– అది వైకాపా దుష్ప్రచారం మాత్రమే
45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మించి తీరుతాం – శాసనమండలిలో మంత్రి నిమ్మల పునరుద్ఘాటన
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే చేస్తున్నారంటూ వైకాపా నేతలు చేస్తున్న విష ప్రచారానికి, ప్రజల్లో కల్పిస్తున్న గందరగోళానికి జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం నాటి శాసనమండలి సమావేశంలో ఘాటుగా సమాధానం ఇచ్చారు. వైకాపా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు సంబంధించి వివరాలు వెల్లడించాలని కోరినప్పుడు మంత్రి పై విధంగా స్పందించారు.
2019 ఫిబ్రవరి 18న 55 వేల కోట్లకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో చంద్రబాబు ద్వారానే పోలవరం వ్యయం ఆమోదించారు.
2014 -19 మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఫేజ్ -1, ఫేజ్- 2 అని గాని, 41.15 మీటర్లు , 45.72 మీటర్లు అని గాని లేవన్నారు. అలాంటిదేమైనా ఉంటే చూపించాలని సవాల్ చేశారు. ఎత్తుకు సంబంధించి ఫేజ్-1, ఫేజ్-2 లు తెచ్చింది కూడా 2019 తర్వాత వైకాపా ప్రభుత్వమే నని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు 2020లో జగన్ పోలవరం కుడికాలువ నీటి సామర్థ్యాన్ని 17,560 నుండి 11650కు, ఎడమ కాలువ నీటి సామర్థ్యాన్ని 17,500 నుండి 8122 క్యూసెక్కులకు తగ్గించి ఉత్తరాంధ్ర రాయలసీమకు జగన్ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని విమర్శించారు
అంతేకాకుండా 2019 -2024 మధ్య, వైకాపా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రంతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల లేఖలను, జీవో ప్రతులను సభ ముందుంచి వైకాపా ఎమ్మెల్సీల అబద్ధపు ప్రచారాన్ని తిప్పి కొట్టారు. నోరు ఉంది కదా అని, ఏది పడితే అది మాట్లాడటం, అవినీతి పత్రిక ఉంది కదా అని అబద్ధపు రాతలు రాయడం, ఎంత మాత్రం మంచిది కాదన్నారు. గత సమావేశ కాలంలో కూడా పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి స్పష్టంగా సమాధానం చెప్పానని, వాస్తవాలు వివరించానని అయినా అవే అబద్దాలను పదేపదే చెప్పడం, ప్రజలను ఏ మార్చాలని చూడటం వారి మూర్ఖపు వైఖరికి నిదర్శనం అన్నారు.2019 నాటికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేసిందని చెప్పారు. 2019-24 మధ్యకాలంలో వైకాపా ప్రభుత్వం చేసింది కేవలం రెండు శాతం మాత్రమేనని, ఈ వాస్తవాలను గణాంకాలను, నేను చెప్పడం లేదని రికార్డులే చెబుతున్నాయని మంత్రి నిమ్మల వివరించారు.
పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కు సంబంధించి సుమారు 90 వేల కుటుంబాలు ఉండగా 12,000 కుటుంబాలకు పునరావాసం కల్పించామని, అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వంలో వారికి ఆనాడు 2017 లో 830 కోట్లకు పైగా పరిహారం అందించామని, మరలా నేడు 990 కోట్లు ఇవ్వడం జరిగిందని మంత్రి చెప్పారు. నిర్వాసితులకు పైసా కూడా ఖర్చు పెట్టని ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది వైకాపా మాత్రమేనని అన్నారు.
నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలు చేయాలనేది మా అధినాయకుడైన చంద్రబాబు లక్ష్యమని మంత్రి రామానాయుడు మరోసారి పునరుద్ఘాటించారు.నదుల అనుసంధానానికి ఆధార భూతం పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడమేనని అన్నారు. అందువల్ల పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ప్రసక్తే లేదన్నారు. నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు పూర్తిస్థాయిలో నీరు అందిస్తామని మంత్రి రామానాయుడు మరోసారి స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు కొంతవరకైనా పూర్తి చేసి పుష్కర, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల ద్వారా , ఈ ఏడాదిలోనే ఉత్తరాంధ్రకు నీరు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ కు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి రామానాయుడు మండలిలో వివరించారు. దానిపై 1600 కోట్లు మంజూరు చేసి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించామన్నారు. 2025 జూన్ కల్లా పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి జూలై నాటికి ఉత్తరాంధ్ర కు గోదావరి వరద జలాలు తీసుకెళ్లే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.