దాదాపు 8 కోట్ల మంది ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చేలా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ విత్ డ్రాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు రద్దు చేసిన చెక్కును (cancelled cheque) అప్‌లోడ్ చేయాల్సిన అవసరాన్ని తొలగించింది. బ్యాంకు ఖాతాల కోసం యజమాని ధృవీకరణ అవసరం లేకుండా చేసింది. క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడం, ఉద్యోగులు, యజమానులకు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈపీఎఫ్ఓ కీలక మార్పులు చేసింది.ఇందుకు సంబంధించి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ దశలను తొలగించడం క్లెయిమ్ ప్రక్రియను గణనీయంగా క్రమబద్ధీకరిస్తుందని, క్లెయిమ్ తిరస్కరణలకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుందని తెలిపింది.ప్రస్తుతం 7.74 కోట్ల మంది ఉద్యోగులు ఈపీఎఫ్ చందాదారులుగా ఉన్నారు. వీరిలో 4.83 కోట్ల మంది ఇప్పటికే బ్యాంకు ఖాతాను UAN తో సీడ్ చేశారు. సీడింగ్ కోసం రోజుకు 36 వేల అభ్యర్థనలు వస్తున్నాయి. ధృవీకరణ పూర్తి చేయడానికి బ్యాంకులకు సగటున మూడు రోజులు పడుతుంది. అయితే యజమాని ఆమోదాల ఆలస్యం కారణంగా అదనంగా 13 రోజులు పడుతోంది. ఫలితంగా పెండింగ్ అప్రోవల్స్ పెరుగుతున్నాయి.
ఆన్‌లైన్ విత్ డ్రా క్లెయిమ్‌లను ఫైల్ చేసేటప్పుడు చెక్కు లీఫ్ ఫోటో లేదా బ్యాంకు పాస్‌బుక్ ఫోటో కాపీని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.బ్యాంకు ఖాతా వివరాలను ధృవీకరించడానికి యజమాని ఆమోదం ఇప్పుడు అవసరం లేదు. దీన్ని పూర్తిగా తొలగించారు.ఇప్పటికే లింక్ చేసిన బ్యాంకు ఖాతాను మార్చుకోవచ్చు. కొత్త బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను నమోదు చేసేందుకు ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణ ద్వారా ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది.2024 మే 28 న కేవైసీ అప్‌డేట్ చేసిన కొందరు సభ్యుల కోసం పైలట్ ప్రాజెక్ట్‌గా ఇది ప్రారంభమైంది. ఈ మార్పులు ఇప్పటికే 1.7 కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారులకు ప్రయోజనం చేకూర్చాయి. పైలట్ ప్రాజెక్ట విజయవంతం కావడంతో ఈపీఎఫ్ఓ ఇప్పుడు సభ్యులదంరికీ ఈ మార్పులను వర్తింపజేసింది.బ్యాంకు ధృవీకరణ కోసం యజమాని ఆమోదాలు పెండింగ్‌లో ఉన్న 14.95 లక్షల మంది ఉద్యోగులకు ఈ చర్య తక్షణమే ప్రయోజనం చేకూర్చుతుంది. ఈపీఎఫ్ సభ్యులు తమ నిధులను వేగంగా పొందే వీలుంటుంది.