనులు ప్రారంభించామని, దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత శ్రీసీతారాముల కళ్యాణోత్సవాన్ని ఒంటిమిట్టలోనే జరిపేందుకు అధికారికంగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.