ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆరు హామీల్లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మరో పథకాన్ని ప్రారంభించారు. సోమవారం నాడు.. తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కీమ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి రూ. 6 వేల కోట్ల రాయితీ రుణాలు మంజూరు చేయనున్నారు. ఒక్కో లబ్దిదారుడికి రూ. 4 లక్షల వరకు రుణం మంజూరు చేయనున్నారు. 60 నుంచి 80 శాతం వరకు రాయితీతో ఈ రుణాలు మంజూరు చేయనున్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. జూన్ 2వ తేదీన రాయితీ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది.
రిజర్వేషన్ల సాధనకు తాను నాయకత్వం వహిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కలిసి కట్టుగా అందరం ప్రధాని మోదీ వద్దకు వెళ్దామని ఆయన అన్ని పార్టీలకు పిలుపు నిచ్చారు. ఆ క్రమంలో ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ క్రమంలో తాము రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ సైతం తీసుకుంటామన్నారు. ఈ బిల్లు కోసం లోక్ సభలో పోరాటం చేయాలని ఆయనను కోరతానని తెలిపారు. ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సైతం కలిసి రావాలని కోరుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.
మంగళవారం అసెంబ్లీలో ఆమోదానికి బీసీ రిజర్వేషన్ బిల్లు వచ్చింది. ఈ బిల్లు ఆమోదం కోసం చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 42 శాతానికి బీసీ రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించి.. ఈ బిల్లు పెట్టామని పేర్కొన్నారు. అలాగే రాజకీయంగానూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. బీసీలకు రిజర్వేషన్లపై పార్టీలకతీతంగా ఐక్యంగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 1979లోనే ఈ రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ వేశారని గుర్తు చేశారు. మండల్ కమిషన్‌తోనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత అని ఆయన గుర్తు చేశారు.
కులగణన, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ఏడాది లోపు పూర్తి చేస్తామని చెప్పారు. రిజర్వేషన్లపై కేంద్రం అంగీకారం కోసం పోరాడతామని వెల్లడించారు. తెలంగాణలో 56.36 శాతం బలహీనవర్గాలు ఉన్నాయని వివరించారు. బలహీనవర్గాలకు అండగా నిలబడాలనే.. కామారెడ్డి సభలో డిక్లరేషన్ పెట్టామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చెప్పినట్లే.. తెలంగాణలో కులగణన చేశామన్నారు. గతేడాది ఫిబ్రవరి 4న కేబినెట్‌లో తీర్మానం చేశామని చెప్పారు. తొలి దఫా సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశమిచ్చామన్నారు. 3.55 కోట్ల మందికిపైగా సంపూర్ణ వివరాలు అందించారన్నారు. ఈ సర్వేలో 75 వేలమంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. కుల గణన సర్వే నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇక 2023 ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో పార్టీ కొలువు తీరింది. ఈ నేపథ్యంలో 2025 ఏడాది ప్రారంభంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణన చేపట్టింది. అయితే ఈ సర్వేలో బీసీల శాతం తగ్గిందంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. అంతేకాకుండా ఈ సర్వే అంతా తప్పుల తడకగా అభివర్ణించింది. ఇక ఈ విమర్శలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలంగా తొసిపుచ్చింది. అలాగే కులగణనలో పాల్గొనని వారి కోసం మరో అవకాశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే.