రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మరో 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శాసనసభ్యుల క్రీడా పోటీల ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్… క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన శాసనసభ్యులను, సాంస్కృతిక కార్యక్రమాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారిని అభినందించారు.
మోషన్ రాజు, రఘురామకృష్ణ రాజులకు, కమిటీ సభ్యులకు, క్రీడా శాఖాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేలు క్రికెట్, టెన్నిస్, షటిల్, వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్, టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడల్లో గెలుపొందిన సభ్యులందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు.
పార్టీలకు అతీతంగా, సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. క్రీడా మైదానంలో ఏర్పాట్లు, క్రీడా సామాగ్రి, క్రీడాకారుల సౌకర్యాల కోసం వారు చేసిన కృషి అభినందనీయమన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవాన్ని ఉపయోగించుకుని, ఆయన నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కనీసం 15 ఏళ్లు నిరంతరం కృషి చేయాలని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు అనుభవాన్ని పక్కన పెట్టలేమని, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి రాజకీయ పరిణతి లేదని ఎవరైనా అనుకుంటే వారు పప్పులో కాలేసినట్లే. పవన్ లో ఆ పరిణతి చాలా ఎక్కువ అని పదేళ్ళ ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక సార్లు రుజువు అయింది. ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందలేను అని 2024 ఎన్నికలకు ముందు ఆయన అన్నారంటేనే అందులోనూ ఒక వ్యూహం ఉంది.
ఏపీలో టీడీపీ బలాన్ని ఆ పార్టీ చరిత్రను రికార్డులను పవన్ అంగీకరిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు అర్ధశతాబ్దపు రాజకీయ అనుభవానికి ఆయన ఎంతో విలువ ఇస్తున్నారు. వీటితో పాటు ఏపీ సుదీర్ఘమైన అభివృద్ధిని తాను కట్టుబడి ఉన్నాను తప్ప పదవుల కోసం కాదని ఆయన చెప్పదలచారు.
ఇవన్నీ కలసే పవన్ నోటి వెంట సంచలన రాజకీయ ప్రకటన వచ్చిందని భావించాలి. ఏపీ శాసనసభ బడ్జెట్ సెషన్ ముగింపు సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కల్చరల్ ఈవెంట్ లో పవన్ మాట్లాడారు. సందర్భం కాకపోయినా ఆయన ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఇటీవల కాలంలో జనసేన టీడీపీల మధ్య గ్యాప్ ఒకటి ఏర్పడింది అన్న దాని మీద సోషల్ మీడియాలో సాగుతున్న డైలాగ్ వార్ నిదర్శనం. దానిని ఆయన చెక్ పెడుతూ చేసిన ప్రకటనగానే దీనిని చూడాలని అంటున్నారు. నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టామని పవన్ అనడం వెనక అంతరార్థం ఏమో కానీ తెలుగు తమ్ముళ్ళు భగ్గుమన్నారు. సోషల్ మీడియాలో ఈ రోజుకీ ఆ అగ్గి అలాగే ఉంది. దాంతో పవన్ ఎంతో వ్యూహాత్మకంగా మరో 15 ఏళ్ళు బాబే సీఎం అని ప్రకటించారని అంటున్నారు.
అంతే కాదు బాబు వద్ద తాను ఎంతో నేర్చుకోవాల్సి ఉందని కూడా అన్నారు. బాబు దగ్గర పనిచేసేనుదుకు తాను ఎంతో ఆసక్తిని చూపిస్తున్నాను అని అన్నారు. కేంద్రంలో వరసగా నరేంద్ర మోడీ గెలిచినట్లుగా ఏపీకి బాబు 15 ఏళ్ళ పాటు సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఏపీ గత వైసీపీ ఏలుబడిలో దారుణంగా దెబ్బ తిందని అలాంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలీ అంటే కచ్చితంగా బాబు సీఎం గా ఉండాలని ఆయన అనుభవాన్ని రాష్ట్రం పూర్తి స్థాయిలో వాడుకోవాల్సి ఉందని పవన్ అన్నారు. ఈ విధంగా పవన్ చేసిన ప్రకటనతో జనసేన టీడీపీల మధ్య గ్యాప్ అయితే తగ్గిపోతోంది అని అంటున్నారు.
అంతే కాదు తెలుగు తమ్ముళ్ళు అంతా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారని అంటున్నారు. అదే సమయంలో వైసీపీకి పవన్ వ్యూహాత్మకంగా చేసిన ఈ ప్రకటన షాకింగ్ గానే ఉంటుంది అని అంటున్నారు. కూటమిలో విభేదాలు వచ్చినా లేక వేరుగా పోటీకి దిగినా అపుడు వైసీపీకే చాన్స్ ఉంటుంది. 2014 నుంచి 2019 మధ్యలో అదే జరిగింది. అందుకే మరోసారి అలాంటి సీన్ రిపీట్ కావాలని వైసీపీ కోరుకుంటోంది. దాంతో పవన్ మీ ఆటలు సాగవు, ఎప్పటికీ ఏపీలో కూటమినే అధికారంలో ఉంటుందని చెప్పగలిగారు అని అంటున్నారు. ఇలా పవన్ చేసిన ఒక ప్రకటనతో అన్ని రకాలుగానూ జవాబు చెప్పినట్లు అయింది అని అంటున్నారు. అయితే ఈ ప్రకటన జనసేనకు మాత్రం షాక్ గానే ఉంది అన్నది మరో వైపు వినిపిస్తోంది.