సమగ్ర ఆర్థిక వాణిజ్య భాగస్వామ్య ఒప్పందాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)… చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ ఫాంట్ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అయిదు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చిన చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీ(PM Narendra Modi)తో భేటీ అయ్యారు. రక్షణ, ఆరోగ్యం, వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, రైల్వేలు, అంతరిక్షం సహా వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని, ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సమావేశంలో భారత్, చిలీ దేశాలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) మాట్లాడుతూ… లాటిన్ అమెరికాలో చిలీ తమకు అత్యంత కీలక భాగస్వా మ్య దేశమని పేర్కొన్నారు. చిలీతో దశాబ్దాలుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకుంటామని వెల్లడించారు. బోరిక్ ఫాంట్ తో భేటీ అనంతరం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. భౌగోళికంగా దూరంగా ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య ఎన్నో సారూప్యతలున్నాయని గుర్తుచేశారు.
డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, అంతరిక్షం వంటి రంగాల్లో తమ అనుభవాన్ని చిలీలో పంచుకోడానికి సిద్ధంగా ఉన్నామని మోదీ వెల్లడించారు. ఆయుర్వేదం, సంప్రదాయ మెడిసిన్, వ్యవసాయ ఉత్పత్తుల సహకారంపై ఒప్పందాలు ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలితోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల విషయంలో ఇండియా, చిలీ ఏకాభిప్రాయంతో ఉన్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వీసా జారీ ప్రక్రియను సులభతరంగా మార్చుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చిలీ అధ్యక్షులు గాబ్రియేల్ మాట్లాడుతూ… భారత్ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య బంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందన్నారు. సాంస్కృతిక సహకారం అందించుకుంటామన్నారు. ‘షూట్ ఇన్ చిలీ’ ప్రోగ్రాం ద్వారా భారత చిత్ర పరిశ్రమతో కలిసి పని చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంటార్కిటికాలో పరిశోధనలకు సహకారం సహా ఇరు దేశాలు నాలుగు కీలక పత్రాలపై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది.భారతదేశ పర్యటనకు తొలిసారి వచ్చిన చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విందు ఇచ్చారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముర్ము మాట్లాడుతూ… ఇటీవల కాలంలో పలు భారతీయ కంపెనీలు చిలీలో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని దేశ అధ్యక్ష పదవిని చేపట్టిన గాబ్రియేల్ జీవిత ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆమె చెప్పారు. అంతకుముందు చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. పర్యటనలో భాగంగా ఆయన ఆగ్రా, ముంబయి, బెంగళూరును సందర్శిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. గాబ్రియేల్ వెంట ఆ దేశానికి చెందిన మంత్రులు, పార్లమెంటు సభ్యులు, సీనియర్ అధికారులతో కూడిన అత్యున్నత స్థాయి బృందం ఢిల్లీ చేరుకుంది.