వాటికన్ నగరం ఈ ఉదయం విషాదంలో మునిగిపోయింది. ప్రపంచ కేథలిక్ చర్చికి తలమానికంగా ఉన్న పోప్ ఫ్రాన్సిస్ (88) సోమవారం ఉదయం తన నివాసమైన కాసా సాంటా మార్టాలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా పోప్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. డబుల్ న్యుమోనియా, శ్వాస సంబంధిత సమస్యలు, కిడ్నీ ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ నెల ప్రారంభంలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన మళ్లీ ఆరోగ్యంగా తిరిగొస్తారని భావించారు.
అయితే, ఆరోగ్యం మరింత బలహీనపడటంతో సోమవారం ఉదయం తుది శ్వాస విడిచినట్టు వాటికన్ అధికార వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. పోప్‌గా పదవి చేపట్టే ముందు జార్జ్ మరియో బెర్గొగ్లియోగా గుర్తింపు పొందిన ఆయన, అర్జెంటీనాలో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి పోప్ అయిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. సామాజిక సమస్యలపై, నిరుపేదల హక్కులపై గళమెత్తిన మత గురువిగా ఆయన పేరు సంపాదించారు.
అనేక సందర్భాల్లో వివిధ మతాల మధ్య ఐక్యతకు పిలుపునిచ్చారు. “ప్రేమ, మానవత్వం మతాలను మించి ఉంటాయి” అనే సందేశంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేశారు. తన చివరి రోజు కూడా ప్రజలతో గడిపారు. ఈస్టర్ పండుగ సందర్భంగా సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగిన ప్రార్థన సభలో వేలాదిమంది భక్తులకు ప్రత్యక్షంగా సందేశం ఇచ్చారు. అనారోగ్యం కారణంగా చాలా రోజుల తర్వాత బయట కనిపించిన ఆయనను చూసి భక్తులు ఉద్వేగానికి లోనయ్యారు.
కానీ అది ఆయన చివరి సందేశంగా మిగిలిపోవడం విషాదాన్ని పెంచింది. మానవతా విలువల్ని తన జీవిత మార్గంగా తీసుకుని పనిచేసిన పోప్ మరణం ప్రపంచానికి తీరని లోటుగా మిగిలింది. పోప్ ఫ్రాన్సిస్ మృతిపై ప్రపంచ నలుమూలల నుంచి సంతాపం వెల్లువెత్తుతోంది. రాజకీయ నాయకులు, మతపెద్దలు, సామాన్యులు అందరూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు.
అర్జెంటీనాలో జార్జ్ మారియో బెర్గోగ్లియోగా జన్మించిన ఫ్రాన్సిస్.. అమెరికా నుండి వచ్చిన మొదటి పోప్ కావడం విశేషం. ఆయన మార్చి 13, 2013న 76 సంవత్సరాల వయసులో పోప్‌గా ఎన్నికయ్యారు. పేదల పట్ల శ్రద్ధకు పేరుగాంచిన అర్జెంటీనా మతాధికారిని బయటి వ్యక్తిగా చూసిన అనేక మంది చర్చి పరిశీలకులను ఆయన ఆశ్చర్యపరిచారు. పిల్లల లైంగిక వేధింపుల కుంభకోణంపై దాడికి గురైన, వాటికన్ బ్యూరోక్రసీలో అంతర్గత కలహాలతో నలిగిపోయిన చర్చికి ఆయన నేతృత్వం వహించారు. 12 సంవత్సరాలకు పైగా పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ బ్యూరోక్రసీని పునర్వ్యవస్థీకరించారు. అలాగే నాలుగు ప్రధాన బోధనా పత్రాలను రాశారు. 65 కంటే ఎక్కువ దేశాలకు 47 విదేశీ పర్యటనలు చేశారు. అలాగే 900కి పైగా సెయింట్స్ ను తయారు చేశారు.
పోప్ భౌతిక కాయానికి క్యాథలిక్ సంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ తంతు తొమ్మిది రోజులపాటు కొనసాగనుంది. తొలుత ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం సెయింట్ పీటర్ బెసిలికాలో ఉంచనున్నారు. తొలి రెండు-మూడు రోజుల్లోనే వివిధ దేశాలకు చెందిన మత పెద్దలు, అధికారులు, కార్డినల్స్, దేశాధినేతలు పోప్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తారు. మూడు శవపేటికల్లో పోప్ భౌతిక కాయాన్ని ఉంచి ఖననం చేస్తారు.
పోప్ ఫ్రాన్సిస్ భారత్‌ను సందర్శించకుండానే కన్నుమూయడం భారతీయ క్యాథలిక్‌లను నిరాశపరిచింది. భారత్ నుంచి తాజాగా కార్డినల్‌గా ఎన్నికైన కేరళ మత బోధకుడు జార్జ్ జేకబ్ కూవకడ్ 2025లో పోప్ ఫ్రాన్సిస్ భారత్ వస్తారని పేర్కొన్నారు. పోప్ విదేశీ పర్యటనలను పర్యవేక్షించేది ఆయనే. కేరళలోని సైరో మలబార్ చర్చిలో నెలకొన్న ఓ వివాదాన్ని కూడా ఆయన పరిష్కరించలేకపోయారు. అయితే పోప్ ఫ్రాన్సిస్ తన పదవీకాలంలో ముగ్గురు భారతీయులకు పునీత హోదా కల్పించారు. 2014లో ఫాదర్ కురియాకోస్, సిస్టర్ యూఫ్రేసియా ఎలువతింగల్, 2019లో క్యాథలిక్ నన్, మరియం థ్రేసియాను సెయింట్ (పునీత)గా ప్రకటించారు.పోప్ మృతి సందర్భంగా భారత ప్రభుత్వం మూడు రోజులు సంతపా దినాలుగా ప్రకటించింది.
ఫ్రాన్సిస్ మృతి పట్ల ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘పోప్ ఫ్రాన్సిస్ పేదల పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయతలను ప్రదర్శించారు. అత్యంత చిన్న వయసు నుంచి ఆయన క్రీస్తు ఆదర్శాలకు అంకితం అయ్యారు. పేద, అణగారిన ప్రజలకు సేవలందించారు. భారతీయుల పట్ల ఆయన ప్రదర్శించిన ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతాయి. సమ్మిళిత, సర్వతోముఖ అభివృద్ధికి ఆయన ప్రేరణగా నిలిచారు’ అని ఆయన కొనియాడారు.
తన వినయం, సత్ప్రవర్తనతో కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న పోప్ ఫ్రాన్సిస్‌ఆధ్యాత్మిక ప్రయాణం చిన్నప్పుడు ప్రేమ విఫలం కావడం వల్ల జరిగి ఉండొచ్చని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు! చిన్నతనంలో తాను సరదాగా అన్న మాటలను భవిష్యత్తులో ఆయనే సాకారం చేసుకున్నారు! బ్యూనస్ ఎయిర్స్‌లోని మెమ్‌బ్రిల్లర్ వీధిలో ఆయన చిన్నతనంలో (12 ఏండ్ల వయసులో) తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న రోజుల్లో తన పొరుగింట్లో ఉండే అమలియా డామెంటే అనే బాలికతో ప్రేమలో పడ్డారు! జార్జ్ తనకు రాసిన ప్రేమలేఖ గురించి అమలియా గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘నాకింకా బాగా గుర్తుంది. అతడు ఎరుపు రంగు పైకప్పు ఉన్న చిన్న తెల్ల రంగు ఇంటి చిత్రాన్ని గీసి నాకిచ్చాడు. మనం పెండ్లి చేసుకున్నప్పుడు ఈ ఇంటిని నేను కొంటాను. నువ్వు నన్ను పెండ్లి చేసుకోకపోతే, నేను ప్రీస్ట్(మతాచార్యుడు) అవుతా! అని అన్నాడు’ అని ఆమె చెప్పారు. అయితే అవి పిల్ల చేష్టలు తప్ప మరేమీ కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయం తెలిసి తన తల్లి తనను అప్పట్లో కోప్పడ్డారని ఆమె తెలిపారు. ఆ తర్వాత తామిద్దరం కలవకుండా తన తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఆమె వెల్లడించారు. ఆ తర్వా త తమ ఇద్దరి కుటుంబాలు వేర్వేరు ప్రదేశాలకు వెళ్లిపోయాయని చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడూ జార్జ్‌ను కలవలేదని ఆమె తెలిపారు.