దేశ వ్యాప్తంగా అందరిని కదిలించిన పహల్గాం ఉగ్రకిరాతక ఘటనకు సంబంధించి.. పరిణామాలు చాలా వేగంగా సాగుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి చొప్పున చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ రోజు టాప్ 5 అప్డేట్స్ లోకి వెళితే.. గురువారం బిహార్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయటం తెలిసిందే. పహల్గాం నరమేధానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని.. ఈ కిరాతకంలో పాల్గొన్న ఆ ఉగ్రవాదులు భూమ్మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటామని..వారు కలలో కూడా ఊహించలేని శిక్షలు విధిస్తామని స్పష్టం చేయటం తెలిసిందే. వారికి అంతమొందించేందుకు ఎంతవరకైనా సిద్ధమని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ మాటలకు తగ్గట్లే..పహల్గాం ఉగ్రదాడిలో హస్తం ఉందని భావిస్తున్న ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల్లో ఒకరి ఇంటిని ఐఈడీతో పేల్చేసినట్లుగా ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరిగా అనుమానిస్తున్న దక్షిణ కశ్మీర్ లోని త్రాల్ కు చెందిన ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్ అనే వ్యక్తి ఇంటిని ఐఈడీతో ధ్వంసం చేశారు.బెంగళూరులో నిర్వహించే ఒక ఈవెంట్ కు పాక్ జావెలిన్ స్టార్ నదీమ్ కు నీరజ్ చోప్రా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమం గురువారం జరిగింది. ఎప్పుడైతే పహ్లాగాం ఉగ్రఘటన చోటు చేసుకుందో.. ఆ కార్యక్రమానికి పాక్ జావెలిన్ ఆటగాడ్ని రావొద్దని చెప్పినట్లుగా నీరజ్ చోప్రా వెల్లడించారు. ఎన్ సీ క్లాసిక్ జావెలిన్ ఈవెంట్ కు పాక్ క్రీడాకారుడ్ని వద్దని చెప్పినట్లుగా నీరజ్ చోప్రా వెల్లడించారు. ఏ సందర్భంలో అయినా తనకు దేశమే ప్రథమ ప్రాధాన్యమని నీరజ్ స్పష్టం చేశారు.
పాక్ విలేకరికి దిమ్మ తిరిగే షాకిచ్చారు అమెరికా అధికార ప్రతినిధి బ్రూస్. పహ్లగాం ఉగ్రఘటన నేపథ్యంలో భారత్ – పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ.. అమెరికా వైఖరి ఏమిటని పాక్ మీడియా ప్రతినిధి ఆమెను ప్రశ్నించారు. దీనికి అసహనం వ్యక్తం చేసిన అమెరికా విదేశాంగ ప్రతినిధి బ్రూస్.. ఇప్పటికే తమ వైఖరిని తెలియజేశామని.. తాము భారత్ వైపే ఉంటామని స్పష్టం చేశారు. దీంతో.. పాక్ మీడియా ప్రతినిధి ముఖాన నెత్తురు చుక్క లేని పరిస్థితి.‘నేను దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను. మనం మరో సబ్జెక్టు మాట్లాడుకుందాం. ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్.. మంత్రి మార్రకో రూబియో మాట్లాడారు. అందుకే ఆ విషయంపై నేను మాట్లాడను. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చూకూరాలని ప్రార్థిస్తాను. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తాను. ఈ హీనమైన దాడికి పాల్పడిన వారికి శిక్షపడాలని కోరుకుంటా’ అని స్పష్టం చేశారు.
సొంత దేశ ప్రజల్ని పిట్టల్ని కాల్చినట్లుగా కాల్చేసిన ఉగ్రవాదుల తీరును ప్రపంచ దేశాలు తప్పు పడుతూ.. భారత్ కు సంఘీభావాన్ని తెలియజేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఒళ్లు బలుపు ప్రదర్శించిన అసోం ప్రతిపక్ష ఎమ్మెల్యే (ఏఐయూడీఎఫ్ పార్టీకి చెందిన) అమినుల్ ఇస్లామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. పహల్గాం ఉగ్రఘటనకు సంబంధించి పాకిస్థాన్ కు మద్దతు పలికిన ఈ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. తమ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని.. అది పూర్తిగా ఆ నేత వ్యక్తిగత వ్యాఖ్యలుగా పేర్కొన్నారు. ఉగ్రదాడిపై పాకిస్థాన్ కు ఏ విధంగా మద్దతు పలికినా వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత స్పష్టం చేశారు. సదరు ఎమ్మెల్యే మీద దేశద్రోహం కేసును నమోదు చేశామని ప్రకటించారు.
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ దాడి వెనుక హమస్ కుట్ర ఉందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇదే సందేహాన్ని భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ప్రస్తావించారు. హమాస్ నాయకులు ఇటీవల పాక్ అక్రమిత కశ్మీర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జైష్ ఎ మహమ్మద్ తో సమావేశమైనట్లుగా తమకు సమాచారం అందన్నారు. పహల్గాం దాడికి వీరికి మధ్య సంబంధం ఉందన్న అనుమానం కలుగుతోంది. ఇజ్రాయెల్ పై అక్టోబరు 7, 2023 హమస్ నరమేధానికి.. పహల్గాం పర్యాటకులపై ఉగ్రదాడికి సారూప్యత ఉందన్నారు. ఈ రెండు ఉదంతాల్లో అమాయక పౌరులే టార్గెట్ గా పేర్కొన్నారు. ఉగ్రవాదులు అన్ని స్థాయిల్లో పరస్పరం సహకారం అందించుకుంటున్నారని.. వారు ఒకరికొకరు అనుకరిస్తూ ఒకేలా మారుతున్నారన్నారు. ఈ ప్రమాదాలను ఎదుర్కోవటానికి నిఘా సంస్థలు కలిసి పని చేస్తున్నాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు.. హెచ్చరికలు తనకు ఎంతో ధైర్యాన్ని కలిగించాయన్న ఆయన.. దోషులను వేటాడుతామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇవ్వటం అభినందనీయమన్నారు.
జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో హై అలర్ట్ అమలవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తరహాలో హిమాచల్ ప్రదేశ్ లోనూ టెర్రరిస్టు దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో హిమాచల్ లోనూ హై అలర్ట్ ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖకు హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ ఆదేశించారు.ముఖ్యంగా కశ్మీర్ సహా పాక్ సరిహద్దు ప్రాంతాల్లోని చంబా, కాంగ్రా జిల్లాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసులను ఆదేశించారు. కాశ్మీర్ నుంచి పారిపోయిన ఉగ్రవాదులు హిమాచల్ ప్రదేశ్ వైపు రావొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిఘా తీవ్రతరం చేశారు.టెర్రరిస్టులు ఇంకా భారత్ లోనే ఉన్నారని.. వారి కోసం భద్రతా దళాల వేట కొనసాగుతున్న నేపథ్యంలో పహల్గామ్ తరహాలో మరోసారి ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు.
పహల్గామ్‌లో ఉగ్రదాడి జరగబోతోందనే సమాచారం మన నిఘా వర్గాలకు కొద్దిరోజుల క్రితమే తెలిసిందా? ‘‘ఒక టెర్రర్ గ్రూప్ స్థానికేతరులపై (కశ్మీర్‌కు వచ్చే పర్యాటకులపై) దాడికి ప్రణాళికలు రచిస్తోంది’’ అంటూ నిఘావర్గాలు అప్రమత్తం చేశాయా? అయినా భద్రతా సంస్థలు పట్టించుకోకపోవడం వల్లే ఇంతమంది చనిపోయారా? అంటే.. విశ్వసనీయ వర్గాలు ఈ ప్రశ్నలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు (పీవోకే) చెందిన ఒక ఉగ్రవాది.. ఈ దాడికి సంబంధించి సూచనప్రాయ వ్యాఖ్యలు చేశాడని, తాము ఆ సమాచారాన్ని అందించినా భద్రతా దళాలు వాటిని పట్టించుకోలేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడికి వ్యూహరచన మొత్తం పీవోకే, పాక్‌కు చెందిన అంతర్జాతీయ హ్యాండ్లర్లు చేశారని.. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు రియల్‌టైమ్‌లో ఎప్పుడేం చేయాలో ఆదేశాలు ఇచ్చారని, ఏయే ప్రాంతాల్లో భద్రతా దళాల సంఖ్య తక్కువగా, పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందో సమగ్ర సమాచారం అందించారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులకు ఆయుధాల వినియోగంలో సమగ్ర శిక్షణ ఇచ్చారని తెలిపాయి.
వారి హెల్మెట్లపై కెమెరాలున్నాయని.. దాడి ఘటనలను చిత్రీకరించి, సూత్రధారులకు పంపేందుకే వాటిని వినియోగించారని పేర్కొన్నాయి. అయితే, పహల్గాంలో ఉగ్రదాడి విషయంలో భద్రతా సంస్థల వైఫల్యం నిజమేగానీ.. పూర్తిగా విఫలమయ్యాయని చెప్పలేమని కర్ణాటకకు చెందిన రక్షణ రంగ వ్యవహారాల విశ్లేషకుడు గిరీశ్ లింగన్న అభిప్రాయపడ్డారు. దాడికి ముందు ఆ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించిన విషయం, వారి అనుమానాస్పద కదలికల గురించి నిఘా వర్గాలకు సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోందని.. కానీ, ఏ సమయంలో దాడి జరగబోతోంది? ఏ స్థాయిలో జరగబోతోందనే అంశంపై పూర్తి సమాచారం లేనందునే భద్రతా దళాలు సరిగ్గా స్పందించలేకపోయాయని ఆయన వివరించారు. దాడి జరిగిన వెంటనే మాత్రం భద్రతా దళాలు వేగంగా స్పందించాయని, మన దళాల సన్నద్ధత సామర్థ్యాన్ని ఇది సూచిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకోవాలని.. పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో మరింత మెరుగైన రియల్-టైమ్ సర్వైలెన్స్ ఏర్పాట్లు చేయాలని, కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థల మధ్య బలమైన సమన్వయం ఉండాలని, ప్రత్యేకించి కశ్మీర్‌లో పర్యాటక ప్రదేశాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించాలని, అంతర్జాతీయ మద్దతు.. మరీ ముఖ్యంగా అమెరికా మద్దతు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
పహల్గాంలో పర్యాటకులపై దాడి జరిపిన ఉగ్రవాదులు సైనికుల యూనిఫారాలు, అమెరికన్ మేడ్ ఎం4 కార్బైన్ అసాల్ట్ రైఫిళ్లు, ఏకే-47లు ధరించి వచ్చి.. దాదాపు 70 రౌండ్ల కాల్పులు జరిపినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టిన దర్యాప్తు అధికారులు.. మంగళవారం సాయంత్రానికి 50 నుంచి 70 దాకా యూజ్డ్ క్యాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కాగా… ఈ దాడికి సంబంధించిన దర్యాప్తు బాధ్యతను జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్‌ఐఏ) అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.