2026 చివరి కల్లా పోలవరం ముంపు బాధితులకు పునరావాసం పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పరిహారం చెల్లింపు విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పోలవరంలో పర్యటిస్తున్న చంద్రబాబు ముంపు బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పోలవరం కోసం త్యాగాలు చేసి ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చారని, వారికి అన్యాయం జరగనివ్వమన్నారు.
2014-19లో రూ.4,311కోట్లను పోలవరం ముంపు బాధితులకు చెల్లించామని చెప్పారు. తర్వాత ఐదేళ్లలో ప్రభుత్వం బాధితుల్ని పట్టించుకోలేదని, వారి గురించి ఆలోచించలేదని ఆరోపించారు.2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉండే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తే తప్ప పోలవరం నిర్మాణం సాధ్యం కాదని ఒప్పించి, వాటిని ఏపీకి తీసుకొచ్చామన్నారు. వీలైనంత వరకు న్యాయం చేయాలని ప్రయత్నించామని చెప్పారు. ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చాక మరో రూ.828 కోట్లను బాధితులకు జమ చేశామన్నారు.గత ఐదేళ్లలో ఒక్క పైసా ఇచ్చారా అని చంద్రబాబు ప్రశ్నించారు. వరదల్లో కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా టీడీపీ ముంపు బాధితుల్ని ఆదుకుందని చెప్పారు. పోలవరంపై రేపు వచ్చి మళ్లీ అబద్దాలు చెబుతారనివాటిని నమ్మొద్దన్నారు.
పోలవరం ముంపు బాధితులకు ఆదుకోకుండా ఓ రకంగా అన్యాయం చేశారని, ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును మరోరకంగా నష్టం చేశారని ఆరోపించారు. పోలవరం 2020 నాటికి పూర్తయ్యేదని, ఇప్పుడు అదంతా పూర్తిగా దెబ్బతిందని, ఖర్చులు బాగా పెరిగాయని, రూ.400కోట్లతో డయాఫ్రం వాల్ కడితే అది కొట్టుకుపోయి, కొత్త వాల్ కోసం రూ.990కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టులో గత ఐదేళ్లలో ప్రజలు డబ్బులు దుర్వినియోగం అయ్యాయని చెప్పారు. ఒక్క పైసా ఖర్చు చేసినా అది ప్రజలకు చెందాల్సి ఉందని, దానిని దుర్వినియోగం చేయకూడదన్నారు.
పోలవరం ప్రాజెక్టు వద్దకు ఐదేళ్లలో జగన్ ఎప్పుడైనా వచ్చారా అని ప్రశ్నించారు. సోమవారం పోలవరం చేసుకుని, ప్రాజెక్టు పూర్తి కావాలనుకుని 33 సార్లు వచ్చినట్టు గుర్తు చేశారు. పునరావాసం, ఆర్ అండ్ ఆర్‌కు ప్రాధాన్యత ఇచ్చామన్నారు.ముంపు బాధితుల కోసం నిర్మిసక్తున్న 49 పునరావాసాల కేంద్రాలు 2028కు పూర్తవుతాయని, ఇళ్ల నిర్మాణం మధ్యలో ఆగిపోయాయని, 17,717 పిడిఎఫ్‌లు ఉన్నాయని వాటన్నింటిని త్వరగా పూర్తి చేస్తామన్నారు.
మంపు బాధితుల ఇబ్బందులు గుర్తించామని, అసలైన బాధితుల్ని గుర్తించి, మిస్ అయిన వారిని గుర్తించాలని, మోసాలు చేసే వారిపై అప్రమత్తంగా ఉండాలని, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సక్రమంగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వ నిధుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రాజెక్టుకు చెడ్డ పేరు రాకుండా పరిహారం చెల్లించాలని పేర్లు గల్లంతైన వారిని గుర్తించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. పునరావాస కార్యక్రమాలకు మళ్లీ టెండర్లు పిలిచినట్టు వివరించారు. వాటికి ధరల పెరుగుదల వల్ల రూ.500కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు.హైడల్ ప్రాజక్ట్ నిర్మాణంలో జాప్యం వల్ల రూ.2700కోట్లు నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాజెక్టుకు సహకరించిన వారికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు గురువారం పోలవరం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు కు రాష్ట్రమంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.కూటమి ప్రభుత్వంలో పోలవరం నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. అధికారం చేపట్టిన 9 నెలల కాలంలోనే సీఎం మూడోసారి పోలవరానికి(polavaram project) వెళ్తున్నారంటనే ప్రాజెక్టుకు ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టమవుతోంది. పునరావాసం, పరిహారం సహా పలు అంశాలపై నేడు సీఎం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఉదయం 10 గంటల 55 నిమిషాలకు పోలవరం వ్యూ పాయింట్‌కు వెళ్లనున్న సీఎం, మధ్యాహ్నం 3 గంటల వరకు పరిశీలన జరపనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.ఏపీ జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు పనులను గడువులోగా పూర్తి చేసే కృతనిశ్చయంతో ఉన్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా ముందుకువెళ్తోంది. గతంలో సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని పోలవరం పనులను పరుగులు పెట్టించిన సీఎం, మరోసారి అదే వరవడి కొనసాగిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 16న రెండోసారి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించగా, ఈ ఏడాది జనవరి 18న డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 389 ప్రైమరీ, సెకండరీ ప్యానల్స్ నిర్మించాల్సి ఉండగా, ఇప్పటికి 28 ప్రైమరీ ప్యానెల్స్ నిర్మాణం పూర్తి చేశారు.
వర్షాకాలంలో పనులు ఆపకుండా ఎగువ కాఫర్ డ్యాంను ఆనుకుని సమాంతరంగా డ్యాం నిర్మిస్తున్నారు. వరదల అనంతరం ECRF డ్యాంకు అనుసంధానంగా మట్టి, రాళ్లతో జరగాల్సిన నిర్మాణ పనులు చేపట్టనున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేసేలా అధికారులను సీఎం సన్నద్ధం చేయనున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఆయన, జగన్ నిర్వాకం వల్ల కొత్తగా 990 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి వస్తోందన్నారు. సీఎం కేంద్రాన్ని ఒప్పించి 12,157 కోట్ల రూపాయల నిధులు సాధించారని గుర్తు చేశారు.పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు కూటమి సర్కారు 900 కోట్లకు పైగా పరిహారం చెల్లించి, తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకుంది. పునరావాస కాలనీలను నిర్మించే గుత్తేదారులకూ 216 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో కాలనీల నిర్మాణ పనులు, 45.72 కాంటూరు పరిధిలోని నిర్వాసితుల పరిహారం వంటి అంశాలపై సీఎం ప్రకటనలు చేసే అవకాశం ఉంది. 2017 నిర్దేశిత సమయం తర్వాత 18 ఏళ్లు నిండిన వారికీ పరిహారం ఇవ్వాలన్న నిర్వాసితుల అభ్యర్థనలపైనా సీఎం ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
“జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పేపర్ మీద 2 శాతం పనులు చూపించారు. కానీ 20 నుంచి 30 శాతం వెనక్కి నెట్టి, విధ్వంసం చేశారు. ఇటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటన చేశారు. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో దీన్నిబట్టే తెలుస్తోంది”. – రామానాయుడు, జలవనరుల శాఖ మంత్రి..