రజినీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “కూలీ” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రజినీ స్టైలిష్ లుక్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది. అమీర్ ఖాన్, ఉపేంద్ర, నాగార్జున, శ్రుతి హాసన్ లాంటి స్టార్ కాస్ట్‌తో సినిమా మరింత ప్రాముఖ్యత పొందింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం సౌత్‌లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలోనూ భారీగా విడుదలకు సిద్ధమవుతోంది.
ఇటీవల చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కీలక షెడ్యూల్‌ను ముగించిన చిత్రబృందం, త్వరలోనే హైదరాబాద్, వైజాగ్ లో ఆఖరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించనుంది. మార్చి కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసి, ఫిబ్రవరి చివరలో గ్లింప్స్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మొదట మే 1న కార్మికుల దినోత్సవ సందర్భంగా సినిమాను రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఆగస్టు 15వ తేదీకి విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్‌మెంట్స్ కొనుగోలు చేసిందనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. లోకేష్ కనగరాజ్ గత చిత్రం “లియో” కూడా సితార సంస్థ ద్వారా తెలుగులో విడుదల కాగా, దానికి రూ.20 కోట్లకు రైట్స్ కొనుగోలు చేసి, రూ.9 కోట్ల లాభం సాధించారు. ఆ విజయాన్ని పరిగణనలోకి తీసుకుని కూలీ హక్కుల కోసం సితార ముందుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు విడుదలైన టీజర్, పోస్టర్లకు విశేష స్పందన రావడంతో కూలీపై మరింత పాజిటివ్ బజ్ ఏర్పడింది. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ హీరో సినిమా కావడం, లోకేష్ కనగరాజ్ క్రేజ్ ఉన్న నేపథ్యంలో, ఈ చిత్రం టాలీవుడ్‌లో సైతం భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద సితార ఎంటర్టైన్‌మెంట్స్ ఈ ప్రాజెక్ట్ ద్వారా మళ్లీ బిగ్ లాభాలు అందుకునే అవకాశం ఉంది. కూలీ తెలుగు హక్కులు ఎంతకు డీల్ అయ్యాయన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.