పాకిస్తాన్‌లో ప్యాసింజర్ రైలు హైజాకింగ్‌కు గురైంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బిఎల్‌ఎ) అనే వేర్పాటు వాదులు 500 మంది ప్రయాణికులతో వెళుతున్న క్వెట్టా -పెషావర్ జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలును మంగళవారంనాడు హైజాక్ చేశారు. 30మంది భద్రతా సిబ్బందిని హతమార్చి, మరో182మంది వివిధ విభాగాల భద్రతా బలగాలను బందీలుగా చేసుకున్నారు. ఆ తర్వాత మిగతా సాధారణ ప్రయాణికులను విడుదల చేశారు. వారిలో పిల్లలు, మహిళలు ఉన్నారు. పెషావర్‌కు వెళ్తుండగా గుడాలార్ పిరు కోనేరి స్టేషన్ల మధ్య ఈ రైలును హైజాక్ చేశారు. తొలుత వేర్పాటువాదులు రైలుపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.
బిఎల్‌ఏ సాయుధులు రైలు మార్గాన్ని పేల్చివేసి, ఒక సొ రంగ మార్గం వద్ద జాఫర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్‌ను నిలిపివేశారు. భద్రతా దళాలతో సహా రైలులోని ప్రయాణికులను బందీలుగా చేసినట్లు తెలిపారు. ట్రైన్ హైజాక్‌కు అడ్డుకునేందుకు యత్నించిన సైనికుల్లో కొందరిని కాల్చి చంపినట్లు స్థానికి వార్త సంస్థలు వెల్లడిస్తున్నాయి. కాల్పుల్లో ట్రైన్ డ్రైవర్ గాయపడ్డారు. వెంటనే పాకిస్తాన్ ప్రభు త్వం అదనపుసైనిక బలగాలను, సహాయ బృం దాలను హుటాహుటిన ఘటనా స్థలికి పంపిం ది. తీవ్రవాదులను మట్టుపెట్టి ప్రయాణికులు అందరినీ రక్షస్తామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. పాకిస్తానీ ఆర్మీ చేసిన దాడిని తిప్పికొట్టామని, 182 మందిని బందీలుగా పట్టుకున్నామ ని బిఎల్ ఏ ప్రకటించింది.
పాక్ సైన్యం వైమానికదాడులు ఆపకపోతే, మొత్తం బందీలందరినీ చంపివేస్తామని హెచ్చరించింది. ఏదైనా సైనిక చర్యకు పూనుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఏదైనా జరగరానిది జరిగితే బందీలను హతమార్చుతామని, దీనికి పాక్ ప్రభుత్వానిదే బాధ్యత అని బిఎల్‌ఎ ప్రకటించింది. బిఎల్‌ఏ చర్యను పాకిస్తాన్ దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి మొహసిన్ నఖ్వీ ఖండించారు.
అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ కొన్ని దశాబ్దాలుగా తమ ప్రాంతానికి పాక్ నుంచి సాతంత్య్రం కావాలని పోరాడుతోంది. పాక్‌లోని బలూచిస్తాన్ ప్రాంతం అటు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌లతో సరిహద్దులను పంచుకుంటోంది. కొంత కాలంగా ఈ ప్రాంతం లో ఉగ్రవాదుల దాడులు పరిపాటిగా మారాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
పాకిస్తాన్ లో వేర్పాటువాదు బలోచ్ మిలిటెంట్లు చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలుపై దాడికి దిగారు. హైజాక్ చేశారు. ఆరుగురు భద్రతా సిబ్బందిని దారుణంగా చంపేశారు. అయితే ఈ సంఖ్య 30దాకా ఉండవచ్చని అనధికా సమాచారం. మిలిటెంట్ల 182 మందిని బందీలుగా పట్టుకున్నారు. వీరిలో ఎక్కువమంది భద్రతా సిబ్బందే ఉన్నారు. దాడి సమయంలో జాఫర్ ఎక్స్ ప్రెస్ లో దాదాపు 500 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. కాగా పాకిస్తాన్ భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని 13 మంది మిలిటెంట్లను మట్టుబెట్టాయి. 80 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడాయి. రక్షణ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
సమస్యాత్మక బలోచిస్తాన్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్ కు రైలు వెళ్తుండగా మిలిటెంట్లు దాడికి దిగారు. ఈ రైలు మార్గంలో 17 సొరంగాలు ఉన్నాయి. 8వ సొరంగం దగ్గర మిలిటెంట్లు ట్రాన్ కు పేల్చి జాఫర్ ఎక్స్ ప్రెస్ ను తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత రైలును చుట్టుముట్టి భారీ స్థాయిలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రైలు డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం.
భద్రతా దళాలు వెనక్కి తగ్గకపోతే బందీలందరినీ చంపేస్తామని మిలిటెంట్లు బెదిరించారు. మంగళవారం రాత్రి పాకిస్తాన్ భద్రతా దళాలు రైలు నుండి దాదాపు 80 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. బలూచ్ రాజకీయ ఖైదీలను, జాతీయ ప్రతిఘటన కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని ఉగ్రవాద సంస్థ తన డిమాండ్లలో పేర్కొంది. ప్రతిగా, వారు బందీలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీని కోసం వారు 48 గంటల కాలపరిమితిని నిర్ణయించారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, భద్రతా దళాలు ప్రతీకార చర్యలో 13 మంది ఉగ్రవాదులను హతమార్చాయి.
ఉగ్రవాదులను చుట్టుముట్టడానికి భద్రతా దళాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. భారీ కాల్పులు, వైమానిక దాడులు జరుగుతున్నాయి. సైన్యం గ్రౌండ్ ఆపరేషన్‌ను పూర్తిగా భగ్నం చేశామని, సైన్యాన్ని వెనక్కి తగ్గేలా చేశామని ఉగ్రవాద సంస్థ చెబుతోంది. “మేము జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాము సైన్యం గ్రౌండ్ ఆపరేషన్‌ను ముగించాము. అయితే, పాకిస్తాన్ హెలికాప్టర్లు డ్రోన్‌ల బాంబు దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి” అని BLA నాయకులు అంటున్నారు.
రైల్వే అధికారుల ప్రకారం, రైలులోని 450 మంది ప్రయాణికులు, సిబ్బంది ఇంకా రైలుతో సంబంధాలు లేకుండా పోయారు. ఈ దాడిలో అనేక మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. పాకిస్తాన్ సైన్యం సైనికులు, వైద్యుల బృందాన్ని తీసుకెళ్లే సహాయ రైలును పంపింది. అంబులెన్స్‌లను కూడా పంపించారు, కానీ కొండలు, ముళ్లతో కూడిన భూభాగం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.