పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో అనుకున్న హరి హర వీర మల్లు ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మే 9న థియేటర్లలో సందడి చేయనున్నట్లు సమాచారం. పలు వాయిదాల తర్వాత చివరికి క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. పవన్ బిజీ పొలిటికల్ షెడ్యూల్ కారణంగా షూటింగ్ ఆలస్యం కాగా, మిగిలిన 20 రోజుల పనిని దర్శకుడు జ్యోతి కృష్ణ త్వరగా కంప్లీట్ చేయనున్నాడు.
ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ మరో సినిమా చాలా తక్కువ గ్యాప్‌లో రావడం ఖాయంగా కనిపిస్తోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కుతున్న OG ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు సుజీత్ ఈ సినిమాను పవన్ మాస్ ఫ్యాన్స్‌కి పక్కా ట్రీట్‌గా రూపొందిస్తున్నాడు. హరి హర వీర మల్లు రిలీజ్ అయ్యాక నాలుగు నుంచి ఆరు నెలల్లో OG విడుదలకు సిద్ధమవుతుందని టాక్. దీపావళి లేదా క్రిస్మస్ సీజన్‌ను టార్గెట్ చేస్తూ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.
ఈ రెండు సినిమాల మధ్య గ్యాప్ తక్కువగా ఉండడం పవన్ అభిమానులకు నిజంగా గుడ్ న్యూస్. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు కనీసం ఏడాది గ్యాప్ వస్తే, పవన్ మాత్రం ఆ లెక్కను బ్రేక్ చేసి, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రావడం స్పెషల్. ఒక వైపు పీరియాడిక్ డ్రామా, మరోవైపు స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్.. రెండూ భిన్నమైన జానర్లు కావడంతో బాక్సాఫీస్‌పై పవన్ ప్రభావం ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.