పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. సీఎం చంద్రబాబు గత నెల 27న పర్యటించి వెళ్ళాక ప్రాజెక్టు పనుల్లో వేగవంతంగా పనులు మొదలయ్యాయి. ప్రాజెక్ట్‌లో కీలకమైన గ్యాప్-1 రాక్-ఫిల్ డ్యామ్ పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీ పీ ఏ), మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అధికారులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పూజాలు నిర్వహించారు. గ్యాప్-1 రాక్‌ఫిల్ డ్యామ్ ను సుమారు 25 మీటర్ల ఎత్తుతో 540 మీటర్ల పొడవున నిర్మిస్తారు.
ఈ సందర్భంగా జలవనరుల శాఖ, పీపీఏ అధికారులు, ఎంఏఐఎల్ ప్రతినిధులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నిర్దేశాల మేరకు నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళిక బద్ధంగా పనులు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేసి ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. పూజా కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు సీఈ కే నరసింహమూర్తి, ఎస్ఈ రెడ్డి రామచంద్రరావు, ఈఈ కే బాలకృష్ణ, పీపీఏసీఈ రమేష్ కుమార్, ఎంఈఐఎల్ జాయింట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగర, జీ ఎం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.