హైదరాబాద్ ఫార్మా రంగంలో మంచి వృద్ధి నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ సాధించిన కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయి. అయితే ఆయా కంపెనీలు ఫార్మా రంగంలో మరింత అభివృద్ధి చెందడంపై కాకుండా.. రియల్ ఎస్టేట్ పై ఆశలు పెంచుకుంటున్నాయి. పెద్ద ఎత్తున భూములు కొని వ్యాపారాలు చేస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు కట్టి.. లగ్జరీ అపార్టుమెంట్లు నిర్మించి.. ఐటీ టవర్లు కట్టేస్తున్నాయి. అసలు ఫార్మాకు రియల్ ఎస్టేట్‌కు సంబంధం లేకపోయినా ఈ బడా కంపెనీలు మాత్రం తగ్గడం లేదు.ఎంఎస్ఎన్ ఫార్మా హైదరాబాద్లోని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఒకటి. ఈ కంపెనీ కొత్తగా పేపర్లలో పూర్తి ప్రకటనలతో రియల్ ఎస్టేట్ సామ్రాజ్య విస్తరణను ప్రకటించింది. నియోపొలిస్ లో బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నట్లుగా పేపర్ ప్రకటన ఇచ్చింది. ఇది అల్ట్రా లగ్డరీ అపార్టుమెంట్లు..
అరబిందో ఫార్మా కూడా ఇటీవల రియల్ ఎస్టేట్ లోకి అడుగు పెట్టింది. అరబిందో రియాలిటీ పేరుతో లగ్జరీ అపార్టుమెంట్లు ఐటీ టవర్లు నిర్మిస్తోంది. అయితే అరబిందో పేరు వాడటం… అరబిందో వారసుడు శరత్ చంద్రారెడ్డి కేసుల్లో ఇరుక్కోవడంతో వాటాదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అరబిందో రియాలిటీ పేరును ఔరో రియాలిటీ అని మార్చి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.ఇక మరో ఫార్మా దిగ్గజం హెటెరో తక్కువేం తినలేదు. మాదాపూర్ లో అతి పెద్ద ఐటీ టవర్స్ కట్టి.. అంతర్జాతీయ కంపెనీల గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు అద్దెకు ఇస్తున్నారు. ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే హౌసింగ్ ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో తెరపైకి రాలేదు.