• ఫేజ్-1లో నిర్వాసితులకు 2026 జూన్ కు ఇళ్ళు పూర్తి చేస్తాం.
• ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి ఫేజ్-2 నిర్వాసితులకు కూడా ఇళ్ళు నిర్మిస్తాం.
– శాసనమండలిలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గత అయిదేళ్ళలో ఒక్క రూపాయి నష్టపరిహారం గానీ, కాలనీల నిర్మాణానికి అరబస్తా సిమెంట్ పనులు కూడా చేయలేదని దుయ్యబట్టారు మంత్రి నిమ్మల రామానాయుడు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారాయన.గత ఐదేళ్లు గోదావరికి వరదలు వచ్చినప్పుడు కనీసం తాగడానికి మంచి నీళ్ళ ప్యాకెట్లు కూడా ఇవ్వలేదని, ఒక్క నాయకుడు కూడా వచ్చి పరామర్శించలేదని,ఇలా నిర్వాసితులను పట్టించుకోకపోవడంతో మమ్మల్ని తెలంగాణలో కలిపేయమని రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు అని అన్నారు.
నాడు 2019 ఎన్నికల ముందు నిర్వాసితులకు అడుగడుగునా వాగ్దానాలు చేసిన జగన్మోహాన్ రెడ్డి, 2019-24లో అధికారంలో ఉండి కూడా నిర్వాసితుల కాలనీల్లో ఒక్క అరబస్తా సిమెంట్ పని కూడా చేయలేదు,ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అని దుయ్యబట్టారు. 2019లో చంద్రబాబు నాయుడు హాయాంలో పూర్తైన కాలనీలు తప్ప, ఒక్క కాలనీలో, ఒక్క ఇల్లు కూడా జగన్మోహాన్ రెడ్డి పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో 5 మండలాలు, ఏలూరు జిల్లాలోని 8 మండలాల్లోని 222 రెవిన్యూ గ్రామాలకు చెందిన 373 శివారు గ్రామాల్లో 96,660 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయని గుర్తించడం జరిగింది.ఇందులో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలో 8మండలాల్లోని 9 రెవిన్యూ గ్రామాలు, 172 శివారు గ్రామాల్లో 38,060 నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయని, ఇంక 41.15 మీటర్ల నుండి 45.72 మీటర్ల కాంటూరు వరకు 6మండలాల్లోని 132 రెవిన్యూ గ్రామాలకు చెందిన 201 శివారు గ్రామాల్లోని మొత్తం 58,600 నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇందులో 41.15 మీటర్ల కాంటూరు లో భాగంగా 38,060 నిర్వాసిత కుటుంబాల్లో ఇప్పటి వరకు 19794 కుటుంబాలకు 1203 కోట్ల రూపాయల పరిహారాన్ని అందించడం జరిగింది.ఇంకా 18,266 నిర్వాసిత కుటుంబాలకు 1340.47 కోట్ల రూపాయాలన చెల్లించాల్సి ఉంది. ఇందులో 9212 నిర్వాసిత గిరిజన కుటుంబాలకు 575.11 కోట్లను, 10,582 గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలకు 627.89 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. ఇంకా 9128 గిరిజన నిర్వాసిత కుటుంబాలకు 573.32 కోట్ల రూపాయలను, 9,138 గిరిజనేత నిర్వాసితులకు 767.15 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది.
ఇలా ఫేజ్-1లో 38,060 నిర్వాసిత కుటుంబాల్లో 12,797 నిర్వాసిత కుటుంబాలను ఇప్పటి వరకు తరలించడం జరిగింది.ఇంకా 25,263 కుటుంబాలను తరలించాల్సి ఉందన్నారు. నిర్వాసితులను తరలించడానికి కావలసిన కాలనీల నిర్మాణ పనులకు సంబందించి, మొదట్లో సర్వే చేసినప్పుడు 20,946 కుటుంబాలను గుర్తించగా, ఆ తరువాత కొత్తగా మరలా రాడార్ సర్వే చేసినప్పుడు అదనంగా 17,117 కుటుంబాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఇందులో 20946 కుటుంబాలకు గానూ, 75 కాలనీలను గుర్తించి నిర్మాణ పనులు మొదలుపెట్టడం జరిగింది.ఇందులో 26 కాలనీలు పూర్తి చేశామన్నారు.ఇంకా 49 కాలనీలు నిర్మాణ దశలో ఉన్నాయని, కొత్తగా రాడార్ సర్వే చేయడం ద్వారా వచ్చిన 17,117 కుటుంబాలు కూడా 49 గ్రామాల్లో వస్తున్నాయని తెలిపారు. ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి,వారికి మూడు ఆప్షన్స్ ఇస్తున్నాం అని, వాటిలో మొదటిది వారే స్వతంగా ఇళ్ళు నిర్మించుకోవడం,రెండోది ప్రభుత్వం నిర్మించే ఇళ్ళను తీసుకోవడం, మూడోది ఇంటికి,స్ధలానికి మొత్తానికి వన్ టైం సెటిల్మెంట్ చేసుకునేలా, ఇలా మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇలా గ్రామసభలు పెట్టి నిర్వాసితుల నుండి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుందని, దీనికి కూడా నిర్ణీత గడువు పెట్టుకుని, మార్చి చివరి వరకు గ్రామ సభలు పూర్తి చేయాలని, ఏప్రియల్ నెలాఖరు లోపుగా నిర్వాసితులు కోరుకున్న విధంగా ఆర్అండ్ఆర్ కు సంబందించిన కాలనీలు గుర్తించాలన్నారు. తరువాత 90 రోజుల్లోనే అనగా ఆగష్టు లోపు భూసేకరణ పూర్తి చేయాలని నిర్ణీత గడువుపెట్టుకుని, నిర్వాసితులకు సంబందించి 75 కాలనీల్లో మిగిలిన పనులు సైతం పూర్తి చేసేలా,కొత్తగా టెండర్లు పిలిచి, పనులు వేగవంతం చేయాలని నిర్ణయించామని తెలిపారు.కొత్తగా గుర్తించిన నిర్వాసిత కాలనీలను సైతం 2026 జూన్ కల్లా ఈ కాలనీలు పూర్తి చేయడం ద్వారా నిర్వాసితులందరినీ కూడా ఆయా కాలనీలకు తరలించడానికి యాక్షన్ ప్లాన్ తో పని చేస్తున్నామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ప్రాజెక్టు కోసం తమ విలువైన భూములు, ఆస్ధులు, ఇళ్ళు త్యాగం చేసిన నిర్వాసితుల క్షేమం కూడా అంతే ముఖ్యమని అందుకే నిర్వాసితులకు ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, సమప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.గత వైసిపి ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసుకుంటూ, కూటమి ప్రభుత్వం 41.15 మీటర్లకు, ఫేజ్-1 కింద 2026 జూన్ నాటికి ఆర్అండ్ఆర్ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇంక ఫేజ్-2లో 45.72 మీటర్లకు సంబందించిన ఆర్అండ్ఆర్ కు సంబందించిన అంచనాలను కూడా సిద్దం చేసి, కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి,రెండో ఫేజ్ లో రావలసిన ఆర్అండ్ఆర్ నిధులను కూడా సాధించి, ప్రాజెక్టును 45.72 మీటర్లకు పూర్తి చేస్తామని తద్వారా నిర్వాసితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
2019 ఎన్నికల ముందు వరకు పోలవరం ప్రాజెక్టులో ఫేజ్-1, ఫేజ్-2 అని గానీ, 41.15 మీటర్లు, 45.72 మీటర్లు అనిగానీ ఎక్కడా ప్రస్తావించలేదని, కేవలం గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాతే 41.15 మీటర్లు, 45.72 మీటర్లు, ఫేజ్-1, ఫేజ్-2 అని తీసుకొచ్చారని స్పష్టం చేశారు. నాడు తెలుగు దేశం ప్రభుత్వం, 2019 ఎన్నికలకు మందు ఫిబ్రవరిలో కూడా కేంద్రప్రభుత్వం నుండి 55వేల కోట్లకు అనుమతులు తెచ్చుకోవడం జరిగిందని తెలిపారు. కేవలం గత ప్రభుత్వంలో జగన్ సారధ్యంలోనే 2022లోనే మొట్టమొదటి సారిగా ఫేజ్-1, అని, 41.15 మీటర్లు అని తీసుకొచ్చారనే విషయం వైసిపి సభ్యులు గుర్తించాలని సూచించారు.