బుడమేరు ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని జలవనరు ల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. సభ్యులు బుడమేరుపై అడిగిన ప్రశ్నలకు మంత్రి రామానాయుడు సుదీర్ఘ, స్పష్టమైన సమాధానం ఇచ్చారు. బుడమేరు సమస్య ఒక విజయవాడ నగరానికే పరిమితం కాదని కొల్లేరు వరకు, అక్కడి నుంచి ఉప్పుటేరు, ఉప్పుటేరు మొదలు నుంచి సముద్రం వరకు సమస్య విస్తరించి ఉంది.
బుడుమేరు వరద సమస్య మూలాలను, తీవ్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని క్యాబినెట్ సమావేశంలో తీవ్రంగా చర్చించి శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక రూపొందించామన్నారు.
ఒక్క జల వనరుల శాఖ మాత్రమే కాకుండా వరద సమస్య పరిష్కారంలో భాగంగా, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలను ఇందులో భాగస్వాములు చేసి ప్రణాళిక కు రూపకల్పన చేశాం.
విజయవాడ నగరంతో పాటు బుడమేరు పరివాహక ప్రాంతంలోని వందల గ్రామాలకు, వేల ఎకరాలకు సమస్య ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఇంత పెద్ద సమస్య పరిష్కారానికి గాను డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కోరుతామన్నారు. బుడమేరు వరద సమస్య పరిష్కారంలో భాగంగా ఆ పనులను నాలుగు భాగాలుగా విభజించుకుని ముందుకెళ్లే విధంగా ప్రణాళికకు రూపకల్పన చేశామన్నారు.
వెలగలేరు రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు, డైవర్షన్ ఛానల్ విస్తరణ, బుడమేరు గట్లు పటిష్ట పరచటం, విజయవాడ పరిసరాల్లో పాత కాలువను పునరుద్ధరించడం, కొల్లేరు చేరిన బుడమేరు వరద నీరు ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి పంపించడం వంటి పనులను ప్రతిపాదిత ప్రణాళికలో ముఖ్యాంశాలుగా చేర్చి ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించామన్నారు.
విజయవాడ పరిధిలోని ప్రస్తుత బుడమేరు విస్తరణ, స్థల సేకరణ చాలా ఖర్చుతో కూడుకున్నది. అనేక శాశ్వత కట్టడాలు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి కాబట్టి నష్టపరిహారం భారీ స్థాయిలో ఉంటుంది. ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది.
ఈ పరిస్థితిని అధిగమించేందుకు బుడమేరు పాతకాలవను విస్తరించి, లోతు చేసినట్లయితే సమస్య తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. పాత కాలువ పరిసరాలన్నీ పొలాలే కనుక భూ సేకరణ కూడా తక్కువ ఖర్చుతో అయిపోతుందని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు.
కొల్లేరు లోని వరద నీటిని సముద్రంలోకి పంపే ఉప్పుటేరు ముఖద్వారం వద్ద ఆకివీడులో ఉన్న రైల్వే బ్రిడ్జి వరద ప్రవాహానికి అడ్డంకిగా తయారైందని అన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖతో కూడా మాట్లాడి ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు.