పేదరికం లేని సమాజమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పీ-4 కార్యక్రమాన్ని అమరావతి వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పీ-4 లోగోను వారు ఆవిష్కరించారు. అదేవిధంగా [email protected] మెయిల్ ఐడీ, 8008944791 ఫోన్ నంబర్తో ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్‌షిప్‌గా ఈ విధానం ఉండనుంది. తొలి దశలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు.
ఉగాది వేళ ఆంధ్రప్రదేశ్‌లో పీ-4 జీరో పావర్టీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2047 నాటికి మన ప్రజలు ఆదాయంలో వరల్డ్ నంబర్ 1గా నిలుస్తారని అన్నారు. వారిలో 30 శాతం మంది తెలుగువారే ఉండాలనేది తన ఆకాంక్షని తెలిపారు.
పీ-4 ప్రోగ్రాం అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం చేపడుతున్నారు. మొదటగా నాలుగు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడతారు. ఆయా గ్రామాల్లో 5,869 ఫ్యామిలీలకు లబ్ధి చేకూరుతుంది. సంపద అధికంగా ఉన్న ఫ్యామిలీలు అట్టడుగున ఉన్న ఫ్యామిలీలకు సపోర్టుగా నిలబడటమే ఈ కార్యక్రమ ఉద్దేశం.
ఈ ప్రోగ్రాంలో భాగంగా లబ్ధిదారులను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న సమాచారంతో పాటు సర్వే, గ్రామసభల ద్వారా గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 40 లక్షల ఫ్యామిలీలు దీనికి అర్హులుగా నిలుస్తుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో సర్వే చేశారు. ఈ సర్వే ద్వారా అట్టడుగున ఉన్న వారిని గుర్తిస్తారు.
లబ్ధిదారుల ధ్రువీకరణ అనంతరం వారి వివరాలను సమృద్ధి బంధనమ్ ప్లాట్‌ఫాంలో ఉంచుతారు. లబ్ధిపొందాల్సిన ఫ్యామిలీలను సాయం చేసే ఫ్యామిలీలతో అనుసంధానించడమే ఈ పీ-4 విధానంలో సర్కారు పాత్ర. నేరుగా సర్కారు ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. ఆయా కుటుంబాలు ఇందులో స్వచ్ఛందంగానే పాల్గొనవచ్చు. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 5 లక్షల కుటుంబాలను భాగస్వామి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పీ-ఈ విధానం ద్వారా అట్టడుగున ఉన్న 20% మందికి మేలు జరుగుతుంది. ప్రభుత్వం, ప్రైవేటుతో పాటు ప్రజలు భాగస్వాములై పేదరిక నిర్మూలన కోసం పనిచేయాల్సి ఉంటుంది. సంపదలో ఉన్నత స్థితిలో ఉన్న వారిలో 10% మంది అట్టడుగున ఉన్న వారిలో 20% మంది పేదలను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా ఆర్థిక అసమానతలు రూపుమాపొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.