ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటూ.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గబోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అంతర్జాతీయ పరిణామాలే. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పతనం అవుతున్నాయి. చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావడంతో ఈ పతనం మరింత పెరుగుతోంది. శుక్రవారం నాడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.6 శాతం తగ్గి 63.71 డాలర్లకు చేరగా, అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 0.63 శాతం పడిపోయి 60.45 డాలర్ల దగ్గర నిలిచింది. ఇది శాంపిల్ మాత్రమే. మున్ముందు భారీ పతనం కనిపించబోతోంది.గత వారంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్, WTI) క్రూడ్ సూచీలు 2.5 నుంచి 3 శాతం వరకు నష్టపోయాయి, అంతకుముందు వారం 11 శాతం పతనం నమోదైంది. బ్రెంట్ క్రూడ్ ధర ఒక దశలో 60 డాలర్ల దిగువకు చేరింది కూడా. 2021 ఫిబ్రవరి తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. అటు అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (EIA) ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించింది. అమెరికా విధించిన టారిఫ్‌లు చమురు ధరలపై భారీ ప్రభావం చూపుతాయని హెచ్చరించింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి అనేందుకు ఇది మరో సంకేతం.
2025, 2026లో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంధన డిమాండ్ తగ్గుతుందని EIA అంచనా వేసింది. చైనా, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారు. ఇప్పుడు ఆ దేశం అమెరికా టారిఫ్‌ల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అంటే.. చైనా నుంచి వెళ్లే ఉత్పత్తులను అమెరికాలో కొనేవారి సంఖ్య తగ్గిపోతుంది. దాంతో.. అమెరికా ఎగుమతులు తగ్గుతాయి. దాంతో.. చమురు వాడకం తగ్గిపోతుంది. దాంతో.. ప్రపంచంలో చమురుకి డిమాండ్ తగ్గి, ధర తగ్గుతుంది. ఇలా చైనా మాత్రమే కాదు.. చాలా దేశాలు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి 3 శాతం తగ్గితే, చమురు వాడకం 1 శాతం పడిపోతుంది అని ANZ బ్యాంక్ విశ్లేషకుడు డేనియల్ హీనెస్ అన్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత తగ్గుతాయి?: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పతనం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలపై సానుకూల ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ లీటర్ సగటు ధర రూ. 110-112, డీజిల్ రూ.98-100 మధ్య ఉంది. తెలంగాణలో పెట్రోల్ రూ. 108-110, డీజిల్ రూ. 96-98 మధ్య ఉంది. చమురు ధరలు మరింత తగ్గుతాయన్న అంచనాలతో, మన రెండు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.3-5, డీజిల్ రూ.2-4 వరకు తగ్గే అవకాశం ఉంది.
ఎప్పటికి తగ్గే అవకాశం?: ఈ ధరల తగ్గుదల రాబోయే 2-3 వారాల్లో అమలులోకి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే అంతర్జాతీయ చమురు ధరల మార్పులు భారతదేశంలోని రిటైల్ ధరలపై కనిపించడానికి సాధారణంగా కొంత సమయం పడుతుంది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు, వ్యాట్‌లలో ఎలాంటి మార్పులు చేస్తాయన్న దానిపై కూడా ఈ తగ్గుదల ఆధారపడి ఉంటుంది. నిపుణుల అంచనాల ప్రకారం, 2025 మే నాటికి చమురు ధరల్లో స్థిరత్వం రావచ్చు. ఇది రాష్ట్రాల్లో ఇంధన ధరలను మరింత తగ్గించే అవకాశం ఉంది.ఈ ధరల తగ్గుదల సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే అంశం అయినప్పటికీ, టారిఫ్ వివాదాలు, ఆర్థిక అస్థిరతలు మార్కెట్‌ను ఇంకా అనిశ్చితంగా ఉంచుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ పరిస్థితి దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు కేంద్రం కూడా.. అంతర్జాతీయంగా చమురు ధరలు దగ్గితే.. దేశంలో కూడా తగ్గించేలా చమురు కంపెనీలపై ఒత్తిడి తేవాలి. కానీ కేంద్రం అలా చెయ్యకుండా.. ధరలు తగ్గించకుండా.. ప్రజలపై భారాన్ని కంటిన్యూ చేస్తోంది. దీనికి తోడు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రజలపై భారీగా పన్నులు వేస్తూ.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గనివ్వకుండా చేస్తున్నాయి. ప్రతిపక్షాలు దీనిపై గళం ఎత్తకపోవడం, ఆందోళనలేవీ చెయ్యకుండా సైలెంటుగా ఉండటం కూడా ధరలు భారీగా పెరగడానికి కారణం అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. భవిష్యత్తులో చమురు ధరలు మరింతగా పతనమయ్యే అవకాశం ఉందని నిపుణులు బలంగా అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక శక్తులైన చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావడమే. రెండు దేశాలు సుంకాలు, ప్రతిసుంకాలు విధించుకుంటున్న తరుణంలో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. బంగారం ధర భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో చమురు ధరలు కూడా రికార్డు కనిష్టాలకు పతనం అవుతున్నాయి.